‘తన్హాయి’ నవల పై చర్చా సమీక్ష

డిట్రాయిట్ తెలుగు లిటరరీ క్లబ్
జనవరి 29, 2012, ఫార్మింగ్టన్ హిల్స్ గ్రంధాలయం, ఫార్మింగ్టన్ హిల్స్, మిషిగన్

‘తన్హాయి’ నవల పై చర్చా సమీక్ష
రచయిత్రి: కల్పన రెంటాల (సారంగ పబ్లికేషన్స్ ప్రచురణ, 2011)
పాల్గొన్నవారు: ఆరి సీతారామయ్య, కాజ రమేష్, మండవ ప్రసాద్, కొత్త ఝాన్సీలక్ష్మి, మద్దిపాటి కృష్ణారావు
ఇంటర్నెట్ ద్వారా పాల్గొన్నవారు: గోపరాజు లక్ష్మి, అడుసుమిల్లి శివ, బూదరాజు కృష్ణమోహన్, రెంటాల కల్పన (రచయిత్రి, కేవలం శ్రోతగానే!)
సమీక్షకుడు: మద్దిపాటి కృష్ణారావు

‘ప్రేమలేని వివాహం, వివాహంలేని ప్రేమ – వీటిలో మొదటిది వ్యక్తిని బాధిస్తుంది. రెండవది సంఘాన్ని బాధిస్తుంది.’
– బుచ్చిబాబు (చివరకు మిగిలేది, 1946)

తెలుగు నవలా సాహిత్యం ఒకప్పుడొక వెలుగు వెలిగినా, ప్రస్తుతం చాలా మందకొడిగా సాగుతోందన్నది అందరూ అనుకుంటున్న మాటే. ప్రతి సంవత్సరం చదవదగ్గ కొత్త నవలలకోసం అన్వేషించడం, నలుగురూ మెచ్చిన నవల దొరక్క మళ్ళీ పాతకాలంలో పేరెన్నికగన్న నవలలవైపే మొగ్గు చూపడం మాకు పరిపాటైపోయింది. అలాంటి స్థితిలో కల్పన వ్రాసిన ఈ నవలను ఒకరిద్దరు ప్రతిపాదించడంతో, చివరి నిమిషంలో ఎన్నుకున్నాం. ఏటేటా వచ్చే కథా సంకలనాలను మినహాయిస్తే, ప్రచురణ జరిగిన తర్వాత అతి తక్కువ వ్యవధిలో మాచర్చకు వచ్చిన పుస్తకం ఇదే!

