జీవితాన్ని రమించిన వాడి కథ — Dev Anand’s Romancing With Life

కొన్ని నెలల క్రితం దేవానంద్ మరణించాడన్న వార్త చదివి, అయ్యో అనుకొని, బాధపడి, ఇంటర్నెట్‌లో పాత దేవానంద్ పాటల లింకులు వెతికి చూసి, తెగ నిట్టూర్పులు విడిచిన అసంఖ్యాక జనాలలో నేనూ ఒక్కణ్ణి.  మీకు తెలుసో తెలీదో కానీ, ఒకప్పుడు cool అన్న పదానికి దేవానంద్ నిర్వచనంగా ఉండేవాడు. నా తొలియవ్వనపు రోజుల్లో నన్ను అమితంగా ఆనందింపచేసిన సినిమాల్లో, పాటల్లో హీరో దేవానంద్ అంటే ఇప్పటికీ మనసులో ఒక సాఫ్ట్ కార్నర్ ఉంది. గతవారం హైదరాబాదులో ఒక మిత్రుణ్ణి కలిసినప్పుడు దేవానంద్ ఆత్మకథను చూపించారు. పాపం, ఆయన్ను బాగా మొహమోటపెట్టి ఆ పుస్తకం జాతీయం చేసి ఢిల్లీ చికాగో ఫ్లైట్లో హడావిడిగా పుస్తకం చదివేశాను.

నేను చూసిన మొదటి దేవానంద్ సినిమా ప్రేమ్ పూజారి. పీయూసీ పరీక్షలు రాసిన తర్వాత తెనాలిలో ఉండగా (1970) రిలీజ్ అయ్యింది.  దేవానంద్ తొలిసారిగా దర్శకత్వం వహించి, స్వంతంగా నిర్మించిన  చిత్రం కావటంతో చాలా ఆర్భాటమైన ప్రచారం మధ్య విడుదలయ్యింది. పాటలు అప్పటికే పెద్ద హిట్ (ఆంధ్రజ్యోతి వారపత్రికలోనో, ఆంధ్రపత్రికలోనో ప్రేమ్‌పూజారి  పాటల గురించి ఒక ప్రత్యేక వ్యాసం వచ్చింది ఆ రోజుల్లో).  సినిమా కొద్దిగా గందరగోళంగానూ, అసంతృప్తిగానూ అనిపించినా పాటలతో పాటు, హీరో దేవానంద్, హీరోయిన్ వహీదారెహ్మాన్ బాగా నచ్చేశారు. కొన్నాళ్ళ తర్వాత విజయానంద్ దర్శకత్వంలో జానీ మేరా నామ్ సినిమా వచ్చింది. దేవానంద్, హేమామాలినిల జోడీ, కళ్యాణ్‌జీ ఆనంద్‌జీల సంగీతం.హుషారైన సినిమా. తర్వాత కొన్నాళ్ళకి హరేరామ హరేకృష్ణ.  ఇంకొన్నాళ్ళకు తేరే మేరే సప్నే. అప్పట్నించీ దేవానంద్ అంటే చాలా అభిమానం.

