టెక్నాలజి మాయావలయంలో Alone, Together!

Let someone down అనే ఆంగ్ల పదసమూహానికి నిరాశపరచటం, పెట్టుకున్న అంచనాలను అందుకోలేకపోవటం అన్న అర్థాలు ఉన్నాయి. అలా నిరాశపరచటంలో మనుషులది ఎంత అందవేసిన చేయో, మనుషులు సృజించిన సాప్ట్-వేర్‍లూ అంతేనని నాకు అనిపిస్తూ ఉంటుంది. నేను చక్కగా పనిజేస్తుందని ఒక సాప్ట్‍వేర్‍ సిఫార్సు చేశాక, అది మొరాయిస్తుంది. నేను అంత బాలేదని కితాబిచ్చాక, చకచకా పనిజేస్తుంది. అలాంటి భంగపాట్లలో ఒకటి పోయిన వారం జరిగింది. goodreads.com ఇటీవల ప్రవేశపెట్టిన Recommendations feature (మనం చదివున్న, చదవబోతున్న పుస్తకాల ఆధారంగా మనకి కొత్త పుస్తకాలను సూచించటం) సరిగ్గా పనిజేయటం లేదని చెప్తూ, దాని పనితీరును చూపించాలని సైటు ఓపెన్ చేస్తే, ఒకట్రెండు అవకతవక రికమెండేషన్స్ కనిపించాయి. నేనింకా విజృంభించే లోపు “Alone Together” అన్న పుస్తకం చూపెట్టింది. టైటిల్ చూసి డార్క్ రొమాంటిక్ ఫిక్షన్ అనుకున్నాను. కానీ పక్కనే sub-text, “Why we expect more from technology than from each other”అని చూపించింది. ఆసక్తికరంగా ఉందే అనుకుంటూ, ఏ పుస్తకాన్ని బట్టి ఈ రికమెండేషన్ చేసింది అని చూస్తే, నేను నిరుడు పరిచయం చేసిన “Most Human Human” పుస్తకాన్ని చూపించింది.

ప్రస్తుత పుస్తకం గురించి మాట్లాడే ముందు, Most Human Human గురించి కొంత. ఆ పుస్తకం దేని గురించి అంటే, కంప్యూటర్లకు ఇంటలిజెన్స్ ఉందని ఎప్పుడు అనిపించుకుంటాయంటే అవి మనిషిలా ఆలోచించినప్పుడని ఒకాయన “టూరింగ్ టెస్ట్” అనే పరీక్షను ప్రవేశపెట్టాడు. ఆ పరీక్షలో మనుషులు, మెషీను ఒకరికొకరు కనిపించకుండా మాట్లాడుకుంటారు. అవతల ఉన్నది మెషీన్ అని ఇవతల మనుషులు కనిపెట్టలేంత బాగా సంభాషణ జరిపితే మెషీన్ పరీక్షలో నెగ్గినట్టు. ఈ పరీక్షలో ఇంకో హైలైట్ ఏంటంటే, మనిషిలాగా మాట్లాడి, మనిషి అనిపించుకున్న మనిషికి “మోస్ట్ హూమెన్ హ్యూమెన్” అని కితాబు దక్కుతుంది. అలా కితాబు నందుకున్న ఒకానొక మనిషి తన అనుభవాలను ఒక పుస్తకంగా రాశారు. ఈ పుస్తకం గురించి నా పరిచయ వ్యాసం ఇక్కడ.