ఈ నవల కథాకాలం ప్రస్తుతం, ప్రదేశం అమెరికా, వ్యక్తులు తెలుగువారు. సజావుగా సంసారాలు సాగిస్తున్న రెండు కుటుంబాలు. ఒక కుటుంబంలోని స్త్రీ, రెండవ కుటుంబంలోని పురుషుడు యాదృచ్చికంగా కలవడంతో మొదలైన పరిచయం ప్రేమగా పరిణమించడంతో వచ్చిన మానసిక సంఘర్షణ, తద్వారా కుటుంబాల్లో మొదలైన వ్యాకులత ఈ నవలకు ప్రధాన వస్తువులు. పెళ్ళి అనే సామాజిక బంధం స్త్రీపురుషులను జీవితాంతం కలిసి ఉండాలని శాసిస్తుంది. దీనికోసం వ్యక్తుల స్వేచ్ఛలను, ఇష్టాయిష్టాలను, ఆవేశకావేషాలను కొంతవరకైనా నియంత్రించుకుని బ్రతకమని ఆదేశిస్తుంది. వ్యక్తి స్వేచ్ఛకంటే సామాజిక నిబంధనల పాటింపే ముఖ్యమని భావించే సంస్కృతిలో (ముఖ్యంగా భారతీయ సంస్కృతిలో, భారతీయులు ప్రపంచంలో ఎక్కడ ఉన్నాసరే), ఈ ఆదేశాల అమలు అతి సహజమన్నట్టుగా జరిగిపోతుంది. వ్యక్తి స్వేచ్ఛాస్పృహతో అతకని సంబంధాలనుంచి విముక్తి కోరుకున్న వ్యక్తులు కూడా ప్రతీ సమాజంలోనూ, ఎల్లప్పుడూ ఉంటూనే ఉన్నారు. వ్యక్తి స్వేచ్ఛకు అధిక ప్రాధాన్యతనిచ్చే అమెరికా సమాజంలో బలవంతంగా బాంధవ్యాలు నిలుపుకోవలసిన సామాజిక అవసరం తక్కువ. అయితే అభిప్రాయభేదాలవల్లో, అభిరుచుల విలక్షణతలవల్లో, ఆర్ధిక స్థితిగతులవల్లో, శారీరక అసంగతలవల్లో, ప్రేమరాహిత్యంవల్లో వివాహబంధంలో అగాధం ఏర్పడి విడిపోవడం, వేరే జీవిత భాగస్వాములకోసం పరితపించడం కాస్త తేలిగ్గా అర్ధంచేసుకోగలం. ఇందులో మంచీ-చెడు, ఔచిత్యం-అనౌచిత్యం, తప్పు-ఒప్పు వంటి ద్వంద్వాలతో బేరీజు వేసి ఏదో ఒక కొమ్ము కాసేయడం సులభం. కానీ సజావుగా సాగుతోందనిపిస్తున్న వైవాహికజీవితంలో కి ‘మనసున మనసైన’ వేరే వ్యక్తి తారసపడితే ఆ దివ్యానుభూతిలో కొట్టుకుపోయే ఆత్మలను అర్ధంచేసుకోవడం, అంతటి అనుభవాన్ని చవిచూసినవారికేగానీ వేరెవరికీ అంత సులభం కాదు. ఈ ‘ప్రేమ’, వివాహాది సామాజిక బంధాలకు అతీతం. ఆర్ధిక, సాంఘిక అసమానతలు, కులాలు, మతాలు, సామాజిక కట్టుబాట్లు, సాధ్యాసాధ్యాలు, ఔచిత్యానౌచిత్యాలు వంటివేవీ ఈ ప్రేమానుభూతిని నియంత్రించలేవు. ఈ నవలలో కల్హర, కౌశిక్ మధ్య కలిగింది అదే ప్రేమ. వ్యక్తులకు తమ వైవాహిక జీవితాల్లోని అసంపూర్ణతలను భర్తీ చేసుకోవడం కోసం వెతుక్కున్న ప్రేమ కాదిది. నిజానికి ఆ ఇద్దరి వైవాహిక జీవితాల్లోనూ ప్రత్యేకంగా ఎన్నదగిన సమస్యలూ లేవు, ప్రేమరాహిత్యమనే స్పృహ లేదు. ఆమాటకొస్తే ఇద్దరూ పరస్పర ప్రేమానుభూతిని గుర్తించిన తర్వాత కూడా తమ వివాహబంధాల్లో నిరసించదగ్గ లోపాలేవీ చెప్పలేరు. ఐనా తమ మధ్య కలిగిన ప్రేమకు దాసోహం కాకుండా ఉండలేరు. ఈ స్థితిని ఒడిసి పట్టుకుని పాఠకులను తన వాక్యాలతో స్పందింపజేయగలగడం రచయిత్రి ప్రతిభకు నిదర్శనం. ప్రేమను ఇంత పరిపూర్ణంగా దర్శింపజేసిన నవల తెలుగులో ఇంకొకటి లేదేమో!