ప్రత్యేకమైన హెయిర్‌స్టయిల్, మెడలో స్కార్ఫ్, తలపై ఫాషనబుల్ కేప్‌లతో, ఆకర్షణీయంగా డ్రస్ చేసుకొని, కొద్దిగా మెడ పక్కకి వాల్చి, కళ్ళు కొంచెం మూసి నవ్వుతూ (చేతుల్ని జాయింట్లు లేనట్లు లూజుగా వదిలేసి 🙂 ఉండే ఈ హీరోకి చాలామంది అభిమానులు ఉండేవారు, ముఖ్యంగా అమ్మాయిల్లో. ఆరోజుల్లో స్క్రీన్ పత్రికలో మూడోపేజీల్లో వచ్చే అడ్వర్టైజ్‌మెంట్ సాధారణంగా దేవ్ఆనంద్ సినిమాలకి సంబంధించి ఉండేది (అమర్‌జీత్ అనె దేవానంద్ అంతేవాసి – హం దోనో, తీన్ దేవియా చిత్రాలకు నామమాత్రం దర్శకుడు – తాలూకు యాడ్ కంపెనీ ఆ పేజీ గుత్తకు తీసుకొందనుకుంటా). గుంటూరు మెడికల్ కాలేజీలో చేరాక ఆదివారం ఉదయం నాజ్ అప్సరలో పాత హిందీ సినిమాల మార్నింగ్ షోలలో ఎప్పుడు దేవానంద్ సినిమా వచ్చినా మా బేచ్ ఒక్కటి తయారుగా ఉండేది. హమ్ దోనో, కాలా బాజార్, తేరే ఘర్ కే సామ్నే లాంటి సినిమాలు చూస్తుంటే ఆనంద్ సోదరులందరిమీదా, నవ్‌కేతన్ బ్యానర్‌మీద తెగ అభిమానం పెరిగిపోయింది. నవ్‌కేతన్ సినిమాలంటే గొప్ప సంగీతం (ఎస్.డి. బర్మన్, ఆ తర్వాత ఆర్.డి. బర్మన్, ఒక్కసారి జయదేవ్) ఉండేది. ఆరాధన చిత్రానికి ముందు కిషోర్‌కుమార్ దేవానంద్‌కొక్కడికే ప్లేబ్యాక్ పాడుతుండేవాడు. కథ చెప్పటంలో, పాటల చిత్రీకరణలో అప్పటికీ, ఇప్పటికీ గొప్ప మాస్టర్ విజయానంద్. అతని చిత్రీకరణలో  దేవానంద్ పక్కన నూతన్, వహీదా, వైజయంతిమాల వంటి అందగత్తెలు జోడీగా దిల్‌కె భవరె కరే పుకార్ వంటి పాటలు చాలా అందంగా, రొమాంటిక్‌గా ఉండేవి. గైడ్ సినిమా (ఆర్‌కే నారాయణ్ నవల) లక్ష్మీ టాకీస్‌లో మార్నింగ్‌షోలు మాత్రమే వస్తే, నేనూ మిత్రుడు సీఆర్‌శ్రీనివాస్ అనాటమీ థియేటర్ ఎగ్గొట్టి వెళ్ళాం. మా అదృష్టం (?) కొద్దీ ఆరోజే ప్రొఫెసర్ హరిరావు సర్‌ప్రైజ్ టెస్ట్ పెట్టటానికి నిశ్చయించుకోవటంతో మా బండారం ఆయన దృష్టిక్కూడా వెళ్ళింది. ఐతే ఏం? మతి పోగొట్టిన సినిమా. ఆర్కే నారాయణ్, ఎస్డీ బర్మన్, కిషోర్, లత, రఫీ, హీరాలాల్, విజయానంద్, ఉదయ్‌పూర్‌, వహీదా, దేవ్! వాహ్! ఇప్పటికీ అబ్బురంగానే ఉంటుంది. ఆజ్ ఫిర్ జీనే కీ తమన్నా హై, గాతా రహే మేరా దిల్ వింటానికీ, చూడడానికీ ఈరోజుకీ హాయిగా ఉంటాయి. అమెరికాకు వచ్చాకకూడా ఇంతకు ముందు చూడని దేవానంద్ విడియోటేపులు తెచ్చుకొని చూసేవాళ్ళం.

నిజానికి దేవానంద్‌ని మేము అభిమానించటం మొదలయ్యేప్పటికే అతని చలనచిత్ర చరిత్రలో ఉచ్ఛస్థాయి గఢచిపోయి, అతని ప్రభ తగ్గిపోతూ ఉంది. మా కాలేజ్ రోజులు ఐపోయిన తర్వాత అతనికి చెప్పుకోదగ్గ హిట్ సినిమా లేదు. ఐనా 88వ యేట చనిపోయేడాకా తనే కథ వ్రాసి, దర్శకత్వం వహిస్తూ చిత్రాలు నిర్మిస్తూనే ఉన్నాడు. ఒకరకంగా అతను చలనచిత్రాల కోసమే జీవించాడు.

