స్మృతి, విస్మృతి – The Sense of an Ending

ఇంగ్లండులో ప్రతి సంవత్సరం, ఆ సంవత్సరంలో కామన్వెల్త్ దేశాలనుంచి వచ్చిన ఉత్తమ ఇంగ్లీషు నవలకు మ్యాన్ బుకర్ ప్రైజ్ (Man Booker Prize for Fiction) పేరిట 50 వేల పౌండ్లు బహుమానం ఇస్తారు. సాల్మన్ రష్దీ మిడ్‌నైట్ ఛిల్డ్రెన్ (Midnight’s Children) పుస్తకానికి ఈ అవార్డు వచ్చినప్పుడు ఈ ప్రైజు గురించి నాకు మొదట తెలిసింది. అప్పట్లో దీన్ని బుకర్ ప్రైజ్ అనే అనేవారు (అసలు పేరు Booker-McConnell Prize అట; ఆ పేరున్న ప్రచురణ సంస్థ ఈ అవార్డునివ్వటం మొదలుబెట్టింది). తర్వాత బుకర్ ఫౌండేషన్ అనే సంస్థ ఆధ్వర్యంలో ఈ ప్రైజు ఇస్తున్నారు. ఇప్పుడు Man Group అనే బీమా కంపెనీ ఈ అవార్డును స్పాన్సర్ చేయటం వల్ల ఆ ప్రైజు పేరు మారింది. ఇది చాలా ప్రతిష్టాత్మకమైన సాహిత్యపురస్కారం. రష్దీ తర్వాత మన దేశం నుంచి అరుంధతీ రాయ్, కిరణ్ దేశాయ్, అరవింద్ ఆడిగ ఈ పురస్కారం గెల్చుకున్నారు.

2011లో ఈ పురస్కారం జూలియన్ బార్న్స్ (Julian Barnes) రచించిన The Sense of an Ending అన్న నవలకు వచ్చింది. సెన్స్ ఆఫ్ యాన్ ఎండింగ్ చాలా చిన్న పుస్తకం. మొత్తం కలిపి 163 పేజీలు 1/8 డెమీ సైజులో.  విస్తృతమైన వస్తువు కూడా కాదు. మరి ఈ పుస్తకానికి ఇంతటి పురస్కారం ఎందుకు వచ్చింది?

ఈ పుస్తకంలో కథని మనకు చెప్తున్న వ్యక్తి యాంథొనీ (టోనీ) వెబ్‌స్టర్. 1950లలో టోనీ పబ్లిక్‌స్కూల్లో చదువుకుంటున్న రోజుల్లో ఇంకో ముగ్గురు స్నేహితులతో జట్టుగా ఉండేవాడు. వాళ్ళలో ఏడ్రియన్ ఫిన్ అంటే అందరికీ ప్రత్యేకమైన ఇష్టం. ఈ జట్టులో ఆలశ్యంగా కలసిన ఏడ్రియన్ కుటుంబ నేపధ్యంలో ఏవో ఇబ్బందికరమైన సంఘటనలు ఉన్నాయి కానీ ఆ వివరాలు టోనీకి పూర్తిగా తెలియవు. ఏడ్రియన్ వయసుకు మించిన తెలివి చూపించేవాడు. క్లాసులో అతను ప్రశ్నలకు సమాధానాలు చెప్పే తీరు, విషయాలను విశ్లేషించే విధానం ఉపాధ్యాయులక్కూడా ఆసక్తికరంగా ఉండేది.