వివాహేతర ప్రేమ ఏ సమాజంలోనైనా, ఎక్కడైనా, ఎప్పుడైనా కలగొచ్చు. కానీ అమెరికా సమాజ నేపధ్యంలో వ్రాసిన ఈ నవల ప్రవాస జీవితాల్లోని కొన్ని ప్రత్యేకతలతో ముడిపడి ఉంది. అందువల్ల ఇది అసలు సిసలైన ప్రవాస తెలుగు నవల. వ్యక్తి స్వాతంత్ర్యానికి ప్రాధాన్యత ఇచ్చే సమాజంలో తమ అభిప్రాయాల్ని బహిర్గతం చెయ్యగలిగే అవకాశం ఎక్కువ. ఇదే కల్హర, కౌశిక్ ఏ హైదరాబాద్ లోనో, విశాఖపట్టణం లోనో ఉండి ఉంటే ఇది అంత తేలికగా జరిగే పనికాదు. అసలు జరిగే అవకాశం లేదని కాదు, జరిగిందని వ్రాసినా అది అసంగతమనుకునే అవకాశమే ఎక్కువ. అలాంటిదే కల్హర తన ప్రేమ గురించి చెప్పినప్పుడు, చైతన్య స్పందన కూడా. భారతదేశంలోని సగటు భర్తల్లాగా భార్యను కొట్టడమో, పుట్టింటికి పంపడమనే ప్రయత్నమో చెయ్యడు. అమెరికాలో ఆర్ధిక స్వాతంత్ర్యం కలిగిన స్త్రీ ముందు అలాంటి ప్రయత్నాల పర్యవసానం ఏమిటో అతనికి తెలుసు. ఒక ప్రక్క అతని అహంకారం రెచ్చగొడుతున్నా తెగేదాకా తాడును లాగే సాహసం చెయ్యలేడు. సమాధాన పడడానికి ప్రయత్నిస్తాడు. అది కూడా సమాజానికి భయపడే కానీ, కల్హర ప్రేమ స్థితిని అర్ధం చేసుకోగలిగి కాదు. ఇక్కడ ఇతని సమాజం మొత్తం అమెరికా సమాజం కాదు, అమెరికా సమాజంలో మడిగట్టుక్కూర్చున్న తెలుగు సమాజం. అందుకే కుటుంబాన్ని భారతదేశానికి (అందునా ఆంధ్రప్రదేశ్ కు) తరలించే ప్రతిపాదన చేస్తాడు. నవలలో ఇలాంటి సన్నివేశాలు చాలా ఉన్నాయి. అవన్నీ రచయిత్రి సూక్ష్మదృష్టికి నిదర్శనాలే. కొన్ని సందర్భాల్లోనైతే కల్హర మానసిక పరిస్థితికి సంబంధించిన వర్ణనలు అమోఘం! ఇంత మంచి నవల తెలుగులో వచ్చి చాలా కాలమైందని అందరి అభిప్రాయం. అంతేకాదు, ఇలాంటి నవల తెలుగులో ఇంతకు ముందు ఎప్పుడూ రాలేదని కూడా. ఐతే, కేవలం మంచి నవలగా కాక, ఒక మహత్తరమైన నవలగా నిలిచిపోయే అవకాశం కోల్పోయినందుకు బాధకూడా కలిగింది.

కల్హర, కౌశిక్ ల ప్రేమ సమాజం హర్షించలేనిది. కానీ ఆ ప్రేమ సత్యం. పెళ్ళికో, వేరే ఏ సామాజిక నిబంధనలకో కట్టుబడేది కాదు. అలాంటి ప్రేమను అంత హృద్యంగానూ వర్ణించిన రచయిత్రి, ఆ ఇద్దరి మధ్య లైంగిక సంబంధం లేదని చూపడానికి చేసిన ప్రయత్నం అర్ధవంతంగా కనిపించదు. లైంగిక బంధాలు ఉన్నా లేకపోయినా కల్హర, కౌశిక్ లకున్న అనుబంధానికి కలిగే లోటుగానీ, ప్రత్యేకతగానీ లేవు. లేదని చూపడానికి రచయిత్రి చేసిన వ్యర్ధ ప్రయత్నంతో, ‘ప్రేమ’ పై రచయిత్రి దృక్పధాన్నే అనవసరంగా శంకించవలసిన పరిస్థితి ఏర్పడింది. ‘తమ ఆనందం కోసం అందర్నీ బాధ పెట్టాలా?’ అనే ఆలోచనతో కల్హర, కౌశిక్ ‘స్నేహితులుగా’ ఉండి పోవడానికి నిర్ణయించుకుంటారు చివరికి. ఈ నిర్ణయంతో అసలు వారిద్దరి మధ్య ఉన్న అనుబంధమేమిటోనన్న అయోమయ స్థితి ఏర్పడుతుంది. ఇద్దరి మధ్య లైంగిక సంబంధం ఎలాగూ లేదు. అంత వరకూ ‘స్నేహితులు’ గా కాకుండా ‘ప్రేమికులు’ గా ఉన్నారంటే, భావావేశాల కలయికతోపాటు శారీరకాకర్షణ కలిగి ఉండడం వారి ‘ప్రేమ’ అనుకుందాం. ఇవి పూర్తిగా మనసుకు సంబంధించినవి. నిజానికి ఇవి పరస్పరానుగతమై ఉండనక్కర్లేదు కూడా. ఏక పక్షంగా కూడా కలగవచ్చు, నిలబెట్టుకోవచ్చు. కానీ ఆ ప్రేమను ఒకరికొకరు తెలియజేసుకోవడం వల్లనే వారి అనుభూతి పరిపూర్ణమైంది. అది ఒక మహోన్నతమైన మానసిక స్థితి. ఆ స్థితి చేరుకోవడం అందరికీ సాధ్యంకాదు. అది అనుభవంలోకి రానివారు ‘నాకిది అర్ధం కాదులే’ అని సరిపెట్టుకోవడం తేలికేగానీ, ఆ స్థితికి చేరిన తర్వాత ‘నాకిది తెలియదు’ అనుకోగలగడం అసంభవం. బలవంతంగా ప్రేమ భావనలను మరుగున పడేసే ప్రయత్నాలైతే చెయ్యగలరేమోగానీ, ‘ప్రేమికుల స్థితి’ నుండి ‘స్నేహితుల స్థితి’ కి మారలేరు. అది కాలాన్ని వెనక్కి తిప్పడం లాంటిది. తామిద్దరూ తమ ప్రేమ భావనల్ని మనసులోనే పదిలపరచుకొని, పిల్లలకోసం, తమ వైవాహిక జీవితపు సహచరుల కోసం సంసారాలు కొనసాగించాలనుకోవడం వారి ఇష్టం. కానీ ఆ నిర్ణయాన్ని అమలు పరచుకోవడానికి ‘స్నేహితులు’ గా మారాలనుకోవడమే అసంబద్ధం. ఇక్కడ రచయిత్రి కుటుంబాన్ని ‘నిలబెట్టే’ ఒక సామాజిక బాధ్యతను అనవసరంగా తలకెత్తుకున్నట్టనిపిస్తుంది.