దేవ్ ఆనంద్ అసలు పేరు ధరమ్ దేవ్ ఆనంద్. పంజాబ్‌లో గురుదాస్‌పూర్ అనే చిన్న పట్నంలో జన్మించాడు. తండ్రి న్యాయవాది. పెద్ద కుటుంబం. తల్లితో మంచి అనుబంధం, కానీ చిన్న వయసులోనే తల్లి మరణించింది. గోళీలాటలో ఛాంపియన్. తమ్ముడు గోల్డీ (విజయానంద్)ను ఉప్పెక్కించుకొని తిరుగుతూ ఉండేవాడు. చాలా సిగ్గరి. ఆడపిల్లలతో మాట్లాడ్డానికి భయపడే వాడు. తన వెంటబడి బలవంతంగా ముద్దు పెట్టుకొన్న అమ్మాయి దగ్గర్నుంచీ పారిపోయాడు. తను దూరంనుంచి ఆరాధించిన అమ్మాయితో మాట్లాడ్డానికీ వెనుకాడాడు. ప్రఖ్యాతి వహించిన లాహోర్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. ఆ రోజుల్లో లాహోర్‌లో చదివినవాళ్ళకు పై చదువులు చదవడానికి, సివిల్ సర్వీసు వంటి పెద్ద ఉద్యోగాలు చేయడానికి అవకాశాలు బాగా ఉండేవిట.

దేవానంద్ కాలేజ్ డిగ్రీ పూర్తి చేసేప్పటికి కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగోలేదు. పై చదువులు చదవడానికి వీల్లేదు. ఏదైనా బాంకు గుమస్తా ఉద్యోగం చూసుకోమని తండ్రి దేవానంద్‌కు చెప్పాడు. అది అతనికి ఇష్టం లేదు. ఇంట్లో చెప్పకుండా, జేబులో ముప్పై రూపాయలతో, పందొమ్మిదేళ్ళ వయసులో, ఫ్రాంటియర్ మెయిల్ ఎక్కి తన భవిష్యత్తును వెతుక్కొంటూ బాంభే బయలు దేరాడు. సినిమాల్లో నటించాలని కోరిక. బొంబాయి చేరాక ఉద్యోగమూ, సినిమాల్లో అవకాశాలూ లేక చాలా ఇబ్బంది పడ్డాడు.  తెలిసినవాళ్ళ ఇళ్ళల్లో ఒక్కొక్కరిదగ్గర కొన్నాళ్ళు ఉంటూ, అప్పుడప్పుడూ అదీ లేక ఇబ్బంది పడుతూ గడిపాడు. కొన్నాళ్లకు అన్న చేతన్‌ఆనంద్ కూడా బొంబాయికి చేరాడు; అదే సమయంలో దేవానంద్‌కు మిలిటరీలో ఉత్తరాలు సెన్సార్ చేసే ఉద్యోగం వచ్చింది. అన్న ఇల్లు సినిమాపట్ల ఉత్సాహం ఉన్న యువకళాకారులకు అడ్డా అయ్యింది. యాక్టింగ్ అవకాశాలు వెతుక్కోవడానికి వీలు కావటంలేదని ఉద్యోగం మానేసిన రోజునే, ప్రభాత్ స్టూడియో నిర్మించిన హమ్ ఏక్ హై  చిత్రంలో పి.ఎల్. సంతోషీ  దర్శకత్వంలో హీరోగా అవకాశం వచ్చింది. ప్రముఖ రచయిత్రి ఇస్మత్ చుగ్తాయ్ కథతో, ఆమ భర్త షహీద్ లతీఫ్‌ దర్శకత్వంలో,  ప్రముఖ నటుడు అశోక్‌కుమార్ బాంబేటాకీస్ బ్యానర్‌పై తాను నిర్మిస్తున్న జిద్దీ చిత్రంలో హీరోగా తీసుకొన్నాడు.