హైస్కూలు తర్వాత టోనీ కేంబ్రిడ్ఝ్‌కీ, ఏడ్రియన్ ఆక్స్ఫర్డ్‌కీ పై చదువులకు వెళ్ళారు. టోనీ వెరోనికా అనే అమ్మాయిని డేట్ చేయడం మొదలుబెట్టాడు. తన స్నేహితులకు పరిచయం చేశాడు.  ఒక వారాంతం వెరోనికా టోనీని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళింది కూడా. ఆ ట్రిప్పులో వెరోనికా తండ్రి, అన్న తనతో సరిగా ప్రవర్తించలేదని టోనీ మనసు కష్టపెట్టుకున్నాడు. వెరోనికా తల్లి శారా మాత్రం అతనితో సరిగా ప్రవర్తించింది. వెరోనికాతో కొద్దిగా జాగ్రత్తగా ఉండమని ఆమె సలహా చెప్పటం టోనీకి ఆశ్చర్యం కలిగించింది. ఆ తర్వాత కొన్నాళ్ళకి టోనీ, వెరోనికా విడిపోయారు. కొంత కాలం గడిచాక ఏడ్రియన్ వెరోనికాను డేట్ చేస్తున్నట్టుగా టోనీకి ఉత్తరం రాశాడు. టోనీకి కొద్దిగా చిరాకు కలిగింది. ముక్తసరిగా ఒక ఉత్తరం వ్రాసి పడేశాడు.

టోనీ అమెరికాలో కొన్నిరోజులు ఉండి ఇంగ్లాండు తిరిగి  వచ్చేసరికి ఏడ్రియన్ ఆత్మహత్య చేసుకున్నాడని తెలిసింది. తాను ఆత్మహత్య చేసుకోవటం దోషం కాదని,  ఆత్మహత్య చేసుకోవడమే సరైన పని అని తాత్విక వాదన చేస్తూ ఒక పెద్ద ఉత్తరం వ్రాసి మరీ ఆ పని చేశాడు ఏడ్రియన్. “తెలివి ఎక్కువైతే జీవితాలు ఇలాగే తగలడతాయి” అని వ్యాఖ్యానిస్తుంది టోనీ తల్లి.

టోనీ మార్గరెట్ అనే అమ్మాయిని పెళ్ళి చేసుకొని, ఒక బిడ్డకు తండ్రి అయ్యాడు. కొన్నాళ్ళ తర్వాత మార్గరెట్, టోనీ విడాకులు తీసుకున్నా, స్నేహితులుగానే ఉన్నారు. వాళ్ళ సంభాషణల్లో ఎప్పుడైనా వెరోనికా ప్రస్తావన వస్తే, తింగరబుచ్చి (Fruitcake) అని పిలుచుకొనేవారు. రిటైరైపోయిన టోనీ, నర్సింగ్‌హోముల్లో వాలంటీర్‌గా వృద్ధులకు సాయం చేస్తూ ఉంటాడు. ఒడిదుడుకులు పెద్దగా లేని జీవితం టోనీకి సంతృప్తిగానే ఉంది. జీవితపోరాటంలో పెద్దగా ఆరాటపడకుండా భద్రమైన జీవితాన్ని గడిపే మెళుకువలు అతనికి పట్టుబడ్డాయి.

ఇలా టోనీ సాఫీగా జీవితాన్ని గడిపేస్తుండగా, ఒకరోజు ఎవరో లాయర్‌నుంచి ఒక ఆశ్చర్యకరమైన ఉత్తరం వచ్చింది. శారా ఫోర్డ్ అనే ఆవిడ చనిపోతూ టోనీకి 500 పౌన్ల రొక్కం, ఒక ఉత్తరం తన విల్లులో రాసి చనిపోయింది అని. ఆవిడ దగ్గర ఉన్న ఏడ్రియన్ డైరీ ఆమె తదనంతరం టోనీకి చెందాలని ఆ ఉత్తరంలో ఉంది. శారా అంటే వెరోనికా తల్లి. ఆమెతో టోనీ గడిపింది చాలా తక్కువ సమయమే. ఇదంతా టోనీకి అయోమయంగా ఉంది.

సరే, డైరీ చదివితే ఏమైనా తెలుస్తుందేమో అనుకుంటే, ఆ డైరీ ఇప్పుడు వెరోనికా చేతిలో ఉందట. ఆవిడ దాన్ని టోనీకి ఇవ్వను అందట. టోనీ వెరోనికాను కలవటానికి, ఆ డైరీ సంపాదించటానికీ ప్రయత్నాలు చేస్తాడు ఈ క్రమంలో అతనికి కొద్ది కొద్దిగా అంతకు ముందు మరచిపోయిన కొన్ని విషయాలు జ్ఞాపకం వస్తూ ఉంటాయి. తాను, వెరోనికా, ఏడ్రియన్‌ల మధ్య జరిగిన కథ గురించి అతనికి గుర్తున్న వాటిలో కొంతే నిజమని అతనికి నెమ్మదిగా తేటతెల్లమౌతూ ఉంటుంది.  అతనితోపాటు మనమూ ఆశ్చర్యపోతూ ఉంటాము.

