శ్రీ విశ్వనాథ వారి వ్యక్తిత్వం: శ్రీ గంధం నాగేశ్వరరావు గారితో ఇంటర్వ్యూ

రాసిన వారు: సి.ఎస్.రావ్
(ఈ ఇంటర్వ్యూ ప్రముఖ రచయిత అనువాదకులు,విశ్వనాథ సాహిత్య పీఠం వ్యవస్థాపకులు అయిన వెలిచాల కొండలరావు గారి ఆధ్వర్యంలో వెలువడే జయంతి పత్రిక (జనవరి-మార్చ్ 2012 సంచిక)లో ప్రచురితమైంది.)
**********

శ్రీ గంధం నాగేశ్వరరావు గారు సంస్కృతాంధ్రాలలో గొప్ప పండితులు .ఆంగ్ల భాషలో దిట్ట. తెలుగులో ప్రాచీన రీతిలో గొప్ప కవిత్వం ధారాళం గా చెప్పగల నేర్పరి. వారి పద్య రచనలో సంస్కృత సమాస నిర్మాణ సౌందర్యం తో ప్రయత్న రహితంగా మేళవింపబడిన తెలుగు నుడికారపు జిలుగు మెరుగుల సోయగాలను చూస్తాం. వీరి కవిత్వం పచ్చని కొండ చరియల మీదుగా జాలువారే మధుర రస వాహినిగా వీనులవిందుగా సాగుతుంది.

గురువును వెతుక్కుంటూ శిష్యుడు వెళ్లటం పరిపాటి.శ్రీ విశ్వనాథ వారు శిష్యుడ్ని వెతుక్కుంటూ వీరిని చేజిక్కించుకున్నారు .శ్రీ విశ్వనాథ వారి కోరిక మీద ,సెలవు పెట్టి రమ్మనగానే ,చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి కాపురంతో విజయవాడ వెళ్లి శ్రీ విశ్వనాథ వారి ఇంట్లోనే ఉండిపోయారు, వారి శుశ్రూష కు. శ్రీ విశ్వనాథ వారి యెడల శ్రీ నాగేశ్వరరావు గారి గురుభక్తి అపారం .వారి వ్యక్తిత్వాన్ని గురించి కానీ ,వారి సాహితీ మూర్తిత్వాన్ని గురించి కానీ శ్రీ నాగేశ్వరరావు గారు ఎప్పుడు మాట్లాడినా అబ్బురంతో కూడిన ఆనందంలో అర్ధనిమీలిత నేత్రాలతో ,పైకెత్తిన ముకుళితహస్తాలతో తన్మయులై మాట్లాడతారు.గురువు గారి రామాయణ కల్పవృక్షం లో కంఠవశమైన వందలకొలది పద్యాలను వారి లాగానే శ్రవణ పేయంగా,అర్ధస్ఫోరకంగా తన్మయత్వం తో చదువుతారు, గడచి పోయే కాలాన్ని ఏ మాత్రం గమనించకుండా. వారితో కలిసి నివాసమున్నది రెండు సంవత్సరాలే అయినా (1948-1950) ఆ తర్వాత వారు వీరి ఇంట్లోనో వీరు వారి ఇంట్లోనో కొన్ని రోజులు కలిసి గడపకుండా ఒక నెల కూడా గడవలేదు.

ఆయన తొమ్మిది మంది సంతానానికి తండ్రి ,ఎందఱో మనవలు,మనవరాండ్రు. పెద్ద మనవడి పేరు గంధం విశ్వనాధ సత్యనారాయణ వరప్రసాద్.అదీ వారి గురుభక్తి,ప్రేమ .

శ్రీ నాగేశ్వరరావు గారి వయస్సు 96 సంవత్సరాలు.ఇంట్లో కార్లు ఉన్నా బస్సుల్లోనే వెళ్లి రావటం. ఖాదీ బట్టలే కట్టటం.ఆడంబరాలకు అవకాశం ఉన్నా, నిరాడంబర జీవనం. మెత్తని చిత్తం.మార్దవమైన మాట. ఈ తరం వారు నమ్మలేనంత గురుభక్తి ,బంధు మిత్ర ప్రేమ.
వారితో శ్రీ విశ్వనాథ వారి వ్యక్తిత్వాన్ని గురించి నేను చేసిన ఇంటర్వ్యూ.

**********************

1. నమస్కారం నాగేశ్వరరావు గారూ! విశ్వనాథ వారి వ్యక్తిత్వ విశేషాలు తెలుసుకోవటానికి ముందు వారి నాన్న గారైన శోభనాద్రి గారి గురించి కొంత తెలుసుకోవాలని ఉంటుంది కదా. వారితో మీకు పరిచయముందాండీ?పరిచయమున్నా ,లేకపోయినా వారి గురించి మీకు తెలిసిన విషయాలు కొద్దిగా చెబుతారా?

వీరి నాన్నగారైన శోభనాద్రిగారి స్వస్థలం కృష్ణా జిల్లా నందమూరు.వారికి వారి నాన్నగారి దగ్గరనుండి సంక్రమించిన నలభై ఎకరాల సుక్షేత్రమైన మాగాణి –ఒకటే బిళ్ళ, సెంటు మిగలకుండా అమ్మేసి దానధర్మాలు చేసిన మహాదాత.ఆరోజుల్లో వీరు కాశీ నుండి శివలింగాన్ని మోసుకవచ్చి నందమూరులో ప్రతిష్టింప చేసిన పరమ భక్తులు.వారు కాశీ వెళ్ళినప్పుడు తెల్లవారుఝామున గంగాస్నానం చేసి విశ్వేశ్వరస్వామి వారి దర్శనం చేసుకుని సత్రంలో భోజనం చేసి మఠం లో నిద్రపోతూ కొన్నాళ్ళు గడిపారు. ఒకనాడు గంగా స్నానం చేస్తుండగా కాలికి గట్టిగా ఏదో తగిలిందట.అదేమిటోనని కాలితో గట్టిగా తట్టి చూసారు. మరింత గట్టిగా అది తగలటంతో రెండు చేతులతో దానిని పైకి తీసి చూస్తే తెల్లని శివలింగం గా కనుగొన్నారు.ఆయన గొప్ప భక్త్యావేశానికి లోనయినారు.అది కాశీ విశ్వనాథుని అనుగ్రహంగా భావించారు.ఆ శివలింగాన్ని మోసుకుని ఇంటికి వెంటనే బయలుదేరారు.ఆ శివలింగ ప్రతిష్ట అలా జరిగింది.

2.పరమ భక్తులైన శోభనాద్రి గారికి శివలింగం అలా దొరకటం కాశీ విశ్వనాధుని అనుగ్రహం గా భావించటంలో ఆశ్చర్యం లేదు.బావుంది. అప్పుడు విశ్వనాథవారి వయస్సు ఎంత? ఏమి చేస్తుండేవారు ?

