అనుభవాలూ-జ్ఞాపకాలూనూ

కొన్ని రోజుల క్రితం శ్రీపాద వారి “అనుభవాలూ-జ్ఞాపకాలూనూ” మొదలుపెట్టినప్పుడు నిజంగా పూర్తి చేస్తాను అనుకోలేదు. నాలుగైదేళ్ళ క్రితం మొదలుపెట్టి, మొదటి భాగం ముగుస్తూ ఉండగా, ఈ భాష మనకర్థం కాదులే అనుకుని వదిలేసినట్లు గుర్తు. ఈసారి మరి పారాయణ గ్రంథంలా రోజూ కొంచెం కొంచెం చదువుతూ పూర్తి చేసాను. నా మట్టుకు నాకు ఇదొక మర్చిపోలేని పఠనానుభవం. శ్రీపాద సుబ్రమణ్యశాస్త్రి గారి కథలు, వాటిలో తెలుగుతనం గురించి నేను మళ్ళీ ప్రత్యేకంగా చెప్పడం అవసరం లేదు అనుకుంటాను. తెలుగులో పిల్లల కథలు కాక నేను చదివిన మొదటి కథలు వీరివే కావడం వల్లా, పదహారు పదిహేడేళ్ళ వయసులో అవి నాపై చాలా ప్రభావం చూపడం వల్లా, తరువాత తక్కినవి కూడా చదువుతూ వచ్చినా, ఆయన కథలని తలచుకుంటే అమ్మతో కబుర్లు చెబుతుంటే ఉన్నంత హోమ్లీగా అనిపిస్తూ ఉంటుంది. అలాంటి శ్రీపాద సుబ్రమణ్య శాస్త్రి గారు చెప్పిన ఆత్మకథ కాని ఆత్మకథని ఈసారి మట్టుకు అర్థం కాని పదాలు అర్థం చేస్కుంటూ, మూడు భాగాలూ పూర్తి చేసాను. ఊరికే పూర్తి చేయడం కూడా కాదు, రోజూ కొన్ని భాగాలు మళ్ళీ మళ్ళీ చదివాను – కొన్ని లైన్లు బ్లాగులోకి టైపు చేసాను… చదవని సమయాల్లో కూడా దీన్నే తలుచుకుంటూ పెక్కుమందికి దీని గురించి చెప్పాను కూడా…అంతలా ఆకట్టుకుంది నన్ను.

శాస్త్రి గారు ఏమి రాసినా దానికి చదివించే తత్త్వం ఉంటుంది. ఇది ఆత్మకథ అయినప్పటికీ, కథన తీరులో ఆయన ఏ కథకీ తక్కువ కాదు అనిపించింది నాకు. మధ్య మధ్య ఏదో చెబుతూ, ఉపన్యాస ధోరణిలోకి వెళ్ళిపోయి ఇంకేదో విషయం చెప్పడం అదీ జరక్కపోలేదు. కానీ, ఈ పక్కదారుల మధ్య కూడా, మనం దారి తప్పే అవకాశం మాత్రం చాలా తక్కువ. వారి కుటుంబ నేపథ్యం, తండ్రి-అన్న గార్ల అభిప్రాయాలూ, శాస్త్రి గారు కలిసిన మనుషుల మధ్య సంస్కృత భాషపై గల అభిమానం – ఇదంతా చదివాక, శాస్త్రి గారి ఆలోచనలు చదివితే, ఆయన ఆకాలానికి, ఆ నేపథ్యానికి “ahead of times” అనిపించింది నాకైతే. అలాగని, వారి అభిప్రాయాలే అభిప్రాయాలనీ, వారి భావాలే ఆ కాలపు సమాజానికి ప్రతిబింబాలనీ నేను అనుకోలేను కానీ, ఆయన మంచి ఆలోచనాపరులు అని మాత్రం అనగలను.