పూనాలో ఉన్న రోజుల్లోనే వేరే చిత్రంలో అసిస్టెంట్ డైరెక్టరుగా పని చేస్తున్న గురుదత్ పరిచయమయ్యాడు. ఇద్దరూ మంచి మిత్రులయ్యారు. తాను నిర్మాత ఐతే గురుదత్‌ను దర్శకుణ్ణి చేస్తానని దేవానంద్, తాను దర్శకుడైతే దేవానంద్ హీరోగా సినిమా తీస్తానని గురుదత్ ఒకరికొకరు చెప్పుకొన్నారు. అన్న చేతనానంద్ నిర్మాత దర్శకుడిగా మారి నీచా నగర్ లాంటి ఆర్ట్ సినిమాలు తీసి చాలా పేరూ, అవార్డులూ, భారీ నష్టాలూ సంపాదించాడు. ఈలోపు దేవానంద్ తనతో చాలా సినిమాల్లో నటిస్తున్న ఆనాటి టాప్ హీరోయిన్ సురయ్యాతో గాఢంగా ప్రేమలో పడ్డాడు. అన్న దర్శకుడిగా, సురయ్యా హీరోయిన్‌గా, తాను హీరోగా ఒక సినిమా తీయాలని నిశ్చయించుకొని నవ్‌కేతన్ బ్యానర్ స్థాపింఛాడు. ఆ తర్వాత, ఇచ్చిన మాట ప్రకారం గురుదత్‌కి దర్శకుడిగా అవకాశం ఇస్తూ బాజీ చిత్రం నిర్మించాడు. ఆ చిత్రంలో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో దేవానంద్‌కి కొత్త ఇమేజ్ ఇచ్చాడు గురుదత్. అప్పట్నుంచీ అమ్మాయిల కలల రాజై రొమాంటిక్ హీరోగా దశబ్దాల పాటు హిందీ తెరను ఏలాడు.  కొన్నాళ్ళ తర్వాత తమ్ముడు విజయ్‌ఆనంద్ నవ్‌కేతన్ సంస్థ చిత్రాలకు దర్శకుడయ్యాక కమర్షియల్ సినిమాల పరిధిలోనే విజయవంతమైన ప్రయోగాలు చేస్తూ ఆ సంస్థకు ప్రాముఖ్యం తెచ్చారు. మొదటనుంచీ నవ్‌కేతన్ చిత్రాలు విభిన్నమైన కథలకూ, కథనానికీ ప్రసిద్ధి. 1965లో దేవానంద్‌ ప్రముఖ రచయిత్రి పెర్ల్ బక్ (గుడ్ ఎర్త్)తో కలసి ఆర్‌కే నారాయణ్ గైడ్ నవలను ఆంగ్లంలోనూ, హిందీలోనూ (ఇద్దరు వేర్వేరు దర్శకులతో, వేర్వేరు ట్రీట్‌మెంట్లతో)  నిర్మించాడు. తర్వాత ప్రేమ్ పూజారి చిత్రంతో దేవానంద్ దర్శకుడిగా మారాడు. అప్పట్నుంచీ దేవానంద్ తనకు నచ్చిన సబ్జెక్టులపై కొత్త తారలతో చిత్రాలు తన దర్శకత్వంలో నిర్మిస్తూనే ఉన్నాదు.  చనిపోయే ముందు రోజుల్లో కూడా ఇంకో చిత్రం నిర్మించే పనిలో ఉన్నాడు.

రెండు ఫిల్మ్ ఫేర్ ఉత్తమ నటుడి అవార్డులు, దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం, అనేక ఇతర సన్మానాలు అందుకొన్నాడు. పద్మవిభూషణ్ ఇస్తామని ముందు చెప్పి, పద్మభూషణ్ ప్రకటించారని, ఆ పతకం స్వీకరించలేదట,

ఈ రొమాంటిక్ హీరో నిజజీవితంలోనూ చాలా రొమాన్సులున్నాయి.  మొదటిరోజుల్లో సిగ్గు, బెరుకుల వల్ల ఎక్కువ దూరం సాగకుండానే ఆగిపోయాయి. పూనే వెళుతున్న డెక్కన్ క్వీన్ రైల్లో ఫస్ట్‌క్లాస్ పెట్టెలో మొదటి సెక్స్ అనుభవం పొందిన దేవానంద్‌కు తర్వాత అఫెయిర్లు చాలానే ఉన్నాయి. సురయ్యాతో ప్రేమ కథ, ఆమె కుటుంబం (నాయనమ్మ) అభ్యంతరాలవల్ల, నాటకీయంగా సాగి చివరకు భగ్న ప్రేమగానే ముగిసింది. ఆ తర్వాత నవ్‌కేతన్ చిత్రంలో హీరోయిన్‌గా అతని జీవితంలో ప్రవేశించిన కల్పనా కార్తిక్ (అసలు పేరు మోనా సింఘా)తో ప్రేమలోబడి వివాహం చేసుకొన్నాడు; ఇద్దరు పిల్లలకు తండ్రయ్యాడు. హరేరామ హరేకృష్ణ సినిమాలో జీనత్ అమన్‌కు పెద్ద బ్రేక్ ఇచ్చిన దేవానంద్ ఆమెకు ప్రపోజ్ చేద్దామని నిర్ణయించుకొనేపాటికి ఆమె రాజ్‌కపూర్ సత్యం శివం సుందరంలో నటించడానికి నిర్ణయించుకొని అతనికి దూరమయ్యిందట.