విశ్వనాధ వారు స్కూలు టీచరుగా వారి ఊరికి దగ్గర గా ఉన్న గ్రామం లో పని చేస్తుండేవారు. అప్పటి వారి జీతం ఇరవై ఒక్క రూపాయలు. విశ్వనాధ వారు పోషించేది తొమ్మిదిమందిని: తల్లి,తోబుట్టువులు,వారి పిల్లలు,ముగ్గురు తమ్ముళ్ళు.రాబడి తక్కువ .ఒకనాటి రాత్రి వారి అమ్మగారు పార్వతమ్మగారు వచ్చి “నాన్నా, బియ్యం రేపటికి నిండుకున్నవి.చాట అప్పుపుట్టే తీరు లేదు.” అన్నారు.విశ్వనాధ వారు “సరేలే,అమ్మా “ అన్నారు.పాపం మరుసటి రోజు స్నానాదికాలు ముగించుకుని బయటకు వెళ్లారు.ఆ రోజుల్లో శనాదివారాలు రెండూ సెలవుదినాలు.ఉదయం వెళ్లి రాత్రి పదిన్నరకు తిరిగి వచ్చారు. ఆరోజుల్లో బ్రాహ్మణుల ఇళ్ళలో ముందు ఒక నీళ్ళ తొట్టి,దాని మీద ఒక కర్ర తో చేసిన మూత ఉండేది .పెరట్లో మరొక నీళ్ళ తొట్టి మూతతో ఉండేది. బయట నుంచి రాగానే ముందు కాళ్ళు కడుక్కుని ఇంటి లోకి ప్రవేశించటం పద్ధతి .భోజనానంతరం పెరట్లో ఉన్న తొట్టి వద్ద కాళ్ళు కడుక్కోటం ఆచారం.

విశ్వనాథవారు వచ్చీ రావటంతోటే పద్ధతి ప్రకారం కాళ్ళు కడుక్కోకుండానే సరాసరి వంటింట్లో కి వెళ్లి చూసారు.పొయ్యిలో పిల్లి లేవలేదు. గొప్ప ఖేదానికి గురయ్యారు. అప్పుడు పాదప్రక్షాళనం చేసి,ముఖం కడుక్కుని “మా స్వామి“ అనే శతకం వ్రాయటం మొదలు పెట్టారు. మా స్వామిలోని మొదటి రెండు పద్యాలు రామాయణ కల్పవృక్షానికి నాంది. (మా స్వామి గురించి ఒక చిన్న పరిచయం ఇక్కడ).

పది,పదిహేను పద్యాలు వ్రాసిన తర్వాత ఒక పద్యంలో అంటారు, “మా నాన్నగారికి,నీకు లావాదేవీలు ఏమున్నాయో నాకు తెలియదు.ఏమైనా ఉంటే మీరూ మీరూ చూసుకోండి.నన్నిలా కష్ట పెడితే మాత్రం నేను ఊరుకునేదిలేదు.ఆహితాగ్ని పెట్టెలో ఉన్న నీ బంగారు లింగాన్ని తెగనమ్ముతాను.రెండు బస్తాల బియ్యం,దినుసులు తెచ్చుకుంటాను.” అని వ్రాస్తుండగా తలుపు తడుతున్న శబ్దం అయింది. తల్లిగారైన పార్వతమ్మ గారు తలుపు తెరిచారు. బండి తీసుకుని వచ్చిన వ్యక్తి “అమ్మా, కపిలేశ్వరపురం నుంచి రావి సూరయ్య గారు తమకు ఇవ్వమని రెండు బస్తాల బియ్యం ,కందిపప్పు మూట,బెల్లపు బుట్ట,నెయ్యి పంపించారు. ఎవరైనా కొద్దిగా సాయం చేస్తే ఆ బస్తాలు పంచలో పెడతాను.“ అన్నారు.అది విశ్వనాధ వారి భక్తి ,నిర్భీతి ,వారి కున్న దైవానుగ్రహం.

3.నాగేశ్వరరావు గారూ,మానాప్రగడ బాపిరాజు గారితో మీ పరిచయం గురించి చెబుతారా ?

మానాప్రగడ బాపిరాజు గారు తాడేపల్లిగూడెం తాలూకా గణపవరం సిర్కా గుణపర్రులో కరణం గారిగా పనిచేస్తూఉండేవారు.చింతలపాటి సీతారామచంద్ర వరప్రసాద మూర్తి రాజు గారి పినతండ్రి గారైన సుబ్బరాజు గారి దగ్గర మంత్రి పదవి కూడా నిర్వహిస్తూ ఉండేవారు. మూర్తిరాజుగారి తండ్రిగారి పేరు కూడా బాపిరాజుగారే. ఆ ప్రాంతం లో నేను చిన్న ఉద్యోగం చేస్తూ ఉండే వాడిని.నేను కవిత్వం ఏదో వ్రాస్తానని వారి చెవిన పడింది.వారు కవిత్వం బాగా వ్రాస్తారు.నన్ను ఆ అభిమానం తో చేరదీశారు. వారు నన్ను కొడుకులా చూసేవారు.

4.బాపిరాజు గారికి శ్రీ విశ్వనాథ వారికి బాగా పరిచయం ఉందని విన్నాను.వారి ద్వారానే మీకు విశ్వనాథ వారితో పరిచయం ఏర్పడిందని చెప్పారు.ఆ వివరాలు చెప్పండి.

అవును,వారిరువురూ ఒకరినొకరు చాలా గౌరవంగా,ప్రేమగా‘అన్నగారూ’ అని పిలుచుకునేవారు.ఒకరోజు బాపిరాజు గారు నన్నడిగారు, నీకు విశ్వనాథ వారు తెలుసునా అని.తెలుసన్నాను.ఎలా తెలుసనడిగారు.విశ్వనాథ వారు ముక్త్యాల జమిందారు గారికి తమ రామాయణ కల్పవృక్షం బాలకాండ వినిపించడానికి వచ్చినపుడు వారి దర్బారులో పెద్ద సభ జరిగింది. నేను, సెంట్రల్ ఎక్సైజ్ డిపార్టుమెంట్ లో పనిచేస్తున్న మాచిరాజు దేవిప్రసాద్ గారు ఆ సభకు హాజరయ్యామని చెప్పాను. బాపిరాజు గారు విశ్వనాథ వారు నిన్ను గుర్తుపడతారా అనడిగారు.ఆ మహానుభావుడు నన్ను గుర్తుపట్టటమేమిటి,వారితో నాకు పరిచయం ఎలా సాధ్యం.సభలో ఒకరిగా వారిని చూసి వారి పఠనం విన్నాను,అంతే నన్నాను. అప్పుడు బాపిరాజు గారు, “నాగేశ్వరరావ్ మన ఇంటికి అన్నగారు ఈ రోజు రాత్రి ఎనిమిదిగంటలకు వస్తున్నారు,నీకు కూడా పరిచయం చేస్తాను” అని చెప్పారు. అది మహద్భాగ్యం గా భావించి సంతోషం తో సరే అన్నాను .అనడమే కాదు శ్రీ విశ్వనాథ వారిని వారి రామాయణ కల్పవృక్షం లోని బాలకాండలో ఒక ఘట్టం చదివేట్లు చేయండని విన్నపం చేసాను.