శాస్త్రి గారికి తెనుగు అభిమానం కొంచెం కొంచెం గా మొదలవడం చెబుతూ ఉన్నప్పుడు, తనని మొట్టమొదట ఆకర్షించిన “మదనకామరాజు కథలు” ఎలా పరిచయం అయ్యాయో చెప్పిన కథ చాలా ఆసక్తికరంగానూ, ఆశ్చర్య కరంగానూ అనిపించింది. ఇక్కడ నుంచి ఆయన తెలుగు భాష గురించి, తెలుగు సంస్కృతి గురించి, జాతీయభావనకీ – తెనుగు దేశ భావనకి మధ్య ఉన్న సంబంధం గురించీ చెప్పినప్పుడూ, “చచ్చు తెనుగు పోనిస్తూ” అనుకుంటున్న అప్పటి తన చుట్టుపక్కల వారి మధ్యన, కుటుంబ సభ్యుల నిరసన మధ్యన కూడా తాను తెలుగులో రాసేందుకే కృషి చేయడం గురించీ చదువుతూ ఉంటే : ఒక మనిషి తెలుగుని ఇంతగా ప్రేమించాడా! ఇలాగ కూడా ప్రేమించవచ్చా భాషని! అనిపించింది. ఆ పరంగా, ప్రతి తెలుగు వాడూ ఈ పుస్తకం – కనీసం ఆయన తెలుగు గురించి రాసిన భాగాలు : చదవాలేమో అనిపిస్తోంది. ఆ పై, తెనుగంటే చిన్నచూపూ, మరొక భాష ఏదన్నా మాట్లాడడం “కూల్” అనీ అనుకునే అందరూ ముఖ్యంగా తప్పకుండా చదవాలి ఈ పుస్తకం (ఈ “కూల్” వాళ్ళు ఎలాగో వచ్చి ఈ వ్యాసం చదవరనుకొండీ, అది వేరే విషయం!!)

ఇక, రచనలు చేయాలన్న కోరికా, దాన్ని నిజం చేసుకునే ప్రయత్నంలో ఆయనకీ ఎదురైన అనుభవాలూ, ఆయన ఏదన్నా రాయడానికి పూనుకున్నాక రాసే పద్ధతీ – వీటి గురించి రాసిన భాగాలు : రాయాలి, రాసి పుస్తకం అచ్చులో చూసుకోవాలి అన్న ఆసక్తి ఉన్న వారు ఎవరైనా తప్పనిసరిగా చదవాల్సినవి. అప్పటికీ ఇప్పటికీ పద్ధతుల్లో తేడా వచ్చి ఉండవచ్చు…రాకపోయి కూడా ఉండవచ్చు. కానీ, ఎంత బలమైన కోరికతో, తపనతో శాస్త్రి గారు రచయిత అయ్యారో తెలుసుకోవడం చాలా స్పూర్తివంతంగా అనిపించింది. ఇక దానితో పాటు, తిరుపతి వెంకట కవులతో వివాదం, ఇతరత్రా ఆ కాలపు సాహితీ ప్రపంచంలో జరిగిన చర్చలు, విశేషాలు గట్రా – పుట్టుకతోనే కబుర్ల ప్రేమికురాలిని అయిన నన్ను ఎప్పట్లాగే ఆసక్తితో చదివించాయి. అలాగా, శాస్త్రి గారి వ్యక్తిగత జీవితం గురించి కూడా ఇంకాస్త వివరంగా ఉంటుందేమో అని ఊహించాను -అంటే, వయసు పెరిగే కొద్దీ, ఆయనకీ రచయితగా పేరు ప్రఖ్యాతలు వచ్చే కొద్దీ కుటుంబ సభ్యులతో, ముఖ్యంగా భార్యతో వారి అనుబంధం గురించి… ఆయన మామూలు సాంఘిక కథలు రాయడం మొదలుపెట్టడం గురించి…ప్రబుద్ధాంధ్ర నిర్వహణ విశేషాలు-వగైరా. అదొక్కటే ఈ పుస్తకంలో కనబడ్డ లోటు. కానీ పుస్తకం అర్థాంతరంగా ఆగిపోవడం దీనికి కారణం కావొచ్చు.

శాస్త్రి గారి ఆర్థిక ఇబ్బందుల గురించి చదువుతున్నప్పుడు, ముఖ్యంగా చివర్లో పురిపండా అప్పలస్వామి గారికి రాసిన వీలునామా చూసినప్పుడు : మనసుకి చాలా బాధగా అనిపించింది. అలాగే, అష్టావధానం చేయడానికి ఎలాంటి పరిస్థితుల్లో సిద్ధపడ్డానో చెబుతున్నప్పుడు కూడా. ఎందుకు వారికీ పరిస్థితి? అన్న దానికి కారణాలు నేను వెదకలేను (నాకు అనవసరం కూడా). అయినా కూడా, ఆ బాధ ఆగమనాన్ని నేను ఆపలేకపోయాను.

శాస్త్రి గారి మరణంతో ఎనిమిది సంపుటాలుగా రావాల్సిన ఈ పుస్తకం ఆకస్మికంగా ఆగిపోయిందట. ఏదో నిధిని శాశ్వతంగా కోల్పోయాము మనం అందరం – అనిపించింది.