ఇప్పుడు ప్రస్తుత పుస్తకంలో అంశం ఏమిటో క్లుప్తంగా చెప్పాలంటే పైన చెప్పబడ్డ పరీక్షలానే మరో కొత్త పరీక్ష గురించి చెప్పుకోవాలి. ఇందులో మీ చేతికి మూడు బొమ్మలు ఇస్తారు: బార్బీ డాల్ – మామూలు ఆటబొమ్మ. ఫర్బీ – ఎలక్ట్రానిక్ రొబొ. ఒక biological gerbil. మనలో జాలి, కరుణలాంటివి పుట్టుకొచ్చేలోగా  వీటిని తల్లకిందులుగా ఎంత సేపు పట్టుకోగలమన్నది ప్రశ్న. బార్బీ బొమ్మను జుట్టుపట్టుకొని వేలాడదీయడంలో పెద్ద సమస్య ఉండదు. కానీ “నాకు నొప్పెడుతుంది. ప్లీజ్.. నాకు బా నొప్పేస్తుంది.” అని ఏడుపు గొంతుతో అర్థించే రొబొను, అది రొబొ అని తెల్సున్నా, ఎక్కువ సేపు దాన్ని వేలాడదీసినట్టు పట్టుకోలేమన్నది ఈ పరీక్ష సృష్టించిన వారి అనుకోలు. పరీక్షా ఫలితాలు కూడా అందుకు అనుగుణంగానే ఉన్నాయి. మొదట చెప్పుకున్న పరీక్ష మెదడుకు సంబంధించింది అనుకుంటే, ఇది మనసుకు సంబంధించింది. ఎందుకంటే చేతిలో ఉన్నది రోబోనే అని తెలుస్తున్నా, దాని బాధ చూడలేక వెనక్కి తిప్పేయటం జరుగుతుంది ఇక్కడ.

ఈ ఒక్క పరీక్ష గురించే కాదు ఈ పుస్తకం. నిరంతరంగా మెషీన్లతో అల్లుకుపోతున్న మన జీవనవిధానాల్లో కలుగుతున్న పెనుమార్పులు ఎలాంటివి? మనకి తెలీకుండానే మనం టెక్నాలజికి ఎలా బానిసలమవుతున్నాం? అసలు పక్కనున్న మనిషికన్నా ఎదురుగా ఉన్న స్కీన్స్ కు ఎందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం? మనుషులు చేయాల్సిన పనులకు మరబొమ్మల అవసరం ఏమిటి? లాంటి కొరుకుడుపడని చాలా ప్రశ్నలకు సమాధానాలు వెతకటం కోసం చేసిన మూడొందల పేజీల ధీర్ఘోపన్యాసం. ఈ పుస్తక రచయిత ఒక సైకాలజిస్ట్. ప్రొఫెసర్. రచయిత. రిసర్చర్ అయిన Sherry Turkle. అరటిపండు వలిచి నోట్లో పెట్టినంత బా రాసుకొచ్చారని చెప్పటం కుదరదు. ఎందుకంటే ఆవిడ ఎంచుకున్న అంశం, అంతకన్నా జటిలమైంది కనుక. అయినా కూడా చదివింపజేసేట్టు రాశారు. విడివిడిగా ఉన్న చాలా దారాలను ఒకటిగా చేసి, శుభ్రంగా పేనినట్టు అనేక అంశాల్లో అంతర్లీనంగా ఉండే విషయాలను గుదిగుచ్చినట్టు చెప్పుకొచ్చారు. పైగా, చిన్నారుల నుండి వయోవృద్ధులు దాకా అనేకుల అభిప్రాయాలను వారి మాటల్లోనే పొందుపరిచారు.

పుస్తకాన్ని ముఖ్యంగా రెండు భాగాలుగా విడదీసారు. ఒకటి సోషల్ రొబోలతో మనుషులు పెంచుకుంటున్న అనుబంధం. ఈ భాగం చదువుతుంటే నేనేదో సై-ఫై ఫిక్షన్ చదువుతున్న భావన కలిగింది. కానీ ఆవిడ ప్రస్తావించిన విషయాల్లో చాలా వరకూ నా చిన్నప్పుడే జరిగిపోయాయి. అమెరికన్ (కిడ్స్ )మార్కెట్‍లో దూసుకొచ్చిన My Real Baby, AIBO, Paro Robotల పనితీరును గురించి, వాటిని వాడుతున్న చిన్నపిల్లలూ, వృద్ధులపై కలుగుతున్న ప్రభావం గురించి చదువుతున్నప్పుడు నాకంతా అయోమయంగా, గందరగోళంగా, I-don’t-belong-here అన్న alien భావన కలిగింది. పిల్లలు ఆడుకోడానికి ఎలక్ట్రానిక్ ఆటవస్తువులను ఇవ్వటం ఒక విషయం. కానీ ఆ రొబొలలో మనుషులను పోలిన చాలా అంశాలు ఉండడం, అవి మనుషులు కాదని తెలుస్తున్నా పిల్లలు వాటికి అల్లుకుపోవటం అనేది నాకింకా అంతుపట్టటం లేదు. అలానే వయసు పైబడిన వారిని జాగ్రత్తగా చూసుకునేందుకు మనుషులకన్నా రోబోలు నయమని చాలా మంది ప్రబలంగా అనుకుంటున్నారని తెల్సీ ఆశ్చర్యపోయాను. ఇదే విషయం రచయిత చాలా అసహనంతో అడుగుతారు.