మూర్తిరాజు గారు,బాపిరాజు గారు,గ్రామం లోని ఇతర పెద్దలు,విశ్వనాథవారి పేరు విని వారిని చూడదల్చుకున్న వారు,నేను,మూర్తిరాజుగారిచే ఏర్పాటు చేయబడ్డ బాండ్ మేళం తో సహా విశ్వనాథ వారికి స్వాగతం పలకటానికి చేబ్రోలు రైల్వే స్టేషన్ కు బయల్దేరాం. ఒంటిగంట బండికి వారు రాలేదు.అందరం దిగాలుబడి ఇంటిముఖం పట్టాము.ఆరాత్రి భోజనం చేస్తున్నాను.బాపిరాజు గారు కబురంపారు,అన్నగారు వచ్చారు,త్వరగా వారింటికి రమ్మనమని.వెంటనే బయల్దేరాము.పది పదిహేను మందిమి వెళ్ళాం. దశమి వెన్నెల పిండారబోసినట్లుగా ఉంది. బాపిరాజు గారు ఒక మంచం మీద,విశ్వనాథ వారు మరో మంచం మీద కూర్చుని ముచ్చటిస్తున్నారు. బాపిరాజు గారు నన్నాదరంగా పిలవగా వారి మంచం మీద కూర్చున్నాను .బాపిరాజు గారు నన్ను విశ్వనాథ వారికి పరిచయం చేశారు.ఇంతకు మునుపే బాపిరాజుగారు చెప్పారేమో,ఏమి కావాలని ఆయన నన్నడిగారు. నా కోరిక చెప్పాను.ఇప్పుడు సమయం లేదు,రాత్రి తొమ్మిది గంటల బండికి కొవ్వూరు వెళ్లి సంస్కృత కళాశాలలో ప్రసంగించవలసి ఉంది.అయినా శ్రీకృష్ణ జననం గురించి కొంతసేపు మాట్లాడుతానన్నారు.అనర్గళంగా కృష్ణస్వామివారి జనన వృత్తాంతం లోని కరుణరసాన్ని జాలువారించగా మేమందరం తడిసి ముద్దయ్యాం.ఇంతలో రైలుకు టైం అయింది. వారిని రైలెక్కించటానికి నేను స్టేషన్ కు వెళ్లాను. స్టేషన్ మాష్టారు సగౌరవం గా రెండు కుర్చీలు తెప్పించి వేశారు.నేను వెళ్లి సెకండ్ క్లాస్ టిక్కట్ వారికి తెచ్చాను.నన్నడిగారు,నువ్వేదో పద్యాలు వ్రాస్తావట చదువు అని. అప్పుడు నేను ‘వాయుసందేశం’ వ్రాస్తున్నాను.దానిలో కొన్ని పద్యాలు చదివాను.విన్నారు. సంతోషపడినట్లు కనిపించారు.వెంటనే ఇలా అన్నారు-“రేపు నీకోసం వస్తాను.నీవడిగిన బాలకాండ చదవటానికి.ఏర్పాట్లు చేసుకోండి” అని.అన్నట్లే వచ్చారు.మూర్తిరాజు గారి ఆధ్వర్యంలో మంగళ వాయిద్యాలతో స్వాగతం పలికాం.రామాలయపు విశాల ప్రాంగణంలోసాయంత్రం అయిదున్నరకు బాలకాండ పఠనం ప్రారంభమై ఎనిమిదిగంటలకు ముగిసింది.విశ్వనాథ వారు రామాలయం బయటకు వచ్చి నిలుచున్నారు.వారు నిల్చోగానే అందరూ నిల్చున్నారు. నన్నడిగారు,మన ఇల్లెక్కడ అని. చూపించాను.బాపిరాజు గారితో “అన్నగారూ,ఇక్కడ మన ఇల్లు ఉంది.మీరు కూడా భోజనానికి రండి” అని నాతో “నాగేశ్వరరావ్ ,అన్నగారిని మనింటికి భోజనానికి పిల్చాను పద”, అన్నారు.ఇంటికి చేరాము.మా అమ్మగారు వంట చేయటానికి మడి కట్టుకుంటున్నారు. విశ్వనాథ వారు లోపలి కి వెళ్లి, “అమ్మా ,పొట్లకాయ కూర కానీ బీరకాయ కూర కానీ ఏదో ఒక కూర, చారు, నీళ్ళ మజ్జిగ, పెరుగు వద్దు,ఇంతకంటే నేనేమీ తినను.ఇక మీరేమిచేసినా వేరే వారికే”అన్నారు విశ్వనాథవారు బాపిరాజు గారి నడిగారు,”అన్నగారూ నేను మరలా ఎందుకోచ్చానో చెప్పండి” అని.బాలకాండలో ఒక ఘట్టం వినిపించడానికి వచ్చారు అన్నారు బాపిరాజుగారు. అన్నగారూ, మీ జోస్యం పప్పులో కాలేసిందన్నారు విశ్వనాథ వారు.అప్పుడు బాపిరాజు గారు అన్నగారూ, నేను అన్నిటికీ జోస్యం చెప్పను అన్నారు .అప్పుడు విశ్వనాథ వారు “నీవు వ్రాసిన వాయుసందేశం లోని కవితా సౌందర్యాన్ని అన్నగారికి చూపించాలి. తీసుకురా”అ న్నారు. నేను ఆ వ్రాతపతి ని తెస్తుండగా పైడిగంటి పక్షులు (కనకాక్షి పక్షులు) అరిచాయి. వాటి అరుపులు శుభసూచక మన్నారు “ఇతనికీ నాకూ ఉన్న అవినాభావ సంబంధాన్ని అవి సూచించా”యన్నారు . కవితా సౌందర్యాన్ని విశదీకరించారు.”నా దగ్గరకొచ్చి కొంత కాలం ఉండగలుగుతావా,భవిష్యత్తులో నీవు మంచి కవివవుతావని నాకు నమ్మకముంద ”న్నారు.వస్తానండీ అన్నాను.బాపిరాజు గారితో ,అన్నగారూ ,ఇతను రావటానికి ముహూర్తం పెట్టండి, అన్నారు.అంతేకాదు మీరు కూడా నాగేశ్వరరావుతో రండి అన్నారు.బాపిరాజు గారు ఆ నాడు నుండి తొమ్మిదవరోజుకు ముహూర్తం పెట్టారు. రాబోయే ముందు వస్తున్నట్లుగా లేఖ వ్రాయమని చెప్పారు.ఇది సామాన్యమైన లేఖగా ఆయన భావించారని నేననుకోలేదు.నాకొక పరీక్ష గా భావించాను. ఈ క్రింది పద్యాలు వ్రాసి పోస్ట్ చేసాను.

నేనున్ నేనుగ మిమ్మెఱుంగుదును తండ్రీ ! విశ్వనాధాన్వయ
శ్రీ నైష్ఠీక పరంపరానుగతకర్మిష్ఠాద్యనేకవ్రత
జ్ఞానానంద తప: ప్రభావమయ తేజ: పుంజ దీవ్యత్కళా
ధీనప్రాభవ సంచితాకృతిగ, మద్దివ్వ్యైక దైవంబుగా

నేనున్ నే నయి మిమ్మెఱుంగుదును తండ్రీ !సంస్కృతాంధ్రాంగ్లభా
షానిక్షేప సుధారహస్యకలనా సాంగత్య చాతుర్యరే
ఖానైపుణ్య కళాప్రపూర్ణ పదవీ కళ్యాణ మూర్తిచ్ఛటా
స్థానంబౌ నిధి ,బుక్కిటన్ గను యగస్త్యస్వామి సారూప్యుగా.