తమ వైవాహిక జీవితపు సహచరుల్ని, పిల్లలను బాధించకూడదనే ఉద్దేశంతోనే వారి ‘ప్రేమ’ ను అంతరంగంలో దాచుకోవడం పరిష్కారమనుకుంటే, వారి ప్రేమ గురించి కల్హర చైతన్యకు, కౌశిక్ మృదులకు వివరించి చెప్పినందువల్ల ఒరిగిందేమిటి? పెరిగిన ఘర్షణ తప్ప. అంతవరకూ తమ ‘ప్రేమ’ ను ఎలాగూ దాచారు. ఉన్నదున్నట్టుగా నిజాలు చెప్పేసి, ఇక నుంచి జీవితాలు సాధారణంగా గడిపేద్దామనుకోవడం మంచి ఉద్దేశమేగానీ, అది ఆచరణలో సాధ్యమూ కాదు, వారిద్దరూ ఆపని మనస్పూర్తిగా చెయ్యనూ లేదు. మోనిక ఇంట్లో ఇద్దరూ కలుసుకున్న సంగతి కల్హర చైతన్యకు గానీ, కౌశిక్ మృదులకు గానీ చెప్పలేదు. ఈ సగం ప్రయత్నాలతో కథ అనవసరంగా కృతకమయ్యింది.

ఈ నవలలోని భాష కొనియాడదగింది. అక్కడక్కడా రచయిత్రి భావావేశంలో కొట్టుకుపోతూ వ్రాసిన వాక్యాలు అర్ధం చేసుకోవడానికి కాస్త శ్రమించవలసి వచ్చినా (ఉదాహరణకు 185 పేజీలోని ‘ఈ ప్రేమను నేను పొందలేకపోవడమంటే …’) చక్కని వచనం వ్రాశారు. ప్రవాసంలో నివసిస్తున్న తెలుగు పాత్రల చుట్టూ తిరిగిన కథ కాబట్టి సంభాషణల్లో ఇంగ్లీషు పదాల వాడుకను సమర్ధించుకోవచ్చుగానీ, మిగతా వచనంలో ప్రయత్నించి తెలుగు పదాలు వాడి ఉంటే భాషకు కాస్తో కూస్తో మేలు చేసినవారయ్యుండేవారు. తెలుగు రాని పాత్రల సంభాషణలను తెలుగులో వ్రాయడంలో ఉన్న ఇబ్బందిని రచయిత్రి కొంత వరకూ అధిగమించినా సఫలీకృతులని మాత్రం అనలేం. ఉదాహరణకు, 116 పేజీలో మోనిక వాక్యం, ‘దీన్ని గురించి నువ్వు మాట్లాడాలనుకుంటున్నావా?’ అన్న వాక్యం ‘would you like to talk about it?’ కు ప్రత్యక్షానువాదంలా లేదు? తెలుగు రాని పాత్రల సంభాషణలు తెలుగులో వ్రాసేటప్పుడు ఏది మంచి పద్ధతో అనువాదకులు నిర్ణయించుకోవాల్సిందే గానీ, భాష కృతకంగా ఉండకూడదని మా అభిప్రాయం.

