స్కోలస్టిక్ వారి ప్రతినిధితో….

మా ఆఫీసు ప్రాంగణంలో ఆ మధ్య రెండ్రోజులు ప్రముఖ పిల్లల పుస్తకాల ప్రచురణ సంస్థ “స్కోలస్టిక్” వారి పుస్తక ప్రదర్శన జరిగింది. నేను ఊరికే దాన్ని చూసేందుకు నా స్నేహితురాలు సాహితి తో వెళితేనూ, తను మీసైటుకు ఇంటర్వ్యూ చేయొచ్చు కదా అని సలహా ఇచ్చింది. అర్రే! మనమెంత మంచి అవకాశం మిస్సైపోయేవాళ్ళం! అనుకుని, తరువాత మేమిద్దరం వెళ్ళి స్కోలస్టిక్ వారి ప్రతినిధి KVLN Murthy గారితో కాసేపు వారి ప్రచురణల గురించి మాట్లాడాము. ఆ సంభాషణ సారాంశం ఇక్కడ పోందుపరుస్తున్నాను.

స్కోలస్టిక్ గురించి:

స్కోలస్టిక్ ప్రపంచంలో అతిపెద్ద పిల్లల సాహిత్య ప్రచురణ సంస్థ. దాదాపు 15 దేశాలలో వీరి కార్యాలయాలు ఉన్నాయి. వీరి రచయితలలో జే.కే.రౌలింగ్ కూడా ఒకరు. భారతదేశంలో స్కోలస్టిక్ వారి కార్యాకలాపాలు 1997 లో మొదలయ్యాయి. స్కోలస్టిక్ ఇండియా వారు రస్కిన్ బాండ్, మంజులా పద్మనాభన్, సమిత్ బసూ వంటి వారున్నారు. సంస్థ గురించిన వివరాలకు వారి వెబ్సైటును చూడగలరు.

ఇంటర్వ్యూ:

ప్ర: స్కోలస్టిక్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్న సంస్థ కదా. భారతదేశంలో ఎన్నాళ్ళుగా ఉంది?
జ: దాదాపు 15 సంవత్సరాలుగా భారతదేశంలో ఉందనుకుంటాను. ఇప్పుడు ఇక్కడ తొమ్మిది బ్రాంచీలు ఉన్నాయి. గుర్‍గావ్ శాఖ మాకు ప్రధాన కార్యాలయం. మా పుస్తకాలు అక్కడ్నుంచే సరఫరా అవుతాయి. హైదరాబాద్ లో గత 10 ఏళ్ళ బట్టీ ఉందనుకుంటాను. నేను ఇక్కడికొచ్చి మూడేళ్ళే ఔతోంది. అబిడ్స్ లో ఉన్న మా బ్రాంచి ఆఫీసు ద్వారా కార్యకలాపాలు నడుపుతున్నాము.

ప్ర: మీ పుస్తకాలు బయట ఏ షాపులోనూ చూసినట్లు లేదే..
జ: మేము సొంతంగా మార్కెట్ చేసుకుంటామండీ. వేరే షాపులతో మాకేమీ వ్యాపార సంబంధాలు లేవు, పుస్తకాల అమ్మకం గురించి. మేము ఇంకొకరి పుస్తకాలు అమ్మము, మా పుస్తకాలు ఇంకొకరికి ఇవ్వము. ఇక్కడ ప్రదర్శనలో, కొన్ని పెంగ్విన్ బుక్స్ ఉన్నాయి లెండి, కానీ, సాధారణంగా మా పుస్తకాలకి మేమే – sole marketer and publisher.

ప్ర: మీకు ఈ పుస్తకాలు ఎక్కడ్నుంచి వస్తాయి? మాకేదన్నా పుస్తకం కావాలి అంటే తెప్పించగలరా?
జ: మాకు గుర్గావ్ శాఖ నుండి పుస్తకాలు వస్తాయి. మీకు కావాల్సిన పుస్తకాలు మా ప్రచురణలు అయితే, తప్పకుండా తెప్పించగలము.

ప్ర: మీరు ఏ షాపులకీ మీ పుస్తకాలని ఇవ్వరు అన్నారు కదా..మరి అమ్మకాలు ఎలాగా?
జ: మేము నేరుగా స్కూళ్ళతోనే మాట్లాడుతాము. అంతే కాక, ఇలా మూడునాలుగు నెల్లకొకసారి పుస్తక ప్రదర్శనలు నిర్వహిస్తూ ఉంటాము. స్కూళ్ళలో బుక్ క్లబ్స్ నిర్వహిస్తాము.

ప్ర: బుక్ క్లబ్స్ అంటే ఏం చేస్తారు?
జ: అంటే, స్కూల్లో ఓ జాబితా ఇచ్చి, తమకి కావాల్సిన పుస్తకాలను ఎంచుకొమ్మని పిల్లలకి చెప్తారు. తరువాత ఆ ఎంపిక చేసిన పుస్తకాలను మేము సరఫరా చేస్తాము.

ప్ర: అయితే, స్కూళ్ళతో ఈ సంబంధాలు ఎంతవరకూ ఉన్నాయి హైదరాబాద్ లో?
జ: మాకు హైదరాబాద్ లో దాదాపు 350 స్కూళ్ళతో అనుబంధం ఉంది. అన్ని ప్రముఖ స్కూళ్ళలోనూ మా పుస్తకాలు ఉన్నాయి.