నేనున్ మీరుగ మిమ్మెఱుంగుదును తండ్రీ ! దానధర్మప్రియా
నూనోదంచిత యాశ్రితార్ధ్యతిధిబంధు వ్రాత తీర్దోల్బణ
ఖ్యానోదార దధీచి కర్ణ శిబి ప్రత్యామ్నాయు నిత్యాగ్నిహో
త్రాను ష్ఠేయునిశోభనాద్రి సుతుగా రామాయణాఖ్యాతగా

నేనున్ శిష్యుడ మిమ్మెఱుంగుదును తండ్రీ ! శిష్యవాత్సల్య సం
ధానోత్సాహ పరాపరార్ధ సుఖ విద్యాదాన సంవర్ధ స
న్మానానేక కటాక్ష వీక్షణ కళా పారేణ దక్షత్వ దీ
క్షానీరంధ్రుగ, సద్గురూత్తమునిగా సాక్షాత్ పరబ్రహ్మగా

బాహిరము కాక యుండెడి భక్తి లెస్స
యీ శరీర ధారులు లౌకికేచ్ఛులగుచు
పార మొందక యుక్తులు పన్నుగాక
పార మార్ధిక బుద్ధి నాపాలి కిడుడు .

మేము, బాపిరాజు గారు పెట్టిన ముహూర్తం కు బయలు దేరాము.విశ్వనాథ వారు ఏలూరు లోనో అక్కడికి దాపు లోనో ప్రసంగించటానికి వచ్చారట. మేము వస్తామన్న రోజు ,మేము వచ్చే బండి వారికి తెలుసు కాబట్టి ఏలూరులో మూడవ తరగతి పెట్టెల్లో మాకోసం వెదకటం మొదలు పెట్టారు.అలా వెదుక్కుంటూ నేను కూర్చున్న చోటుకు వచ్చారు. అన్నగారు ఏరని నన్నడిగారు .చుట్టలు తెచ్చుకోవటానికి వెళ్లారని చెప్పాను. మరేమీ మాట్లాడకుండా మా ఇద్దరి సంచులు తీసుకుని,వారే మోసుకుంటూ,వారి సెకండ్ క్లాస్ కంపార్ట్మెంటు కి బయలు దేరారు.వారి వెంట నేను నడిచాను; సంచులు నాకివ్వమన్నా వారు వినిపించుకోలేదు. ఇంతలో బాపిరాజు గారు కలిశారు.వారి కంపార్ట్మెంట్ టిసి ని మా ఇద్దరి టిక్కట్లు సెకండ్ క్లాస్ కి మార్చమని అవసరమైన డబ్బులిచ్చేశారు. నేను నిర్ఘాంతపోయాను. “ఈ మహాకవేమిటి,మా సంచులు మోయటమేమిటి” అని. వారి దయాగుణం అటువంటిది.

విజయవాడ మారుతి నగర్లో విశ్వనాథ వారికి పెద్ద ఖాళీ స్థలముంది.వారు,బాపిరాజు గారు,నేను,ఇంకొకరిద్దరం అక్కడికి వెళ్ళాము. “అన్నగారూ,రాబోయే డాబాకు అడ్డు లేకుండా నాకొకటి, నాగేశ్వరరావుకొకటి నిట్టాళ్ళ ఇళ్లకు ముహూర్తం పెట్టండి ‘ అన్నారు.అవి తయారయ్యాయి.చెరొక ఇంట్లో వుంటున్నాము.

5.నాగేశ్వరరావు గారూ, రక్తసంబంధీకులతో కలిసి ఉంటేనే పొరపొచ్చాలు రావటం పరిపాటి .మీరు వారితో కలిసున్న కాలంలో మీకు అసంతృప్తి కలిగించే సంఘటనలున్నాయా సార్ ?

ముమ్మాటికీ ఏనాడు అటువంటిది లేదు. ఒక తమాషా విషయం చెబుతాను.నేను ఒకనాడు చిరుచీకటి పడుతున్న వేళ వర్లబావి దగ్గర స్నానం చేస్తున్నాను.పిన్నిగారు,నా భార్య మాట్లాడుకుంటూ కూర్చున్నారు.నేను మడిబట్ట కట్టుకుని పూజ గది లోకి నడుస్తున్నాను. పిన్నిగారు నా భార్యతో అన్నారు, “నాగేశ్వరరావు మా దగ్గర చదువుకోటానికి వచ్చాడు.మాకు పుత్రతుల్యుడు.అతను మమ్మల్ని బాబాయి గారూ,పిన్నిగార్లని పిలుస్తుంటే నీవు కూడా నన్ను పిన్ని గారనడం బాగాలేదు.నీవు నన్ను అత్తగారని పిలవడం సమంజసం”. దానికి నా భార్య ఇలా అంది, “ఆరు నెలలనుండి మిమ్మల్ని నేను బాబాయి గారు,పిన్ని గార్లని పిలుస్తున్నాను.ఈ రోజు అత్తగారని పిలవమంటే ఎలా.నేను మిమ్మల్ని పిన్నిగారనే పిలుస్తాను.పలికితే పలకండి ,లేకపోతె లేదు” అంటూ వెళ్ళిపోయింది. తర్వాత భోజనసమయంలో పిన్నిగారు ఒక గిన్నెలో చామదుంపల కూర,దోసబద్దల పచ్చడి తీసుకు వచ్చి మా ఇద్దరి మధ్య పెడుతూ “మీ బాబాయి గారు ఈ కూర చాలా బావుందన్నారు.మీ కోసం పంపించారు“ అన్నారు.అప్పుడు నా భార్య, “పిన్నిగారూ మీరు ఓడిపోయారు” అన్నది. పిన్నిగారు “ఎలా?” అన్నారు. “మీరే అన్నారుగా,మీ బాబాయి గారని,కాబట్టి మిమ్మల్ని పిన్నిగారనే పిలుస్తాన”న్నది నా భార్య.అప్పుడు పిన్నిగారు “ఎలా పిలిస్తే ఏముంది లేమ్మా ,అలానే పిలు” అని నవ్వుతూ వెళ్ళిపోయారు.ఆ దంపతుల సౌజన్యం,పుత్రవాత్సల్యం అటువంటిది.అప్పుడు నాకొక పద్యం రాయాలనిపించింది.ఆ పద్యం ఇది.

ఆదిపురాణ దంపతుల నమ్మగా నయ్యగా నెంచి భక్తితో
పాదములన్ భజించెదరు,భార్యయు భర్తయు నట్ల యే త దం
శా ధరణీయ మూర్తుల మహా ధిషణాఢ్యుల రైన మిమ్ము మా
యౌదల దాల్చి పొంగెద మహా తలిదండ్రు లటంచు నిత్యమున్

6.విశ్వనాథ వారి అభిజాత్యం గురించి,వారి స్వతంత్రేఛ్ఛ గురించి మీకు బాగా తెలిసి ఉంటుంది. కొంచెం చెప్పగలరా ?