When children ask, “Don’t we have people for these jobs?” they remind us that our allocation of resources is a social choice. Young children and the elderly are not a problem until we decide that we don’t have the time or resources to attend to them. We seem tempted to declare phases of the life cycle problems and to send in technologies to solve them. But why is it time to bring in the robots ? We learned to take industrial robots in stride when they were proposed for factory assembly lines. Now the “work” envisaged for machines is the work of caring. Will we become similarly sanguine about robotic companionship?

మెకానికల్ పనులకి రొబొలను పెట్టుకోవడంలో పెద్ద వింత లేదు కానీ ఒక కమ్మని పలకరింపు, ఒక చల్లని స్పర్శ, ఒక మెత్తని కౌగిలింత అందివ్వటానికి మనుషులకు తీరక లేదు కాబట్టి, వారి స్థానంలో ఇవ్వన్నీ నేర్పించబడ్డ రోబోలతో చేయించటానికి సుముఖత చూపుతున్నారట. మనిషే మనిషికి ఇంకో alternate వెతుక్కుంటున్నాడు! అదీ విపరీతమైన desperationలో! సాటి మనిషికన్నా మరమనిషిపై ఎక్కువ నమ్మకం పెడుతున్నాడు. ఎంతగా అంటే, ఓ అమ్మ కడుపులో నుండి పుట్టకపోయినా, మరమనిషిని తక్కువగా చూడొద్దు అని వాదించేంతగా! నేను అమెరికా జీవనవిధానానికి మరీ దూరంగా ఉండడం వల్లనేమో, నాకీ అధ్యాయాలన్నీ  విడ్డూరంగా అనిపించాయి. చెప్పిందే చెప్తున్నట్టు అనిపించటం వల్ల కాస్త బోరు కూడా కొట్టించాయి, రొబొ మీది వాదనలు.

రెండో భాగంలో నెట్‍వర్క్ లో చిక్కుకుపోయి, చిక్కుకుపోయామన్న స్పృహ కూడా లేకుండా ఆ వలయంలోనే గిరగిర తిరుగుతున్న మన అందరి గురించి ఆందోళన ఉంటుంది. ముందు పావురాయి సందేశాలు. అవి పోయి ఉత్తరాలు. మధ్యలో టెలిగ్రామ్. ఫోన్ రాకతో అవి మూలనపడ్డాయి. ఆనక ఈ-మెయిల్. టెక్స్టింగ్. ఇన్‍స్టెంట్ మెసేజింగ్. ప్రస్తుతం సోషల్ నెట్‍వర్కింగ్. “మీరేం ఆలోచిస్తున్నారు?” అన్న చిన్న ప్రశ్న మనల్ని ఎక్కడ నుండి ఎక్కడికి తీసుకెళ్తుందో తెల్సుకోవాలంటే ఈ పుస్తకం చదవాల్సిందే! రోజుకింత సమయం అని లెక్కకట్టుకునో, లేక తీరిక వేళల్లో టైం-పాస్ కోసం ఇంటర్నెట్‍పై గేమ్స్, చాటింగ్, సోషల్ నెట్వర్కింగ్ మొదలెట్టాక, మనకి తెలీకుండానే పరిస్థితులు ఎలా చేయిదాటిపోతాయో ఈ పుస్తకం చెబుతుంది. ఇంటర్నెట్‍పై జీవితం నిజజీవితానికి దూరంగా ఉంటుంది. ఇక్క్డడ మనం ఎలా ఉన్నాము? ఏం చేస్తాము? మన అలవాట్లేంటి? మనం నవ్వినప్పుడు ఎలా ఉంటాం? ఎప్పుడు విసుక్కుంటాం? లాంటి విషయాలేవీ అవసరం లేదు. ఒక ప్రొఫైల్. దానికో పేరు. (ఆది అసలు పేరు అయ్యుండాల్సిన అవసరమూ లేదు.) ఆ పేరుకి తగ్గట్టు కొన్ని ఇష్టాయిష్టాలు. ఆ తర్వాత పదిమందికి మనం ఉన్నామని తెల్సేలా వ్యవహరించటం. వాళ్ళు మనల్ని గమనించి మనల్ని “ఫాలో” అవ్వటం. ఆ పై, మనకు ఎలాంటి ఇమేజ్ నప్పుతుందో ఒకటి రెండు సార్లు చూసుకొని, ఇహ దూసుకుపోవటమే! అలా ఎన్ని వేళ నిముషాలు కరిగిపోతాయో మనం గుర్తించలేం. క్షణాల్లో ’స్నేహితులు’ అయిపోయినవారు కష్టకాలంలో తోడుండేవారు కాలేరు. అప్పుడు మళ్ళీ “జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది!’ అనే పాడుకోవాల్సిన అగత్యం.