ఎమర్జెన్సీ రోజుల్లో సంజయ్ గాంధీ, విసి.శుక్లాల తరపున ప్రచారం చేయటానికి నిరాకరించినందుకు దేవానంద్ వేధింపులకు గురయ్యాడు. 1977 ఎలెక్షన్లలో బాహాటంగా జనతాపార్టీకి మద్దతు ప్రకటించి, సినిమావాళ్ళు చాలామందితో ప్రచారం చేయించాడు. జనతా ప్రభుత్వం పడిపోయిన తర్వాత మిగతా సినిమా ప్రముఖులతో కలిసి నేషనల్ పార్టీ పెడదామని ప్రయత్నించాడు కానీ, ఆ ఆలోచన విరమించుకోవలసి వచ్చింది.

దేవానంద్  నిర్మాతగా చాలామంది కొత్త కళాకారులకు అవకాశాలు ఇచ్చాడు. గురుదత్, రాజ్ ఖోస్లా, విజయానంద్ వంటి టెక్నీషియన్లు, శత్రుఘన్ సిన్హా, జాకీ ష్రాఫ్, టీనా మునిమ్, టాబు లాంటి నటులు దేవానంద్ చేత పరిశ్రమకు పరిచయమైన వారే. ప్రముఖ దర్శకుడు శేఖర్ కపూర్ దేవానంద్ మేనల్లుడు (దేవానంద్ నిర్మించిన ఇష్క్, ఇష్క్, ఇష్క్ చిత్రంలో షబానా ఆజ్మితో కలసి నటించాడు).

2007లో దేవానంద్ తన జీవిత కథను Romancing With Life  అన్న పేర ప్రచురించాడు. పుస్తకం పరిమాణంలో పెద్దదే ఐనా, చదవడానికి సాఫీగా ఉంది.  లాహోర్ కాలేజ్‌లో చదువుకున్న దేవానంద్‌కు తన ఇంగ్లీషు పరిజ్ఞానంపై మంచి విశ్వాసం ఉంది. అది మితిమీరిన విశ్వాసం కాదనే అనిపిస్తూంది ఈ పుస్తకం చదివాక.  తన బాల్యపు వర్ణన, తొలి యవ్వనపు మూగ ప్రేమలు, మొదటిరోజుల్లో పడ్డ కష్టాలు,  ఆ తర్వాత రోజుల ప్రేమలూ, ఎఫయిర్లూ, కుటుంబవ్యవహారాలూ, అభిమానులతో అనుబంధాలూ అన్నిటినీ వివరంగా వర్ణిస్తాడు.

పుస్తకం చదువుతుంటే కొన్ని విషయాలు సరదాగా అనిపిస్తాయి. 1930లలో, పంజాబ్‌లో తన బాల్యం వర్ణన; తల్లితో అనుబంధం; తండ్రిపట్ల అనురాగం, హీరో వర్షిప్ (కానీ – ఇల్లు విడిచాక దేవానంద్ చాలా యేళ్ళపాటు తండ్రితో మాట్లాడలేదట); ఇంత పెద్ద రొమాంటిక్ హీరో తనకు నచ్చిన అమ్మాయిలతో మాట్లాడలేకపోవడం; గురుదత్‌తో మొదట పరిచయమైన విధానం (గురుదత్ దేవ్ షర్ట్ కొట్టేసి తన షర్ట్ అతనికి ఇచ్చాడు); దేవానంద్ దిలీప్ కుమార్‌ల స్నేహం (తొలిరోజుల్లో ఇద్దరూ లోకల్ ట్రెయిన్లలో కలసి తిరుగుతూ వేషాలు వెతుక్కునేవారు); రాజ్ కపూర్, దేవ్ ఛార్లీ చాప్లిన్‌ను కలవడం;  తీన్ దేవియా చిత్రానికి దర్శకుడిగా అమర్జీత్ పేరున్నా, స్క్రిప్ట్ రాసి – డైరెక్షన్ తానే చేయడం (హం దోనో దర్శకుడిగా అమర్జీత్ పేరున్నా విజయ్ ఆనంద్ అసలు దర్శకుడని ప్రచారంలో ఉన్న విషయం – ఆ వివరం ఈ పుస్తకంలో లేదు); వివిధ ప్రేమ కథలు; వాజ్‌పేయీతో కలసి లాహోర్ బస్సు యాత్ర, లవ్ ఇన్ టైమ్‌స్క్వేర్ సినిమాకోసం 2001, 2002లలో న్యూయియర్ వేడుకలను చిత్రీకరించడానికి ప్రయత్నించడం వగైరా.