అవును ,మీ ప్రశ్నలోని గుణాలకు వారు మూర్తి కట్టినట్లుంటారు. మద్రాస్ ప్రెసిడెన్సీ కి టంగుటూరు ప్రకాశం పంతులు గారు ముఖ్య మంత్రిగా ఉన్నప్పుడు చెళ్ళపిళ్ళ వెంకట శాస్త్రి గారిని ఆస్థాన కవిగా నియమించుకుని తత్సంబంధమైన వేడుక సభను విజయవాడ లో జరిపారు. ఆంధ్రేతరులు చాలామంది ముఖ్య అతిధులుగా వచ్చారు.ఆంధ్రులు మధన పడ్డారు. ఆ నాటి సభకు మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి చింతలపాటి దక్షిణామూర్తి గారు అధ్యక్షత వహించారు. ఎవరెవరో ఏదేదో మాట్లాడారు.ఆఖరి పదిహేను నిముషాలలో ముగ్గురు తెలుగు కవులను మాట్లాడ వలసిందిగా అధ్యక్షుల వారు ఆహ్వానించారు.మొదటగా విశ్వనాథ వారు వేదికనెక్కారు.మహోపన్యాసం ప్రారంభించారు.పద్యాలు చదివారు.అధ్యక్షులవారు సమయపాలన పాటించవలసినదిగా బెల్ నొక్కారు. విశ్వనాథ వారు అధ్యక్షుల వారి వైపు తిరిగి జేబులోంచి నశ్యం డబ్బా తీసుకుని నిర్లక్ష్యంగా నశ్యం పీల్చి నిస్సంకోచంగా, నిర్భీతితో అన్నారు, ”నన్ను మాట్లాడమని మీరు పిల్చారు. నేను మాట్లాడ దలచుకున్న విషయాల గురించి ఇరవై నిముషాలు మాట్లాడతాను .నా అంతట నేనే అప్పుడు దిగిపోతాను” అని తమ ఉపన్యాసాన్ని కొనసాగించారు.శ్రోతల కరతాళధ్వనులతో సభ మారుమ్రోగింది.వారి అభిజాత్యం,మానసిక స్థైర్యం,ప్రతిభ అవి. ఈ సందర్భంలో మరొక విషయాన్ని కూడా ప్రస్తావించవచ్చు.విశ్వనాథ వారు ఎస్సారార్ అండ్ సివియార్ కళాశాలలో తెలుగు శాఖాధ్యక్షులుగా పని చేస్తున్న రోజులు. కళాశాల పాలక మండలి అధ్యక్షులు చుండూరు వెంకట రెడ్డి శ్రేష్టి గారు, జటావల్లభుల పురుషోత్తం గారు,మాధవరామ శర్మగారు తదితరుల కోరిక మీద వారిని తన వెంట తీర్ధయాత్రలకు,విహారయాత్రలకు తీసుకు పోతుండేవారు.సత్యనారాయణ గారు నన్నడగవచ్చుకదా అని అనేవారట.ఈ విషయమై విశ్వనాథ వారితో ఎవరైనా ప్రస్తావించినపుడు –వారు పిలవంది నేనెలా వెళతాను అనేవారట.

7.తమ రచనలేవీ తమ స్వహస్తాలతో వ్రాసేవారు కాదనీ,కేవలం డిక్టేట్ చేసేవారనీ అంటారు. పత్రికలవారికి సీరియల్ గా వస్తున్న తమ నవలలను కూడా వారం వారం ఇలా ఒకరితరువాత ఒకరికి డిక్టేట్ చేస్తుండేవారని విన్నాను.సృజనాత్మక సాహితీ ప్రక్రియలను కూడా అప్పటికప్పుడు ఇలా డిక్టేట్ చేయటం వారి అసాధారణ ప్రజ్ఞకు నిదర్శనం.ఈ విషయమై మీ స్వానుభవం ఏమిటండీ ? ఇలా డిక్టేట్ చేయగలిగిన రచయితలు మరెవరైనా మీకు తెలుసా?

విశ్వనాథ ఒక్క రామాయణ కల్పవృక్షం మాత్రం ఆద్యంతం తమ స్వహస్తాలతో నిష్ఠగా వ్రాశారు.ముప్ఫై సంవత్సరాలు పట్టింది.అది వారి జీవిత పరమార్ధంగా భావించారు.తక్కినవన్నీ, పద్య రచనలు కానీ,గద్య రచనలు కానీ పూర్తిగా డిక్టేట్ చేయబడ్డవే.కుక్కిమంచం మీద పడుకుని రెండు అరచేతులను దిండు మీద ఆనించి వాటిలో తల పెట్టుకుని తమతో వున్నవారితో లోకాభిరామాయణం సాగిస్తూనే తమ రచనలను డిక్టేట్ చేసేవారు.వారికి బటానీలన్నా,వేయించిన వేరుసెనగ కాయల విత్తనాలన్నా ఇష్టం.వాటిని అప్పుడప్పుడు తింటూ డిక్టేట్ చేసేవారు.విశ్వనాథవారు అసాధారణ ప్రజ్ఞాశాలి.ఈ విధంగా డిక్టేట్ చేసినవారు,చేయగలిగినవారు నాకు తెలిసినంతవరకు మరెవరూ లేరు.

8.వారి మాట మాత్రమే పరుషము,మనసు వెన్నపూస అంటారు.వారి ఔదార్యాన్ని గురించి, వారి కరుణామయ స్వభావాన్ని గురించి,వారి దాతృత్వాన్ని గురించి, ప్రతిభ ఎక్కడ కనిపించినా పులకాంకితులై ప్రశంసలతో ముంచెత్తే గుణం గురించి విన్నాను.మీ స్వానుభవం చెబుతారా ?

మీ ప్రశ్నలో ప్రస్తావింపబడిన గుణాలన్నీ పరమ సత్యాలు.రసతరంగిణి ప్రెస్ వీరిదే.దీని యాజమాన్య బాధ్యతలను,వారి మేనల్లుడు,అల్లుడు అయిన గుంటూరు సుబ్బారావు గారికి, నాకు అప్పజెప్పారు.వారి రచనలు,ఇతరుల రచనలు,జాబ్ వర్క్ కూడా చేస్తూ ఉండేవారం.జీతం వద్దన్నా ఇచ్చేవారు.సరుకులు తెప్పించి మా ఇళ్ళల్లో పడేయించేవారు.వారి ఆర్ధిక స్థితి బాగా లేని రోజులలో కూడా, ఏవో అత్యవసర సరకులు కొనడానికి వెళ్లి ,దీనస్థితి లో వున్నవారినెవరినో చూసి చలించి జేబులో ఉన్న డబ్బు కాస్తా వారి చేతిలో పెట్టి రిక్తహస్తాలతో ఇంటికి తిరిగి వచ్చిన సందర్భాలు అనేకం.ఫీజు కట్టని విద్యార్ధుల పేర్లు కాలేజీ యాజమాన్యం తొలగిస్తే వారి వివరాలు తెలిసికొని వారందరికీ ఫీజులు కట్టిన సందర్భాలు కోకొల్లలు.కరుణ లోంచి వచ్చిన దాతృత్వం వారిది .అన్నీ గుప్త దానాలే.జ్ఞానపీఠ బహుమతి లక్షరూపాయలలో సగం వారి నాన్నగారు కట్టించిన శివాలయ శిధిలభాగాలు బాగుజేయించటానికి, రామాయణ కల్పవృక్షం మొత్తం లైబ్రరీ ఎడిషన్ గా ముద్రించటానికి ఖర్చు పెట్టిన మహానుభావుడు.