వీటన్నింటి వల్లా జరుగుతుంది ఏంటంటే, కాఫీ షాపుల్లో, ఏర్‍పోర్ట్ లాంజ్‍లలో, హాస్పిటల్ వెయిటింగ్ రూమ్స్ లలో జనాలు ఉంటారు ఎప్పటిలానే! కానీ ఎవరి వర్చువల్ ప్రపంచంలో వాళ్ళు. పక్కనున్న మనిషికన్నా సుదూరంగా ముఖపరిచయం లేని మరో మనిషో, కాదో తెలీకపోయినా మాట్లాడ్డం. ఎంతలేసి దూరాల్లో ఉన్నా, ఎప్పుడూ కనెక్టడ్‍గా ఉంచడానికి వచ్చిన మొబైల్ ఫోన్లు ఎలా మార్చేసాయంటే, పిల్లల్ని బడి నుండి తీసుకురావటానికి వెళ్ళిన తల్లిదండ్రులు, పిల్లల మొహం కూడా చూడలేనంత బిజిగా ఫోన్లకేసి చూస్తున్నారు, టైపు చేస్తున్నారు, మాట్లాడుతున్నారు. ఇహ, టెక్స్టింగ్, కాలింగ్ వల్ల జరిగే రోడ్డు ప్రమాదాల గురించి ఇందులో అసలు ప్రస్తావించనే లేదు.

ఒంటరితనానికి భయపడే మనిషి ఎన్నుకొంటున్న ప్రతి మార్గమూ అతణ్ణి మరింత ఒంటరినే చేస్తుంది, పాపం! అది మనిషి గ్రహించగలడా? తాను చిక్కుకొన్న మాయాజాలంలో నుండి తననూ, రాబోయే తరాలనూ కాపాడుకోగలడా? ఓ పాతిక, ముప్ఫై ఏళ్ళ పాటు ఇంతటి టెక్నాలజికల్ తుఫానును చూడని ఒక తరమే ప్రస్తుత పరిస్థితులకి ఊపిరాడక కొట్టుకుంటుంటే, ఈ తుఫాననేది నిత్యజీవితంలో భాగమనుకునే చిన్నారుల సంగతి ఏంటి? ప్రపంచం ఇలా ఉండేది కాదు, ఇలానే ఉండనవసరం లేదు అని వారికి చెప్పేది ఎవరు? – ఇలాంటి ప్రశ్నలను మిమల్ని వేధిస్తుంటే ఈ పుస్తకం తప్పక చదవండి.