ఇందాక చెప్పినట్లుగా ఇది చాలా చిన్న నవల. రష్దీ మేజికల్ రియలిజం లాటి ప్రయోగాలు, అరుంధతీ రాయ్ భాషతో చేసిన విన్యాసాలు ఈ పుస్తకంలో లేవు. మరి ఈ పుస్తకం ఇంతటి పురస్కారాన్ని ఎందుకు గెల్చుకుంది?

మన వ్యక్తిగత కథనాల్లో (narrativesలో) మనం మన జ్ఞాపకాల మీద ఆధారపడతాము. ఈ జ్ఞాపకాలు ఎలాటి పునాదులపైన నిర్మితమౌతాయి? మనం ఏం గుర్తు ఉంచుకొంటాం? ఏం మర్చిపోతాం? మనకు గుర్తున్న కథలు అసలు వాస్తవాలేనా? కొన్ని బంధాలు ఎలా ఏర్పడతాయి? ఎలా విచ్ఛిన్నమౌతాయి? మనం మన మనుకునేంత మంచివాళ్ళమేనా? ఇలాంటి ప్రశ్నలను బలంగా లేవనెత్తుతుంది ఈ నవల.

జీవితాన్ని సాఫీగా గడుపుతున్న టోనీలానే అతను చెప్పే కథ కూడా పెద్దగా ఆడంబరాలు, ఎక్కువ స్వోత్కర్ష లేకుండా  సాగుతుంది. తన గత జీవితాన్ని అతను నిష్పక్షపాతంగా, నిరామయంగానే చెపుతాడు. ఐనా  అతని కథ మనకు ఆసక్తికరంగా ఉంటుంది. కథ కొంత సాగాక కొద్దీ టోనీకీ, మనకీ ఆశ్చర్యం కలిగే కొన్ని సంఘటనలు జరుగుతాయి. కథ అనుకోని మలుపులు తిరుగుతుంది. పుస్తకం చివరికి వచ్చే సరికి నిజం జ్ఞాపకాలకూ, అబద్ధపు జ్ఞాపకాలకూ మధ్య ఉన్న సన్నని రేఖని ఎలా గుర్తు పట్టటం అన్న సందేహం కలుగుతుంది. మన జీవితమే మనకు పారదర్శకం కాదనుకుంటే ఉలికిపాటు కలుగుతుంది.

ఈ నవల ప్రత్యేకత ఏమిటంటే సాధారణంగా ఉంటూనే మనల్ని ఆలోచింపజేయడం. ప్రశ్నలను రేకెత్తించడం. సుళువుగానే నడుస్తున్నట్లుంటుంది కానీ చదివినదాన్ని జాగ్రత్తగా గుర్తు పెట్టుకొని మననం చేసుకోవాలనిపిస్తుంది. పుస్తకం ఐపోయాక మళ్ళీ ఇంకొకసారి చదివి మొదటిసారి ఏమైనా మిస్సయ్యామేమో అని సరి చూసుకోవాలనిపిస్తుంది.

బాగుండడానికి, మెదడుకి పని పెట్టటానికీ పేజీల సంఖ్య ముఖ్యం కాదని ఇంకోసారి నిరూపించిన పుస్తకం.

**********

The Sense of An Ending
Julian Barnes
Winner of Man Booker Prize 2011
Alfred A Knopf, New York 2011
Jonathan Cape, London 2011
163 pages

 

You Might Also Like

9 Comments

  1. నేనూ, పుస్తకాలూ, రెండువేలపన్నెండూ … | పుస్తకం

    […] ఈ పుస్తకానికి రెండు చక్కని పరిచయాలు, జంపాల చౌదరి గారు రాసిన పరిచయం ఒకటి మరియు సౌమ్య రాసిన […]

  2. padmavalli

    కొన్ని నెలల క్రితం btweenthecovers.com లో ఈ పుస్తకం గురించి చదివినపుడు అనిపించకపోయినా, ఇప్పుడు మీ రివ్యూ చదివాక మాత్రం, వెంటనే చదవాలని ఉంది. నా To Read list లో ఎక్కేసింది. వెంటనే చదవాలి అనిపించేలాంటి చక్కటి పరిచయానికి థాంక్ యు.