ఇక శైలి విషయానికొస్తే, ఎక్కువ భాగం సినిమా స్క్రీన్ ప్లే లాగా నడిచిందీ నవల. అంతరాత్మతో సంభాషణలు, ఏకకాలంలో జరుగుతున్న సంఘటనలను split-screen పద్ధతిలో వ్రాయడం వంటి శైలి కథాగమనాన్ని అనవసరంగా పట్టు తప్పించింది. సన్నివేశాల్లోని తీవ్రతను చిత్రించడానికి రచయిత్రి చేసిన ప్రయత్నంగా అర్ధం చేసుకోవచ్చునేమోగానీ, అది రచయిత్రి సృజనాత్మక శక్తికి తగిన ప్రయత్నం కాదని మా అభిప్రాయం. అలాగే నవలలో (ముఖ్యంగా రెండవ భాగంలో) ఉపన్యాస ధోరణి ఎక్కువగా కనిపిస్తుంది. కొన్ని చోట్లైతే రచయిత్రే ఈ ధోరణిని గుర్తించి పాత్ర ఊపిరి కోసం ఆగినట్లు వ్రాశారు కూడా! ఇంతకంటే వ్రాయలేనంటే ఏమీ చెప్పలేం గానీ, నవల చదివిన తర్వాత సృజనాత్మకత కొరవడిన రచయిత్రి అని మాత్రం అనుకోలేం.

ఈ సమీక్షంతా చదివి ‘అంతగా చదవాల్సిన నవల కాదని’పిస్తే క్షంతవ్యులం. కేవలం పొగడ్తలకే పరిమితమయ్యే టట్టైతే ఇంతగా చర్చించనవసరంలేదు. ఇది అందరూ చదవాల్సిన మంచి నవల. తెలుగులో వచ్చిన గొప్ప నవలల జాబితాలో చేరే అవకాశం తృటిలో చేజారి పోయిందనే మా బాధంతా! రచయిత్రి మా అభిప్రాయాలతో ఏకీభవించాలని లేదుగానీ, లోపాలు జరిగాయనిపించి రెండవ కూర్పు ప్రచురించబూనుకుంటే, ఆనందించే పాఠకుల్లో ముందు మేమే!

నవలలో ప్రస్ఫుటంగా కనిపించిన కొన్ని (మాత్రమే) తప్పులు (అచ్చు తప్పులు కొన్ని, అలవాటులో పొరపాట్లు కొన్ని, అవగాహనా లోపాలు కొన్ని):