కేవలం ఫేస్‍బుక్, ట్విటర్ లాంటి సైట్లలో మనుషుల వ్యవహార తీరుపైనే కాకుండా, online confession sites, గేమింగ్, చాటింగ్, virtual affairs లాంటి ఎన్నో పార్శ్వాలలోకి తొంగి చూసారు. ఇక్కడ మనుషుల ప్రవర్తనను విశ్లేషించటమే కాకుండా, ఆ ప్రవర్తనకు కారణాలు కూడా వెతికారు. గూగుల్, ఫేస్బుక్ లాంటి సైట్ల యాజమాన్యం యూజర్స్ డేటాను మొత్తం తమ బిజినెస్‍లకు ఉపయోగించడం, ఆన్‍లైన్ ప్రైవసీ తదితర విషయాలపై కూడా చర్చించారు. అంతే కాక, ఇంటర్నెట్‍లో నిజాలకన్నా performanceలే ముఖ్యం, నీ గురించి నువ్వేమనుకుంటున్నావ్ కన్నా, నీ గురించి తక్కిన అందరూ ఏమనుకుంటున్నారని ఆలోచించాల్సిన దుఃస్థితిని వివరించారు. Playing to the crowd అనేది ముఖ్యమైపోయినప్పుడు, మన selfని అటక ఎక్కించేసి, మరిదేన్నో మన self అని భ్రమిస్తూ బతకటం అయిపోతుంది. ఈ సందర్భంలో ఆవిడ రాసిన, Internet is our new literature అన్న వాక్యం నన్నో కుదుపు కుదిపింది. ఇంటర్నెట్ పెట్టే ప్రలోభాలకు తల ఎప్పుడు వంచేస్తామో మనకే తెలీదు. ఇట్లాంటి పుస్తకాలు చదివితే, అందులో నుండి బయటపడిపోతామని కాదు కానీ, కనీసం ఎలాంటి ఉపద్రవాలు పొంచి ఉన్నాయో తెల్సుకునే అవకాశం ఉంటుంది.

నేను హారర్ పుస్తకాలు చదవను. సినిమాలు చూడను. కానీ ఈ పుస్తకాన్ని నేను చదివిన మొట్టమొదటి హారర్ పుస్తకంగా అభివర్ణించాలని అనిపిస్తోంది. అంతగా భయపెట్టిందిది, వాస్తవాలకు అద్దం పడుతూ. ఆర్కుట్ వల్ల ఎవరో ఎవర్నో హత్య చేసే అవకాశం కలిగింది, ఫేస్‍బుక్ లో గిల్లికజ్జాలకు మనస్థాపం చెంది ఎవరో ఆత్మహత్య చేసుకున్నారని వార్తల్లో చదివి, కొంత ఉలిక్కిపాటు అభినయించి, ఆ తర్వాత పట్టించుకోకుండా నాలాంటి వాళ్ళకు కనువిప్పు ఈ పుస్తకం. అయితే నాకీ వాదనలో ఎక్కడో బాలెన్స్ లేదనిపించింది. టెక్నాలజి వల్ల అన్నీ అనర్థాలే జరగవు కదా! ఒక విడియో కాన్ఫరెన్సింగ్ టెక్నాలజినే తీసుకుంటే అది అపరిచితులతో మితిమీరిన వ్యవహారానికి వాడుకోవచ్చు. దూరంగా ఉన్న బంధుజనాన్ని దగ్గరగా తీసుకురావచ్చు. లేక ఈ మధ్య విస్తరిస్తున్నe-learning coursesకి ఉపయోగపడచ్చు. ఉన్నత విద్యను అందించటానికి తయారుచేసిన టెక్నాలజి గాసిప్ అడ్డాగా మారచ్చు. గాసిప్ కోసం మొదలెట్టిన టైం-పాస్ సైట్ల వల్ల కొందరికి కొన్ని కొత్త విషయాలు తెల్సి వాళ్ళ జీవనగమనం మారచ్చు. ఎంత వాదన చేసినా, టెక్నాలజి మనకి అవసరం. ఆ అవసరాన్ని తీరుస్తూనే అది మనకు కొన్ని అనర్థాలనూ అందిస్తోంది. అది గుర్తెరిగి మనం కొంచెం జాగ్రత్తలో ఉంటే విపరీత పరిణామాలను అడ్డుకోవచ్చు. ఈ పాయింట్‍ను రచయిత నొక్కి వక్కాణించినట్టు నాకనిపించలేదు. ఆవిడ ఆంటీ-టెక్నాలజి అని కూడా అనిపించచ్చు కొందరికి.