తనతో కొన్నాళ్ళు జంట కవిగా ఉన్న కొడాలి ఆంజనేయులు గారు జంటకవి గా కొనసాగితే పోతనగారి వలె కలకండ అచ్చులు కవిత్వం లో పోసేవారమని తన తోటి కవిని విశేషంగా మెచ్చుకున్న దొడ్డ మనసున్న మంచి మనిషి.

ప్రతిభను మెచ్చుకోవటం గురించి అడిగారు.ఒక తమాషా సంఘటన గుర్తుకొస్తుంది.ఒకరోజు విశ్వనాథ వారు,నేను విజయవాడ నుంచి తెనాలి వెళుతున్నాము.ఇంతలో ఒకతను గొప్ప గౌరవ భావం తో “దండమయ్యగారూ “ అంటూ చేతులు జోడించాడు. ”ఏమోయ్ ,సుబ్బన్నా, బావున్నావా? ఎంతమంది జేబులో కొట్టావు.నా జేబు కొట్టు“ అన్నారు .సుబ్బన్న మరలా చేతులు జోడించి అంతటి పాపకార్యం ఎలా చేస్తానన్నట్లు వినయంగా నవ్వాడు.అతనూ మాతోనే నడిచి వచ్చాడు. విశ్వనాథ వారు బ్రిడ్జి మెట్లు దిగి రైల్వే స్టేషన్ లోని టికెట్ కౌంటర్ కు వెళ్లి జేబులో చేయి పెడితే డబ్బులు లేవు. సుబ్బన్న చేతులు జోడించి నవ్వుతూ నాలుగు పది రూపాయల నోట్లు వినయంగా విశ్వనాధ వారి చెంత ఉంచాడు. ”ఆరి పిడుగా,నా జేబు కూడా కొట్టేశావన్నమాట “ అని అతని హస్తలాఘవానికి తెగ మురిసిపోతూ భుజం మీద చేయి వేసి ఆలింగనం చేసుకున్నంత పని చేశారు. అవును,మీరన్నట్లు మాట పరుషం,అతి కోపిష్ఠి.ఆయన కోపం పాలపొంగులాంటిది.నిష్కపటి.మనసు వెన్న లాంటిదే.ఎవరినైనా సాధించాలన్న తత్త్వం అసలు లేదు.ఎదుటివారి మంచితనం తట్టుకోలేక ఏడుస్తారు.కృతజ్ఞత వారి దృష్టి లో చాలా మంచి సుగుణం. వారి మనసు వెన్నని అనుకున్నాం కదా,అది అక్షరసత్యం.నేనెప్పుడూ సంతోషపడేదీ ,బాధ పడేదీ వారి మంచితనం చూసి. నేను వెళ్ళిపోయిన తరువాత నేనున్న పాక తీసివేసి కాంక్రీట్ భవనం కట్టించి అది పూజా గృహంగా చేశారు.దానికి శ్రీవిద్యా నిలయం అని పేరు బెట్టి, ”మా నాగేశ్వరరావు నాకెప్పుడూ గుర్తుండటానికి తానొకప్పుడున్న పాక ను శ్రీవిద్యానిలయం గా కట్టించాను“ అని అందరితో చెప్పేవారు.(శ్రీ నాగేశ్వరరావు గారు ఈ మాటలు చెప్పి, విశ్వనాధ వారి శిష్య వాత్సల్యానికి, తన మీద వారికున్న ప్రేమ,కరుణ లు తలచుకుని కరిగి అశ్రు పూరిత నయనాలతో,దుఃఖం తో పూడుకపోయిన గొంతుతో మాట పెగలక అలా ఉండిపోయారు)

9.సార్,వారి కరుణా స్వభావాన్ని తెలియజేసే సంఘటన మరొకటి మీ స్వానుభవం లో ఉందా అండీ ?

మీరంటే గుర్తుకొచ్చింది.వారింటికీ,మా ఇంటికీ వచ్చే బంధు మిత్రుల సంఖ్య పెరగడంతో నేను వారింటికి కొద్ది దూరంలో ఒక డాబాలో అద్దె కున్నాను.ఆ సంవత్సరం పెనుతుఫాను వచ్చింది.నదీనదాలు ఏకమయ్యాయి.చెట్లన్నీ కూలిపోయాయి.చాలా వరకు ఇండ్లన్నీ పడిపోయాయి.జననష్టం జరిగింది.నాకు మా గురువుగారు ఎలా ఉన్నారా అని దిగులు పట్టుకుంది.మా ఇల్లు కొంతవరకు బాగానే ఉండటం వల్ల వంట చేయించి ఆహార పదార్ధాలు మంచినీరు ఒక పెద్ద బుట్టలో పెట్టుకుని మోసుకుంటూ ఆ గాలివానలో వారింటికి వెళ్లాను. పాపం,దుప్పట్లు కప్పుకుని ఒక మూల వారిద్దరూ ముడుక్కుని కూర్చున్నారు.నన్ను చూసి పిన్నిగారితో అన్నారు, “అన్నానా,నాగేశ్వరరావు వస్తాడని”.ఈ భోజనం అదీ చూసి ఆ గాలివానలో నేను రావడం చూసి చలించి పోయి కన్నీళ్ళ పర్యంతం అయ్యారు.అక్కున జేర్చుకున్నారు.(నాగేశ్వరరావుగారు మరలా దుఃఖం తో వివశులయినారు.)

10. శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు అంటే కంచి పెదస్వామి వారు శ్రీ విశ్వనాథ వారి కవిత్వాన్ని ప్రశంసించారని విన్నాను. దీని గురించి శ్రీ విశ్వనాథవారు మీతో ఎప్పుడైనా చెప్పటం జరిగిందా సార్ ?

మంచి విషయాన్ని గుర్తు చేశారు.ఒకసారి కంచి పెదస్వామి వారి మీద పద్యాలు వ్రాసి వారికి వినిపించటం కోసం శ్రీ విశ్వనాథ వారు కంచి వెళ్లారు.ఇలా వచ్చినట్లు వారి శిష్యులతో కబురు చేశారు. స్వామివారు రమ్మన్నారు. విశ్వనాథ వారు చదవటం ప్రారంభించారు.దాదాపు ఇరవై పద్యాలు చదివారు.స్వామివారిని చూశారు. వారు చలన రహితంగా కూర్చుని ఉన్నారు.విశ్వనాధ వారికి కోపం వచ్చింది.హఠాత్తుగా లేచి నమస్కారం చేసి బయటకు వెళుతున్నారు.స్వామివారు విశ్వనాథవారిని వెనక్కు పిలిపించారు.కూర్చోమన్నారు.”నేను వినడం లేదనుకున్నావు కదా “అని, విశ్వనాథ వారు చదివిన పద్యాలు మొత్తం మనోరంజకంగా మొత్తం చదివారు. ఇప్పుడు నీకు అర్థమయిందా,అని ఆశీర్వాదం ఇచ్చారు. విశ్వనాథ వారి కనుల వెంట పశ్చాత్తాప భాష్పకణాలో,ఆనంద భాష్పాలో తెలియదు.ఏది ఏమైనా కన్నీటితో కరిగి పోయారు.