నన్ను కొద్దిగా నిరాశపర్చిన విషయమేమిటంటే తాను ఆఖరు దశలో నిర్మించిన చిత్రాల గురించి చాలా చెప్పిన దేవానంద్, తన క్లాసిక్ చిత్రాల గురించి చాలా తక్కువ విషయాలు చెప్పాడు (నిజానికి ఆ చివరి దశ చిత్రాలేవీ నేను చూడలేదు; ఆ ఫ్లాప్ చిత్రాల గురించి ఎవరూ పెద్దగా మాట్లాడగానూ వినలేదు). ఏ మాటకా మాటే – ఈ పుస్తకం చదివాక.ఈ సినిమాలన్నిటినీ కూడా చాలా సిన్సియర్‌గా, ఆర్తితోనే తీశాఢని అర్థమయ్యింది. తోటి వారందరూ విశ్రాంతజీవనం గడుపుతున్న వయస్సులో ఇంకా ఇంత ఉత్సాహంగా శ్రమపడి సినిమాలు తీయడం, సినిమా పట్ల అతని  అంకితభావానికీ, సఢలని మానసిక యవ్వనానికీ నిదర్శనం.

ఈ పుస్తకం వ్రాసేటప్పటికి దేవానంద్‌కి 83,84 ఏళ్ళ వయసు ఉండి ఉండాలి. ఆ వయసులోనూ యాక్టివ్‌గా జీవించడం పట్ల అతని ఆసక్తి, భవిష్యత్ ప్రణాళికలు, మొక్కవోని ఆత్మవిశ్వాసం ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి.

పుస్తకంతో పాటు ఒక బోనస్ డీవీడీ ఉంది – గైడ్, ప్రేమ్‌పూజారి, జానీ మేరా నామ్ వగైరా పాటలతో. ఆ డీవీడీని పరిచయం చేస్తూ కనిపించిన దేవానంద్ కూల్‌గా లేడు; వెకిలిగా అనిపించాడు.  ఎప్పుడైనా మీరు ఆ డీవీడీ చూడ్డం తటస్థిస్తే ఆ మొదటి సెగ్మెంటు మాత్రం చూడకండి – దేవానంద్ అభిమానులైతే బాధ కలుగుతుంది.

పుస్తకం అట్ట పైన బొమ్మల్లో కనీసం ఒక వైపునైనా బ్లాక్ అండ్ వైట్ రోజుల దేవానంద్ ఫొటో వేసి ఉంటే బాగుండేది. లోపల కొన్ని అరుదైన ఫొటోలున్నాయి. ఒక్కటే అచ్చు తప్పు కనిపించింది.

1923 సెప్టెంబరు 26 న పుట్టిన ధరం దేవ్ ఆనంద్ ఉరఫ్ దేవ్ ఆనంద్ ఉరఫ్ దేవ్ సాబ్ 2011 డిసెంబర్ 3న లండన్‌లో గుండెపోటుతో మరణించాడు. హిందీ చలన చిత్ర చరిత్రలో ఒక రొమాంటిక్ తరానికి తెర పడింది.

తమ్ముడు విజయ్‌ఆనంద్ అంత్యక్రియలు చూస్తూ స్మశానంలో దేవానంద్ ఇలా అనుకొన్నాట్ట: ”This is not the way to go from the world, I determinedly thought to myself.  Not with the world around enjoying the spectacle of your death! I would, when the bell tolled for me, just want to vanish away, like a whiff of air into the breeze that blows, becoming a leaf on a branch that sways, a flicker of the flame of the fire that burns, a drop of water in a stream that flows, a joyful raindrop that bursts out of a cloud, or a particle of shining sand swept into the folds of a playful tide. I would never, never, want to be seen dying or dead.”

నిత్యం చైతన్యంతో జీవించడానికి కడదాకా ప్రయత్నించిన దేవానంద్‌కు అభిమానుల హృదయాలలో మరణం లేదు; నిత్యమూ జీవించే ఉంటాడు.