ఈ పుస్తకం చదువుతూ తీవ్ర నిరాశానిస్పృహలకు లోనయ్యి, నెట్‍కు కనెక్ట్ అవ్వడానికి కూడా సంకోచిస్తున్న వేళలో, ఈ పుస్తకంలోనే ఓ పదహారేళ్ళ అమ్మాయి చెప్పిన అభిప్రాయం నాకో కొత్త దారిని చూపించింది.

“Technology is bad because people are not as strong as its pull.

టెక్నాలజీ బెమ్మరాక్షసి కాదు. ఇం….త పెద్ద నోరేసుకొని మనల్ని హాంఫట్ అని మింగేయడానికి కాపు కాస్తుంది అని భ్రమించటానికి. టెక్నాలజి మన సృజన. మన ఆలోచన. మన ఆచరణ. అది రెండువైపులా పదునుగా ఉండే కత్తి లాంటిది. ఎంతో నేర్పును ప్రదర్శిస్తే తప్ప పట్టుకుదరదు. ఎంత పట్టుకుదిరినా గాయాలు చేస్తూనే ఉంటుంది. అలాంటి దెబ్బలను ఎదుర్కొని, మనం బలంగా ఉంటే, బహుశా, టెక్నాలజి మనల్ని మనుషుల్లా మిగిల్చటంలో సఫలమవ్వలేదేమో?! ఇప్పటికే చాలా జీవరాశుల్ని అంతం చేసేసి ఉన్నాం. కనీసం మనిషిపై మనిషి నమ్మకం పెట్టకపోతే, ఈనాటి టెక్నాలజి కాకపోయినా రాబోవు కాలంలో మరేదో పుట్టుకొచ్చి మనుషులని మింగేయచ్చు. అందుకే మనకు మాత్రమే సొంతమైన బుద్ధిని, విచక్షణని మరి కాస్త మెరుగ్గా వాడుకుంటే మంచిరోజులు రావచ్చు. ప్రస్తుతానికైతే, ఈ పుస్తకం చదివి కూడా, నేనింకా మనిషిపైనే నమ్మకం పెడుతున్నాను. ఉపోద్ఘాతంలో చెప్పిన నిరాశ ఎదురైనా సరే, మనిషి తల్చుకుంటే అసాధ్యమనేది లేదనే నమ్ముతున్నాను. 🙂

Book Details:

Alone Together: Why we expect more from technology and less from each other.

Author: Sherry Turkle

Published in: Jan 2011

 

Further links:

Sherry Turkle talks about Alone, Together. 

Daily beast Reviews

Guardian Review

Amazon Purchase link

 

You Might Also Like

12 Comments

  1. కొత్తపాళీ

    హమ్మో టెక్నాలజీ భూతం మింగేస్తోంది అనే భయం కొత్తది కాదు. ఒకడు ఈ టెక్నాలజీని అభివృద్ధి అంటాడు. ఇంకోడు అధోగతి అంటాడు. అసలు నిజం ఈ రెంటికీ మధ్యన ఎక్కడో ఉంది. మనిషి పరిణామం చెందుతూనే ఉన్నాడు, ఉంటాడు. ఈ పరిశోధన మానవజాతి పరిణామాన్ని బేరీజు వేసుకునే దిశగా ఉంటే బానే ఉంటుంది. కానీ మీ సమీక్ష చదివితే ఆ దృష్టి ఉన్నట్టు కనబడదు. టెక్నాలజీని భూతంగా చూపెట్టే ప్రయత్నమే కనబడింది.

    1. Purnima

      >>. కానీ మీ సమీక్ష చదివితే ఆ దృష్టి ఉన్నట్టు కనబడదు. టెక్నాలజీని భూతంగా చూపెట్టే ప్రయత్నమే కనబడింది.

      Confused. Whose “దృష్టి” are you referring to, here? The author’s or mine?

  2. Shouri

    “ఎంత వాదన చేసినా, టెక్నాలజి మనకి అవసరం. ఆ అవసరాన్ని తీరుస్తూనే అది మనకు కొన్ని అనర్థాలనూ అందిస్తోంది. అది గుర్తెరిగి మనం కొంచెం జాగ్రత్తలో ఉంటే విపరీత పరిణామాలను అడ్డుకోవచ్చు. ఈ పాయింట్‍ను రచయిత నొక్కి వక్కాణించినట్టు నాకనిపించలేదు. ఆవిడ ఆంటీ-టెక్నాలజి అని కూడా అనిపించచ్చు కొందరికి.”