11. వారి సాహిత్య సృజన గురించి రెండు మాటలు చెప్పండి సార్

వారు మహా పండితులు,గొప్ప కవి,విమర్శకులు,నవలా రచయిత. రససృష్టికి ప్రాధాన్యత నిచ్చి రచనలు చేసిన కళామూర్తి.వారి అపారమైన సాహితీ ప్రతిభను గురించి అనేకమంది విద్వాంసుల నుండి ఎనలేని మెప్పును పొందారు .విశ్వసాహిత్యం లోనే బహు సాహితీ ప్రక్రియలలో ఇంత విస్తృతంగా విశిష్ట రచనలు చేసినవారు ఇంకొకరు వున్నట్లు నాకు తెలియదు.

12.నాగేశ్వరరావు గారూ,విభిన్న కోణాలలో విశ్వనాథ వారి వ్యక్తిత్వాన్ని మీకున్న అపారమైన సాన్నిహిత్యంతో,గురుభక్తితో చక్కగా వివరించారు.మీరందించిన సమాచారం,వెలిబుచ్చిన అభిప్రాయాలు విశ్వనాథ వారి మీద గౌరవాన్ని అభిమానాన్ని పెంచేవి గా ఉన్నవి.ఈ వయసులో కూడా శ్రమనుకోకుండా ఈ ఇంటర్వ్యూకు నాతో సహకరించినందుకు ధన్యవాదాలు.

నమస్కారం .

C.S.Rao

శ్రీ గంధం నాగేశ్వరరావు గారు తొంభై యారు సంవత్సరాలున్నా ,బస్సుల్లో అవలీలగా వెళ్ళిరావడం ,మూడవ అంతస్తు లోని వారి గదిలోకి సునాయాసంగా మెట్లెక్కి వెళ్లటం,వారి బట్టలు వారే ఉతుక్కోవటం ,అన్నిటినీ మించి చెరగని చిరునవ్వుతో,ప్రశాంత చిత్తంతో ఎల్లప్పుడూ ఉండటం – ఇవన్నీ చూసి వారికి ఇంకా కనీసం పది సంవత్సరాల ఆయుర్దాయం వుందని నేను నమ్మాను.కానీ ఏదో నలతగా ఉన్నదని,ఊపిరి అందటం లేదని చెప్పడం తో,ఐసియు లో ఉంచి ,ఆక్సిజన్ మాస్క్ పెట్టిన మూడు గంటలకే  శివైక్యం చెందారు,ఫిబ్రవరి మూడవ తేదీ భీష్మ ఏకాదశి పర్వదినాన . నాకు పరిచయం ఉన్న  అతి కొద్ది మంది ప్రతిభావంతులైన చాలా మంచి మనుషుల్లో కీర్తి శేషులు శ్రీ గంధం నాగేశ్వరరావు గారు ఒకరు.
గతరెండు నెలలుగా నేను దుబాయ్ లో ఉండి మొన్ననే తిరిగిరావడం వలన వారి మరణవార్త ఈ రోజే తెలిసింది .
వారిదివ్య స్మృతి కి నా ప్రేమపూర్వక శ్రద్ధాంజలి .
సి.ఎస్ .రావ్

06-03-2012

 

 

You Might Also Like

16 Comments

  1. Ramachandra Murty -VITHALA

    Interview వెల్ డన్ .ఎన్నో మంచి vishayaalu అందంగా సమగ్రంగా తెలియ చేసారు.అభినందనలు. ధన్యవాదాలు.విశ్వనాధ వారు శ్రీగంధం వారు ఇద్దరు ఇద్దరే. మహా మహులు.

  2. Mulpuru narasimha Rao

    కొండని అద్దంలొ చూసినట్టుగా వుంది సార్!

  3. Gomattam Venkata Lakshmana Phaneendra Nath

    Kavi Samrat Sri Vishwanatha vari vyakthithvam theliyacheppe, Intha Adbhuthamyna Mukhamukhi ni naboti ( sahithipriyuda nyna) agnyaniki andajesina varandariki na hrudayapoorvaka dhanyavadamulu. Naa mithrudu Eleswarapu Ramakrishna, Link pampina Vaidehi garu, Mukhamukhi ki roopamichchina CS Rao garu, enthagano abhinandaneeyulu. Mukhamukhi sandarbhalanu entho hrudyamga prasadinchina Keerthi Sheshulu sri Gandham Nageswara Rao garu manadariki chirasmaraneeyulu. Nenentho Dhanyunni Kruthagnyunni.

  4. kasturimuralikrishna

    గంధం నాగేశ్వరరావు గారితో నాకు వ్యక్తిగత పరిచయం వుంది. అదీ విశ్వనాథ సత్యనారాయణ గారి పట్ల మా ఇద్దరికీ వున్న అభిమానం వల్ల. నేను నా రచనలన్నీ అమ్మకూ, నాన్నకూ, గురుతుల్యులు విశ్వనాథ వారికి అంకితం ఇస్తానని తెలుసుకుని సంతోషించారు. బోలెడన్ని విషయాలు విశ్వనాథ వారి గురించి చెప్పారు. వొళ్ళంతా చెవులు చేసుకుని విన్నాను. ధన్యుడనయ్యాను. వారితో దాదాపుగా వారం రోజులు గడిపాను. ఇది నేను నడుస్తున్న చరిత్రలో అంతర్మథనం అనే నవల రాస్తున్నప్పుడు. అంటే 12 ఏళ్ళక్రితం. ఈ ఇంటర్వ్యూ ఆ ఙ్నాపకాలను తాజా చేసింది. వారు పోయారన్న వార్త చాలా బాధను కలిగించింది. వుద్యోగాన్ని వదలి విశ్వనాథ వారి శిష్యరికానికి ఎలా వెళ్ళారు? మీ కుటుంబాన్ని పోషించే దిగులు లేదా? అనడిగాను. దానికాయన నవ్వి, విశ్వనాథ వారితో కలసి నివసించగలిగే భాగ్యం ముందు మిగతా ఏదీ పనికిరాదన్నారు. నాకు అలాంటి అవకాశాం లభిస్తే అంత ధైర్యంగా అలాంటి నిర్ణయం తీసుకోలేననీ తెలుసు. అందుకేవారి అదృష్టానికి ఈనాటికీ నాకు అసూయే. చక్కని ఇంటర్వ్యూ ప్రచురించినందుకు ధన్యవాదాలు.

  5. muthevi ravindranath

    mukhaamukhee chaalaa baagundi.kavi samraat gurinchi theliyani enno vyakthigatha vivaraalu koodaa thelipina kee.shae.gandhjam naagaeswara raavu gaaru, aksharabaddham chaesina
    c.s.raavu gaaru abhinandaneeyulu.
    MUTHEVI RAVINDRANATH.

  6. Satyanarayana Piska

    చాలా విలువైన ఇంటర్వ్యూ ! అద్భుతం. విశ్వనాథవారిని గురువుగా పొందగలిగిన ఆనాటి విద్యార్థులు ఎంత అదృష్టవంతులో కదా!