  3. gksraja

    సౌమ్య గారు చేసిన సమీక్ష మీది సమీక్ష (sowmya write’s) నన్నిక్కడికి తోలింది. ‘జంపాల” గారూ. ధన్యవాదాలు, ఈ పుస్తకం పై గొప్ప ఆసక్తి రేపిన మీ సమీక్షకు. ‘History is the lies of the victors’, లాంటి కోట్స్ ను ఉటంకించిన సౌమ్య గారికీ కృతజ్ఞతలు.
    రాజా.

  4. Sowmya

    ” పుస్తకం ఐపోయాక మళ్ళీ ఇంకొకసారి చదివి మొదటిసారి ఏమైనా మిస్సయ్యామేమో అని సరి చూసుకోవాలనిపిస్తుంది.”
    -I felt exactly the same! Very interesting novel. Thanks for the review, again.

  5. Kumar N

    ఈ వ్యాఖ్య నా స్వీయసొద, సో గో ఈజీ ఆన్ మి ప్లీజ్:-)

    నేను జంపాల గారి పుస్తక పరిచయాలకి హ్యూజ్ ఫాన్ ని. ఎంతో సరళంగా, మొదలు పెట్టినప్పటి నుంచీ, చిట్టచివరి వరకీ ఆసక్తిగా, క్రూయిజ్ ఆన్ చేసుకోని ఇంకో కార్ లేని ,ఏ బంప్స్ లేని ఫ్రీవేస్ మీద వెళ్తూన్నట్లు చదివింపబడే ఆయన పరిచయాలంటే అమిత ఇష్టం.

    అయితే, ఈ రివ్యూ మొన్నెప్పుడో చదివాను, బాగుంది అనుకున్నాను కానీ ఇది కొనుక్కొని చదవాలీ అని గట్టిగా అనిపించలేదు. (No, I don’t mean to say that it is an indicator of the review’s substance or style).

    అయితే యాదృశ్చికంగా ఇందాకే సౌమ్య గారి బ్లాగులో ఇదే పుస్తకం గురించి రాసిన పోస్టులో(రివ్యూ కాదు) , ఈ పుస్తకంలోని కొన్ని కోట్స్ చూసాను. వెంటనే స్ట్రాంగ్ గా అనిపించింది, కొని చదవాలని!!.

    కొన్ని సార్లు ఓ నాలుగు కోట్స్ ఎక్కువ డిజైర్ ని కలిగిస్తాయనుకుంటా 🙂 (ఓ పాట విని, సినిమా చూడాలనిపించేలా…అలా దొరికిపోయిన సందర్బాలే ఎక్కువనుకోండీ 🙂

    Alright, will stop.

  6. Nagini

    The story is very interesting…Thanks for the post..:-)

  7. Purnima

    I’m happy you introduced a work of Julian Barnes. I read a non-fiction work of his called ‘Nothing to be frightened of.” I thoroughly enjoyed reading it. Though I read it last year, I couldn’t write a post about it. With your inspiration, I’ll now get back to it and write about it.

    I was introduced to Julian Barnes by a friend, who recommended me to read “Flaubert’s Parrot”. I somehow couldn’t read more than first few pages. That may be because I knew nothing about Flaubert. But I was at home with Barnes prose in “Nothing to be…”

    Your intro has made me curious about this work, too. Have you read his other works?

  8. సౌమ్య

    మీర్రాసింది చదువుతూ ఉంటే అర్జెంటుగా ఆ పుస్తకం చదవాలి అనిపిస్తోంది. పరిచయం చేసినందుకు థాంక్స్ 🙂

  9. appalanaidu.b

    it’s nice…

Leave a Reply to Purnima Cancel