ప్ర: మీరు టెక్స్ట్ బుక్స్, వర్క్ బుక్స్ వంటివి కూడా ముద్రిస్తారా?
జ: లేదు. మేము టెక్స్ట్ బుక్స్ ముద్రించము. అయితే, educational books ముద్రిస్తాము.

ప్ర: ఇక్కడ పుస్తకాలూ అవీ చూస్తే, అన్నీ విదేశీ రచయితలవే ఉన్నాయి. మరి, పిల్లలకి వీళ్ళ గురించి బాగానే తెలుసా? ఈ పుస్తకాలను చదువుతారా?
జ: పెద్ద స్కూళ్ళలో చదివే పిల్లలకి ఈ సాహిత్యం గురించి బాగానే అవగాహన ఉందండీ. అలాగే, చాలా సందర్భాల్లో పిల్లల తల్లిదండ్రులకి కూడా ఏ పుస్తకం ఎలా ఉంటుందో సుమారు అవగాహన ఉంటోంది.

ప్ర: మీ పుస్తకాల్లో భారతీయ రచయితలెవరూ లేరా?
జ: ఉన్నారు కానీ, ఓ 10-15 శాతం ఊంటారంతే. విదేశాల్లో మాకు ప్రత్యేకంగా రచనలు చేసే రచయితలు ఉన్నారు. ఇక్కడ మీరు చాలా పుస్తకాలు చూస్తూనే ఉన్నారు కదా – ఇవన్నీ అలా ప్రొఫెషనల్ రచయితలు రాసినవే.

ప్ర: పిల్లలు ఎలాంటి సాహిత్యాన్ని ఇష్టపడుతూ ఉంటారు?
జ: పిల్లలు బొమ్మల పుస్తకాలు, కథలు ఇటువంటివి ఎంచుకుంటూ ఉంటారు, వాళ్ళ తల్లిదండ్రులు మాత్రం ఎప్పట్లాగే విద్యా సంబంధమైన పుస్తకాలని ఎంచుకుంటూ ఉంటారు.

ప్ర: హహహ… అదిసరే, ఇంత పెద్ద సంస్థ కదా, మీ ప్రచురణలు భారతీయ భాషల్లో తెచ్చే ఆలోచన ఏదీ లేదా?
జ: ప్రస్తుతానికి కొన్ని హిందీ టైటిల్స్ వచ్చే అవకాశం ఉంది.

ప్ర: అదేమిటండీ, ప్రాంతీయ భాషల్లో పుస్తకాలు వస్తే కదా మన భాషల్లో పిల్లల సాహిత్యం పెరిగేది?
జ: కంపెనీకి అలాంటి ఆలోచనలు ఉన్నాయో లేదో నాకు తెలియదండీ. అయితే, నాకు అవకాశం వస్తే, ఇలాంటి ఆలోచనలు వారికి తెలియజేస్తాను.

ప్ర: హైదరాబాదు లో కాకుండా రాష్ట్రంలోని వేరే ప్రాంతాల్లోని స్కూళ్ళను కలిసే ఆలోచనలు లేవా?
జ: ఉందండీ. ఇది ప్రధానంగా టెలీమార్కెటింగ్ ద్వారా జరుగుతుంది. ప్రయత్నాలు ఈ మధ్యే మొదలయ్యాయి.

ప్ర: మీరిక్కడకి ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారు కదా, అమ్మకాలు ఎలా ఉన్నాయి?
జ: ఇక్కడ సాధారణంగా బాగానే ఉంటాయండీ అమ్మకాలు. అయితే, ఈ సంవత్సరం కొద్దిగా తగ్గినట్లు అనిపించింది.

ప్ర: ఎందుకంటారు?
జ: చూస్తూనే ఉన్నారు కదండీ, పిల్లలకి రకరకాల ఆటలు, పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ సందడిలో మరి సహజంగానే పిల్లల దృష్టి వాటిపైనే ఉంటుంది కదా…

ప్ర: హహ… మరి, మీరు పుస్తకాలు కాకుండా, పిల్లలకోసం ఇతరత్రా ఏవన్నా అమ్ముతారా? అంటే, word games, puzzles వంటివి?
జ: మేముగా పుస్తకాలు కాకుండా వేరే వాటిపై దృష్టి పెట్టలేదండీ. అయితే, కొన్నింటిని ఔట్సోర్స్ చేస్తున్నాము ఇప్పుడిప్పుడే.

ప్ర: ఇంతకీ, మిమ్మల్ని మీ పుస్తకాల కొనుగోలు విషయమై సంప్రదించాలంటే ఎక్కడ సంప్రదించవచ్చు?
జ: మా అబిడ్స్ ఆఫీసులో సంప్రదించవచ్చు.

ప్ర: మీ కేటలాగ్ ఏదన్నా ఉందా?
జ: మా అబిడ్స్ ఆఫీసు కు రండి, అక్కడ ఉంటుంది. మా సేల్స్ ఔట్‌లెట్, వేర్‌హౌజ్, రెండూ అదే.

తరువాత, ఆయనకి థాంక్స్ చెప్పి, అక్కడనుంచి బయటకొచ్చాము. స్కోలస్టిక్ వారిని సంప్రదించాల్సిన చిరునామా:

Scholastic India Pvt Ltd
5-8-369-1/C, 1st Floor, Clock House-2002
Chirag Ali Lane, Abids, Hyderabad-500001
phone: +91-40-65966268

వెబ్సైటు: www.scholasticindia.com

You Might Also Like

Leave a Reply