కౌశిక్, మృదుల వరుసకు బావామరదళ్ళు. కానీ వారు హైదరాబాదులో స్థిరపడిన గుజరాతీయులు. తెలుగు, కన్నడ ప్రాంతీయులు తప్ప మిగిలిన వారిలో, ముఖ్యంగా ఉత్తర భారతదేశీయులకు మేనరికపు పెళ్ళిళ్ళుండవు!
పుట 5: సూటిగా వేసిన ప్రశ్నను ‘క్రాస్ వర్డ్ పజిల్’ అనడం అసంబద్ధం.
పుట 11: ‘సాన్నిత్యంలో’ కాదు ‘సాన్నిధ్యంలో’
పుట 14: ‘ఏడుపు చెప్పటానికి ఒక మెలొడీ సాంగ్ కావాలి’. ‘మెలొడి’ అంటే అర్ధం విషాదం కాదు.
పుట 113: పూలు ‘విరగకాయవు’, ‘విరగబూస్తాయి’. Canopy బదులు పందిరి అని వ్రాస్తే బావుండేది (ఇలాంటివి నవల నిండా చాలా ఉన్నాయి).
పుట 137: కౌశిక్ ను తన శరీరంలో ఒక అంతర్భాగంలా ఉంచేసుకోవాలనే కోరికకు ‘tampon’ ఉపమానం చాలా ఎబ్బెట్టుగానూ, అసంబద్ధంగానూ ఉంది. వాడుక వస్తుపరంగా సరికావచుచుగానీ, విసర్జించదగ్గ వస్తువు కాబట్టి ఆహ్లాదకరమైన భావనను కలిగించదు.
పుట 144: కౌశిక్ కలలో పెదవి కొరుక్కుని, రక్తం కారుతున్నట్టుగా వర్ణించడం, సన్నివేశానికి పొసగలేదు. కలవాట్లకు మెలకువ వచ్చి లేపి, భర్త మొహం చూసి పగలబడి నవ్విన భార్య, పెదాలపై రక్తస్రావాన్ని గుర్తించదా?
పుట 155: ‘వాకింగ్ క్లోజట్’ కాదు ‘వాకిన్ క్లోజట్’.
పుట 237: ఎయిర్ బాగ్ డిప్లోయవుతుంది (విచ్చుకుంటుంది) ‘ఎక్స్ప్లోడ్’ అవదు. అదీగాక, విచ్చుకున్న ఎయిర్ బాగ్ తలను స్టీరింగ్ వీల్ కు తగలకుండా ఆపుతుంది, ఏదైనా లోపం ఉంటే తప్ప. ఈ ప్రమాదం వర్ణన సజావుగా లేదు.

*******************
ఈ పుస్తకం ఆన్లైన్ కొనుగోలు లంకె ఇక్కడ.

You Might Also Like

13 Comments

  1. Kranthi Kumar

    I red the above review of the book…..I hve to read this book as early as possible.so can anyone help me to how can I get this book…plz respond anyone

  2. P.saikumar

    I want this book
    iam interested ..
    but I don’t know .. buying .. this book online please help me ..anyone

  3. ari sitaramayya

    ఈ రోజే విన్నాను, తన్హాయి మీద తెలుగులో సినిమా తీస్తారట అని. అయ్యో పాపం అనిపించింది. కల్పన గారికి సంతాపం తెలియజెయ్యాలి అనిపించింది.

  4. Ramesh

    పుట 137: కౌశిక్ ను తన శరీరంలో ఒక అంతర్భాగంలా ఉంచేసుకోవాలనే కోరికకు ‘tampon’ ఉపమానం చాలా ఎబ్బెట్టుగానూ, అసంబద్ధంగానూ ఉంది. వాడుక వస్తుపరంగా సరికావచుచుగానీ, విసర్జించదగ్గ వస్తువు కాబట్టి ఆహ్లాదకరమైన భావనను కలిగించదు.

    This more than enough to tell the quality of her writing, with this kind of analogies how can any one say that this has stuff to place the novel in the topers list.

  5. Purnima

    నేను ప్రస్తావించే విషయం చాలా మందికి నచ్చకపోవచ్చుగానీ, aren’t we ready for bi-lingual works yet? మన రోజూవారీ జీవితంలోనే రెండు భాషలూ తప్పనిసరైపోయినప్పుడు, మన సాహిత్యంలో అది ప్రతిబింబించకుండా ఎలా ఉంటుంది? ఆంగ్లాన్ని తెలుగు లిపిలో రాసో ( వాట్? కమ్ అగైన్! – ఇలా) లేక దానికి సరిపడా తెలుగు పదమో వాడే బదులు, ఇంగ్లీషునే ఎందుకు రాయకూడదు, ముఖ్యంగా ఇలాంటి కథాంశాల్లో? అమెరికాలొ జరుగుతున్న కథ కాబట్టి ఆంగ్లం రాయడం తప్పనిసరి కదా – ఆ ముక్క రచయిత సమర్థించుకోగలిగినా లేకున్నా?!

    నేను చదివిన కొన్ని ఇంగ్లీషు నవలల్లో ఫ్రెంచ్‍ / విదేశీ భాషలను యధేచ్చగా (సందర్భోచితం కూడాలే) వాడారు. కథనమంతా తెలుగులోను, డైలాగులు అవసరమైనప్పుడు ఇంగ్లీషులోనే ఉంటే బాగుంటుంది కదా! ఇలా రాయడానికున్న అభ్యంతరాలేంటి?