  7. Aparna Yeluripati

    It’s very nice to know about great persons through great persons.
    Interview ni share chesina C.S. Rao gariki, link pampina Vaidehi gariki krutagnathalu.

  8. అఫ్సర్

    చాలా విలువయిన ముఖాముఖీ. “పుస్తకం” విలువకి కొత్త చేర్పు నిజంగా!
    విశ్వనాథ వారితో ఎందరికో ఎన్నో గొప్ప అనుభవాలు వుండే వుంటాయి. నా మటుకు నేను విశ్వనాథ గురించి గొప్పగా విన్నది మా నాన్న గారి నించి – ఆయన విశ్వనాథకి విద్యార్థి. బెజవాడ మాచవరంలో మేం కొండ మీద వుండే రోజుల్లో విశ్వనాథ వారు కొండ కింద వుండే వుండే వారు. కొండకిందకి వెళ్తున్నా అని నాన్నగారు అనగానే మా అమ్మగారికి అర్థమయిపోయెదట. ఆ కొండ విశ్వనాథ అని! నాన్నగారు అభ్యుదయ రచయిత కావడం, చాలా కాలం పాటు కరడు కట్టిన కమ్యూనిస్టుగా వుండడం విశ్వనాథ పట్ల ఆయనకు వుండే గురుభావానికి ఏనాడూ అడ్డు కాలేదు! ఆ మాటకొస్తే, ఆయన శ్రీ శ్రీ కంటే కూడా విశ్వనాథ గురించే ఎక్కువ మాట్లాడే వారు! నిజానికి వొక్కో రచయితని తీసుకుని, ఆ రచయిత మిత్రులతోనో, పరిచయస్తులతోనో మంచి రచనలు వేసినా, అది చరిత్రకి గొప్ప ముడి సరుకు.

    పుస్తకం లో ఇలాంటి ముఖాముఖీలు, గొప్ప వాళ్ళ జ్నాపకాలూ మరిన్ని చూడాలని నా కోరిక.

    1. కొత్తపాళీ

      చాలా బావుంది అఫ్సర్. విశ్వనాథ అధ్యాపక వృత్తి చెయ్యకుండా ఎక్కడో ఒక గదిలో కూర్చుని తన రచన సాగించి ఉండినా, లేక వేరే ఉద్యోగం ఏదైనా చేసి ఉండినా బహుశా ఆయన ఖ్యాతి ఇంతగా వ్యాపించి ఉండేది కాదేమో. అధ్యాపక వృత్తిలో దీర్ఘకాలం కొనసాగటం వల్ల ఆయన కొన్ని వేల మంది విద్యార్ధుల మనసుల్ని ప్రభావితం చేసి ఉంటారు.

  9. రవి

    విశ్వనాథ వారు –

    – దానధర్మప్రియానూనోదంచిత యాశ్రితార్ధ్యతిధిబంధు వ్రాత తీర్దోల్బణఖ్యానోదార దధీచి కర్ణ శిబి ప్రత్యామ్నాయులు! (దధీచి దేవతలకోసం తన వెన్నెముకను (వజ్రాయుధం) ఇంద్రునికి దానం చేసిన పురాణపురుషుడని కథ. పావురం కోసం ప్రాణాలిచ్చిన శిబి కథ తెలిసిందే. విశ్వనాథవారు వారిద్దరికీ ప్రత్యామ్నాయం!!!!)

    – గంధం నాగేశ్వరరావు గారికి సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపమై గోచరించినవారు.

    – విశ్వనాథ వారు మహాకవి ఐనప్పటికీ వ్యాసరచయిత సంచులు మోసారు!

    – విశ్వనాథ వారు వేరుశనక్కాయలు, బఠానీలు తింటారు. తింటూనే కావ్యం డిక్టేటు చేయగలరు.

    విశ్వనాథ వారి మీద వ్యాసం కాబట్టి బావుండాలి. బావుంటుంది. అలానే కానిద్దాం.

    1. Purnima

      ముందుగా ఇది వ్యాసం కాదు. ముఖాముఖి. (ఇంటర్వ్యూ) కాబట్టి ఇక్కడ వ్యాసరచయిత ఎవరో నాకు తెలీటం లేదు.

      >> విశ్వనాథ వారి మీద వ్యాసం కాబట్టి బావుండాలి. బావుంటుంది. అలానే కానిద్దాం.

      🙂

    2. రవి

      పూర్ణిమ గారు, వ్యాసరచయిత అనడం పొఱబాటుతో టైపాటు. అయినా తెలియవలసింది మీకు తెలిసింది కాబట్టి ఇబ్బంది లేదు.

    3. valaludu

      <>
      విశ్వనాథవారు కవిత్వం చెప్పేవారనీ, రాసేవారు కాదనే విషయం చాలా విలువైన అంశమే మరి. మీరింతకుముందెక్కడా చదవలేదా? ఆ విషయం అంటే చదవని వారూ ఉంటారు కదా, వారికోసమైనా అది గొప్ప విశేషమే.
      కవి జీవితంలో విశేషాల గురించి ఏ విధమైన సాహిత్యమూ ఉండనక్కరలేదు, వారి రచనా వ్యక్తిత్వంతో తప్ప వారి జీవితంతో మనకేం పని అనుకునే ధోరణి ఒకటుంది. ఆ ధోరణికి చెందినవారి సంగతేమో కానీ మిగిలిన పాఠకులకు మాత్రం కవి సాహిత్యం అవతల వ్యక్తిగా ఎలా జీవించాడు అనే విషయంపై ఆసక్తి ఉంటుంది. తమిళమిత్రులు సుబ్రహ్మణ్య భారతి జీవితంలో ఇలాంటి బుల్లి బుల్లి విశేషాల గురించి తన్మయత్వంలో(ఇంగ్లీషులోనే లెండి) చెప్తూంటే విన్నాను. అలాంటి కోవకు చెందిన ఈ వ్యాసం నిజ్జంగా గొప్ప వ్యాసమే.

  10. కొత్తపాళీ

    అద్భుతం. ఈ అపురూపమైన కానుక అందించినందుకు అనేకానేక నెనర్లు.

  11. పంతుల గోవాల కృష్ణ

    ఈ ఇంటర్వ్యూ చదవగలగడం నా అదృష్టంగా భావిస్తున్నాను.నేను కాలేజీలో చదివే రోజుల్లో (1957-61) విశ్వనాథ వారు మహా కవే కాని మహా గర్విష్టి కూడా అనుకునే వాడిని. అప్పట్లో ఆయన గురించి ప్రచారంలో ఉన్న విషయాలు అలాంటివి. కాని కొన్నేళ్లక్రింతం పత్రిక అనే మాగజైన్ లో ఆయన గురించి చదివి నా తప్పుడు అబిప్రాయాన్ని సరిదిద్దుకున్నాను. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ చదివాక ఆ మహాకవి గారి మహోన్నత వ్యక్తిత్వం కూడా నా కవగతమైంది. కృతజ్ఞుణ్ణి.

  12. సౌమ్య

    Very interesting! Thanks for sharing!

Leave a Reply to Mulpuru narasimha Rao Cancel