    We were not able to control the side-effects of TV, Cinema, Cell phone over usage etc. Do you think we’ll be able to control this? All these will become weaknesses (I open maalika.org at least 5 times a day and I should accept that I got addicted to it). How many people will be able to control their weaknesses and concentrate on their “real” self. I don’t think majority of the people will be able to do that.

    Shouri

    1. Purnima

      Hmmm.. while I’m tempted to agree with you that, yeah, a majority of us won’t be able to get rid of over-usage or addiction, I believe, that is why such literature should be read and understood, which could act as a catalyst to our otherwise laid back efforts.

    1. Purnima

      Ah! Interesting.. thanks.

  3. లలిత (తెలుగు4కిడ్స్)

    “నేను హారర్ పుస్తకాలు చదవను. సినిమాలు చూడను. కానీ ఈ పుస్తకాన్ని నేను చదివిన మొట్టమొదటి హారర్ పుస్తకంగా అభివర్ణించాలని అనిపిస్తోంది. ” ఈ పుస్తకం గురించి నువ్వు వ్రాసింది చూస్తే నాకదే అనిపించింది.
    కాకతాళీయమో ఏమో నాణేనికి ఇంకో వైపు ఈ రోజు రీడర్స్ డైజెస్ట్‌లో ఈ ఆర్టికల్ చదివాను.
    ( http://rationaloptimist.com/blog/reader's-digest.aspx ).
    “ఎంత వాదన చేసినా, టెక్నాలజి మనకి అవసరం. ఆ అవసరాన్ని తీరుస్తూనే అది మనకు కొన్ని అనర్థాలనూ అందిస్తోంది. అది గుర్తెరిగి మనం కొంచెం జాగ్రత్తలో ఉంటే విపరీత పరిణామాలను అడ్డుకోవచ్చు. ఈ పాయింట్‍ను రచయిత నొక్కి వక్కాణించినట్టు నాకనిపించలేదు. ఆవిడ ఆంటీ-టెక్నాలజి అని కూడా అనిపించచ్చు కొందరికి.” హ్మ్మ్.
    “ప్రస్తుతానికైతే, ఈ పుస్తకం చదివి కూడా, నేనింకా మనిషిపైనే నమ్మకం పెడుతున్నాను. ఉపోద్ఘాతంలో చెప్పిన నిరాశ ఎదురైనా సరే, మనిషి తల్చుకుంటే అసాధ్యమనేది లేదనే నమ్ముతున్నాను.” Bravo!
    ఈ సందర్భంగా నాకు నేను చదివిన ఇంకో పుస్తకం, Zen and the art of motorcycle maintenance” లో ఈ భాగం గుర్తుకు వస్తోంది.
    “The way to solve the conflict between human values and technological needs is not to run away from technology. That’s impossible.
    The way to resolve the conflict is to break down the barriers of dualistic thought that prevent a real understanding of what technology is … not an exploitation of nature, but a fusion of nature and the human spirit into a new kind of creation that transcends both. When this transcendence occurs in such events as the first airplane flight across the ocean or the first footstep on the moon, a kind of public recognition of the transcendent nature of technology occurs. But this transcendence should also occur at the individual level, on a
    personal basis, in one’s own life, in a less dramatic way.”
    ఇది నేను అంతర్జాలంలో ఆ పుస్తకం చదువుతూ ఫేస్ బుక్‌లో వ్రాసుకుని దాచుకున్నాను. దానిని ఇంకో అంతర్జాల వేదిక మీద అభిరుచులు కలిసిన వారితో పంచుకుంటున్నాను. ఇదంతా సాంకేతికత ద్వారా సాధ్యమయ్యింది. అది లేకున్నా ఆలోచనలు పంచుకోవాలనే కోరికని ఇంకో విధంగా తీర్చుకుందుము. అప్పుడైనా ఇప్పుడైనా పంచుకునేది మనుషులతోటే! అందుబాటులో ఉన్న సాంకేతిక సౌలభ్యాలని లేవనుకుని జీవించడం కష్టం. అలాగని ఈ సౌలభ్యం లేకపోతే ఇటువంటి interaction కి లోటేమీ కలగకపోవచ్చు. అలాగే ఇటువంటి సదుపాయాల వల్ల అప్పటికే ఉన్న ఆరోగ్యకరమైన ఆసక్తులను పెంచుకోవడానికి, పంచుకోవడానికి అవకాశం ఎక్కువౌతుంది. రెండో వైపు పదును గురించి కూడా ఇదే అనుకోవచ్చు. హ్మ్మ్మ్మ్… ఏదైనా మనుషుల వల్లే! ఎవరు కని పెట్టార్రా బాబూ ఈ మనుషులని!