ఇకపోతే, ఈ పుస్తకాన్ని మళ్ళీ ఒక్కసారి అందరికీ స్ట్రాంగ్ గా చదవమని చెబుతూ, ఎందుకు? అన్న వారికి జవాబుగా నాకు తోచిన ముఖ్య కారణాలు కొన్ని:
౧) ఇందులో చెప్పబడ్డ జీవితమూ, సమాజమూ : ఇప్పటి జీవితంతో బొత్తిగా సంబంధం లేనిది అని నాకు అనిపించింది. ఒకప్పుడు మన ఆంధ్రదేశంలోనే ఇలా ఉండేవి పద్ధతులు – అని తెలుసుకోవడానికి… నిజానికి ఎప్పుడో యాభై ఏళ్ళ నాడు ఈ పుస్తకం వచ్చినప్పుడే, రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ గారు – “ఈ పుస్తకం చదవకపోతే, ఈ కాలంవారికెవరికీ ఇటువంటి ప్రపంచమొకటి ఉండినదని ఊహించడానికైనా వీలులేదు. కాలపరిస్థితులంతగా మారిపోయినవి. నిజంగా మనమెన్ని యుగాలు దాటినామో?” అన్నారంటే ఊహించుకొండిక!
౨) చక్కటి, చిక్కటి తెలుగు భాషలో మునిగి తేలడానికి (పదాలు అర్థం కాకపోతే వెదుక్కు తెలుసుకుని మరీ ఆస్వాదించడానికి)
౩) తెలుగులో ఎందుకు మాట్లాడాలో, ఎందుకు చదవాలో, “తెలుగు” ఐడెంటిటీ అవసరం ఏమిటో తెలుసుకోవడానికి
(అసలు ఈయన రాసిన వాక్యాలు ఎందుకు ఉపయోగించుకోలేదు ఈ అధికార భాష సంఘాలూ వాళ్ళు? ఈజీగా జనాల్ని ఆకర్షించొచ్చు అనిపించాయి నాకైతే)
– అసలివన్నీ కాదండీ… మీరు తెలుగుదేశంలో పుట్టి మీకు తెలుగు చదవడం వస్తే చాలు…. శ్రీపాద వారి “అనుభవాలూ-జ్ఞాపకాలూ” మీకు మస్ట్ రీడ్.

పుస్తకం మార్కెట్లో దొరకట్లేదు అని కొందరూ, దొరుకుతోందని కొందరూ అంటున్నారు. నేను మా యూనివర్సిటీ లైబ్రరీ నుండి అరువు తెచ్చుకున్నాను. కనుక, బయట దొరుకుతోందో లేదో నాకు తెలియదు. పుస్తకంలో అచ్చుతప్పులు కొన్ని ఉన్నాయి…ముఖ్యంగా మూడోభాగంలో ఎక్కువ ఉన్నట్లు తోచింది నాకు. అయితే, పఠనానుభవాన్ని అడ్డుకునేన్ని అయితే లేవు.

(ఈ పుస్తకం గురించి ఇదివరలో పుస్తకం.నెట్లో వచ్చిన మరో వ్యాసం ఇక్కడ చదవండి. అలాగే, ఈ పుస్తకం ఈ-పుస్తకం గా డీ.ఎల్.ఐ. సైటులో లభిస్తుంది. వారు దాన్ని “Sripada Subramanyasastri Experiences And Memories” పేరిట, ఇక్కడ భద్రపరిచారు.)

You Might Also Like

5 Comments

  1. 2012లో చదివిన పుస్తకాలు | పుస్తకం

    […] అనుభవాలూ,జ్ఞాపకాలూనూ: ఈ రచయిత గురించిగానీ, ఈ రచన […]

  2. కొత్తపాళీ

    మొత్తానికి పూర్తి చేసినందుకు అభినందనలు, సౌమ్యా. ఎప్పటికప్పుడూ పునర్ముద్రిస్తూ ఉండాల్సిన తెలుగు పుస్తకాల్లో ముఖ్యమైనది ఈ పుస్తకం. కేవలం ఆ భాషని వంట పట్టించుకోవడానికి, (పైత్యాంతక రసంలాగా) అప్పుడప్పుడూ కొంచెం చదువుకుంటూ ఉంటాను.

  3. రాజేంద్ర కుమార్ దేవరపల్లి

    శ్రీపాద రచనలు చదవనివారు తెలుగువారెలా అవుతారో నాకు తెలియదు గానీ,తెలుగు భాష,సంస్కృతి,సంప్రదాయమంటూ వేదికలెక్కి ఉపన్యసించేవారు,రీముల కొద్దీ రాసేవారిలో చాలామంది ఆయన్ను చదవరు అని ఘంటాపథంగా చెప్పగలను.కారణాలు మనం ఊహించగలం.
    నావరకు నాకు ఆయన పరమపూజ్యులు.