***********
Romancing with life – an autobiography
(includes a bonus DVD)

Dev Anand
2007
Penguin/ Viking
438 pages, 695 Rs.

You Might Also Like

10 Comments

  1. హెచ్చార్కె

    చౌదరి గారు, వ్యాసం చాల చాల బాగుంది. మీ ఇష్టమంతా ఉంది వాక్యాల్లో. మా ఇష్టం కూడా.
    శీర్షికలో ‘రమించిన’ అనే పదం అనుకుని రాసిందేనా? చదవగానే ఇదేంటబ్బా అని ‘శబ్ద రత్నాకరం’ చూశాను. ‘రమించు’ అంటే సంభోగించు, క్రీడించు అని ఉంది. శ.ర. చూడక ముందు నాకు తోచిన అర్థం కూడా అదే. ‘రొమాన్సింగ్’ అర్థం అంత పరిమితం కాదేమో.

    1. Jampala Chowdary

      జీవితాన్ని ప్రేమించినవాడి కథ అని ముందు వ్రాశాను. ప్రేమించిన అన్న మాట చాల్లేదనిపించింది. మీకొచ్చిన అనుమానమే నాకూ వచ్చింది కాని, జగమంత కుటుంబం నాది పాటలో రమిస్తూ అంటూ సీతారామశాస్త్రిగారు చేసిన ప్రయోగం గుర్తుకు వచ్చి ఆ అర్థంలో సరిపోతుందనిపించింది. ప్రాస కూడా ప్రలోభపెట్టింది.

      రమ ధాతువుకు ఇష్టపడు, ప్రేమించు అన్న అర్థాలు ఉన్నాయని గుర్తు. సూర్యరాయాంధ్ర నిఘంటువు ప్రకారం ఆనందించు అనే అర్థం కూడా ఉంది. శంకరనారాయణ ఇచ్చిన ఇంగ్లీషు అర్థాలు – •1. to be pleased or delighted, to rejoice, take delight in;•2. to play;

    2. హెచ్చార్కె

      Thanks for the reply. Yes, it is the root ‘rama’ that goes to make personal names like Rama and popular words like ramaneeyam, raamaneeyakatha. I don’t know why but I always read the verb ‘raminchu’ to mean what ‘Sabda Ratnaakaram’ says. I was a bit taken aback when I first read the title. The meaning fixed in my mind must be reason. 🙂

  2. surampudi pavan santhosh

    “రొమాన్సింగ్ విత్ లైఫ్” పుస్తకం చదవలేదింకా గానీ ఆ పుస్తకం పేరు అప్పుడెప్పుడో విన్నప్పట్నించీ ఆ పేరంటే పిచ్చి నాకు. నా ఆర్కుట్ ప్రొఫైల్ కి అప్పట్లో ఆ పేరే పెట్టుకున్నాను. ఇప్పటికీ ఆ పేరుతోనే ఉంటుంది.మీ పరిచయం ఆ పుస్తకం మీద కూడా ఆసక్తి కలగజేసింది.

  3. muthevi ravindranath

    This review is too good to resist.Indeed,it’s a fitting tribute to the deceased matinee idol
    and Heart Throb of Millions– Dev Saab!!!

  4. Jampala Chowdary

    వ్రాద్దామనుకొని మరచిపోయిన చిన్న కథ (పుస్తకంలోదే)
    ఒకసారి దేవానంద్ బాత్‌రూమ్‌లో కాలు జారి పడ్డాడట. సాయంకోసం భార్యను పిలుస్తూ “I have fallen!” అని అరిచాడట. ” Over whom, this time?” అని పక్కగదిలోంచి సమాధానం వచ్చిందట.
    🙂

  5. murali

    బాగా రాశారు .

  6. Shyam

    దేవ్ సాబ్ 2012 ఫిబ్రవరి 3 న లండన్‌లో గుండెపోటుతో మరణించాడు.

    కాదు.సరిచేయండి.
    శ్యామ్

    1. పుస్తకం.నెట్

      థాంక్స్. సవరించాం.

    2. Nagini

      వృద్ధాప్యం శరీరానికే గాని మనసుకు కాదు అనే విషయానికి తన జీవితాన్ని ఉదాహరణ గా మలిచిన వ్యక్తి శ్రీ దేవానంద్…చాలా మంచి రివ్యూ రాసారు..Thank you..:-)

Leave a Reply to Shyam Cancel