    1. Purnima

      “ఎవరు కని పెట్టార్రా బాబూ ఈ మనుషులని!”

      hehehe.. believe it or not, I wrote something to that effect and deleted it just before publishing! 🙂 Have been trying hard to refrain from putting many of my thoughts, than those that were echoed in books. 😛

      And you reading Zen and art of motorcycle maintenance? I’ve been reading only the first chapter or two of it, for past 2 years. God knows, when I’d read through the book.. 🙁

    2. లలిత (తెలుగు4కిడ్స్)

      పూర్ణిమా,
      Great minds think alike కదా మరి 🙂
      Zen and … చదవడానికి కష్టమే. కానీ నేను ఈ మధ్య కాలంలో అతి తక్కువ సమయంలో చదవడం పూర్తి చేసిన పుస్తకం అది. ‘ఎందుకు చదువుతున్నానా?’ అనిపించినప్పుడు అసలు ఈ పుస్తకం కథా కమామీషు ఏంటో చూద్దాం అనిపించి కథేమిటో చూశాను. ఇక ఆపకుండా చదవగలిగాను. అందులో ఒక చోట అతనంటాడు “Tears of recognition” అని. చాలా చోట్ల ఆ భావమే కలిగింది నాకు ఆ పుస్తకం చదువుతున్నప్పుడు. అంటే అది నాకు బైబిల్ వంటిదేమి కాదు. కానీ మొత్తం దృశ్యం దృష్ట్యా, నా ఇప్పటివరకు జీవితానుభావాల దృష్ట్యా, నా ఆలోచనలు పెంచుకోవడానికి కావలిసిన ముడి సరుకు చాలా దొరికింది అందులో.
      పైన ఇంకో వ్యాఖ్యలో నువ్వన్న మాటలు కూడా నచ్చాయి.
      “while I’m tempted to agree with you that, yeah, a majority of us won’t be able to get rid of over-usage or addiction, I believe, that is why such literature should be read and understood, which could act as a catalyst to our otherwise laid back efforts.” ఐనా ఈ పుస్తకం నేను చదువుతాను (చదవగలుగుతాను) అని నమ్మకం లేదు. అది వేరే సంగతి.
      ఇక చాలామందికి స్వయంనియంత్రణ కష్టం అవ్వడం దృష్ట్యా ముందు అడ్డుకోవల్సింది సినిమాలను అనిపిస్తుంది నాకు.

  4. నిషిగంధ

    ఇది చదివాక నాకైతే కొంచెం బాధ.. కొంచెం కోపం రెండూ కలిగాయి..
    బాధ – ఈ టెక్నాలజీ మనల్ని నియంత్రిస్తున్న విధానానికీ..
    కోపం — అన్నీ తెలుసనుకుంటూనే అనవసరమైన లోతుల్లోకి కూడా మనం రెండు చేతులూ చాచి ఫ్రీ ఫాలింగ్ చేస్తున్నందుకు..
    మనలో చాలామంది టివి లేకుండా రోజుల తరబడి మానేజ్ చేయగలం.. కానీ నెట్ లేకుండా.. ఐ మీన్, ఉద్యోగ బాధ్యతలకి సంబంధించి కాకుండా.. ఎంతమందిమి కనీసం ఒక్కరోజైనా ఉండగలం!?

    Thanks for the introduction/review, Purnima. 🙂

Leave a Reply to నిషిగంధ Cancel