  4. పంతుల గోవాల కృష్ణ

    సౌమ్య గారికి, మంచి పుస్తకాన్ని పరిచయంచేసారు.నేనీ పుస్తకాన్ని ఇదివరలోనే ఎన్నో పర్యాయాలు చదివాను.ముఖ్యంగా వారి తెలుగు భాషకోసమూ ,60,70 సంవత్సరాలక్రితం సాంప్రదాయక బ్రాహ్మణుల కుటుంబాల జీవితాలు ఎలా ఉండేవో తెలుసుకోవడానికి చాలా పనికి వస్తుంది.ఆనాటి పండితుల్లో తెలుగంటే ఉన్న ఈసడింపు మనకి అర్థమవుతుంది.ఈ విషయాల్ని భాషగురించిన నా వ్యాసాల్లో నేను పేర్కొన్నాను. నప్రతిగృహీతృత్వం గురించి వారు చెప్పిన విషయాలు అందరూ తెలుసుకోవాలనే కోరికతో రెండురోజులక్రిందటే నా బ్లాగులో(www.apuroopam.blogspot.com)లో డబ్బంటే ముద్దా?ముద్దంటే చేదా? అనే పోస్టులో వివరంగా వ్రాసేను.మీ లాగే నాకుకూడా కబుర్లంటే ఇష్టం కాబట్టే కావచ్చు ఈపుస్తకం నా పుస్తకాల అరలో భద్రంగా కొలువుదీరింది.
    .నాకు కథలకంటే ఈ కబుర్లంటే ఎందుకిష్టమంటే ఇవి ఆనాటి సంఘాన్ని కళ్లకు కట్టినట్లు మనముందు నిలబెడతాయికనుక. శాస్త్రిగారి కథలన్నీకూడా అపురూపమైనవే. తెలుగు భాషాభిమానులందరూ చదివి తీరాల్సిన పుస్తకాలు శ్రీ పాదవారి కథలూ..అనుభవాలూ..జ్ఞాపకాలున్నూ

  5. లలిత (తెలుగు4కిడ్స్)

    సౌమ్యా, ఈ పుస్తకం పరిచయం చేశావు. నా చేత చదివించావు. చివరికి నా భావలు ఎలా చెప్పాలో తెలియకపోతే నీ వ్యాసం అందుకు అరువిస్తున్నావు. నిజంగానే, ఇంకో ప్రపంచం తెలుస్తుంది. నాకూ అనుమానం వచ్చింది ఈయన తెలుగు భాష గురించి చెప్పిన విషయాలు ఎవరూ ఉదహరించడం విన్నట్టు లేదే అనిపించింది. ఇంతకన్నా ఇంక చెప్పవలసింది ఏముంది, మన భాషని మనం మనది అని అనుకోవడానికి అనీ అనిపించింది. కుటుంబ సభ్యులలోనూ తన రచనాభిలాషతో సంబంధం ఉన్న వారి గురించే ఎక్కువ చెప్పారు. నువ్వన్నట్లు ఎనిమిది భాగాలు వ్రాయాలనుకున్నారంటే ఎంత నష్టపోయామో కదా నిపిస్తోంది. చివరికి ఆయన వ్రాసిన లేఖతో ముగించారు. కాస్త కష్టపడి వారి కుటుంబం ఆయన తర్వాత ఎలాంటి పరిస్థితులని ఎదుర్కొందో కాస్తంత పరిశోధించి జత చేస్తే ఎంత బావుండేది! ఉత్సాహంగా చదువుకుంటూ వచ్చాను చివరంటా, ఆయన కష్టాలతో సహా. ఎందుకంటే ఆయన కష్టాలను ప్రస్తావించారు కానీ వాటిని గురించి ఆయన ఆలోచించిన తీరు కూడా ఒక రకమైన ఉత్సాహాన్నే ఇచ్చిందని చెప్పాలి. కానీ చివరికి ఒక్కసారిగా చెప్పలేని బాధ కలిగింది. ఆప్తులైన వారి గురించి ఆరాటపడిన భావం కలిగింది.
    నన్ను బాధించిన ఇంకో విషయం. హైదరాబాదులో అప్పుడప్పుడూ ఇంటికి బ్ర్రహ్మణులు కొందరు వచ్చి వేదమంత్రాలు చెప్పి ఆశీర్వచనం చెప్పి వెళ్ళే వారు. అప్పుడప్పుడూ ఏదైనా ఇచ్చే వాళ్ళం. ఒక్కో సారి ఇవ్వకపోయిన రోజులూ ఉన్నాయి. అవి కూడా గుర్తుకు వచ్చి ఆ కాలానికే పాత అలవాట్లు పూర్తిగా మరుగునపడిపోయి వాటిని నమ్ముకుని ఆ నమ్మకంతో జీవిస్తున్న వారికి తగినంత ఆదరం చూపించలేదే అని కూడా బాధ వేసింది.అంటే ఆ జీవనశైలే పరిచయం లేదు. బ్రాహ్మణులు కదా అని సాయం చేస్తున్నట్లు అనిపించేది.
    ఈ పుస్తకం చదివి తీరాలి అందరూ.

Leave a Reply