    1. లలిత (తెలుగు4కిడ్స్)

      పూర్ణిమా, ఈ నవలలో ఆంగ్లం వాడడం సంగతి ఎలా ఉన్నా, ఇంగ్లీషు నవలల్లో తెలుగు వాడితే నేనూ సమర్థిస్తా, కాలరెగరేస్తా 🙂

    2. Purnima

      Why not, Lalitha? Imagine a English story on Telugus. What’s wrong with using Telugu in it for dialogues in it and give footnotes for readers. The idea doesn’t seem strange or weird to me, at least. But I don’t know if it works with us.

      But if you mean a proper English novel / story written by a foreigner using Telugu, then it’s a long way! 🙂

      I’m waiting for somebody to correct me on this and shred some light on why it won’t work, if it won’t.

      Let us see.

    3. లలిత (తెలుగు4కిడ్స్)

      “But if you mean a proper English novel / story written by a foreigner using Telugu, then it’s a long way! 🙂 ” నేను అన్నది (అనుకున్నది) అదే 🙂 I would love to see English writers develop a fancy for Telugu the way they have for Italian or French. For it is a language worth loving like any 🙂

    4. Crazyfinger

      It makes a lot of sense, to use English language to write English words in a Telugu novel, instead of writing those words in Telugu script. Not only English words written in Telugu script are awkward (and downright incorrect to read sometimes) to read, they give off a false sense of uppity up or even a false sense of immaturity, where none is intended. So, yes, what Purnima said makes total sense.

      CF

  6. Purnima

    ఈ నవలపై నాకు ఆసక్తి లేకపోయినా, ఈ సమీక్షా వ్యాసాన్ని చదివాను. చాలా balancedగా విశ్లేషించారని నాకనిపించింది. నవలలో ప్లస్ పాయింట్లేమిటో, అంతగా బాగారాని అంశాలను సునిశితంగా చెప్పారనిపించింది. (నేను ఇక్కడ బొల్లోజు బాబాగారితో విభేదిస్తున్నాను అని అనుకోవచ్చు.)

    కానీ, ఆయన ఉటకించిన వాక్యమే నాకూ అర్థం కాలేదు. ఆ ఒక్క వాక్యమూ నన్ను వ్యాసాన్ని మరో కోణం నుండి చూసేలా చేస్తున్నాయి.

    “తెలుగులో వచ్చిన గొప్ప నవలల జాబితాలో చేరే అవకాశం తృటిలో చేజారి పోయిందనే మా బాధంతా! ”

    తెలుగులో వచ్చిన గొప్ప నవలల జాబితా ఒకటుందా? ఉంటే, ఏమిటది? తృటిలో తప్పిపోయిందన్నారు. ఆ ’తృటి’ని వివరించగలరా? ఈ వ్యాసంలో నాకైతే చాలా లోపాలు చూపినట్టు అనిపించింది.

    ఈ సమీక్షా ప్రయత్నంలో నాకు అర్థం కాని విషయం మరొకటి ఏంటంటే, రచయితను దృష్టిలో పెట్టుకొనే కామెంట్స్ చెప్పినట్టుంది. ఆవిడ కూడా సభకు వచ్చున్నా కూడా, ఆవిడదెటూ ప్రేక్షక పాత్రే కాబట్టి, రచనకు పాఠకునికి / సమీక్షకుని మధ్య రచయిత అన్యమనస్కకంగానే రాకుండా ఉంటే బాగుండేది. There should be certain anonymity of the writer while reading a book, otherwise it goes in a different dimension.

    1. Krishna Rao Maddipati

      మనకు బాగా నచి్చనవి ‘మహత్తరమైన’ నవలలు!

      Seriously, తీసుకున్న వసు్తవును క్షుణ్ణంగా పరిశీలించి ప్రయత్నలోపం కనిపించకుండా వా్రసిన నవల ఏదైనా ఆ సా్థయికి చేరుకునే అవకాశం ఉంది. నా అభిపా్రయంలో ‘చివరకు మిగిలేది’, ‘అంటరాని వసంతం’, ‘అతడు-ఆమె’ వంటివి (ఇవి మాత్రమే కాదని మనవి) ఈ కోవకు చెందుతాయి. గొప్ప వసు్తవు, కథ ఈ నవలలో మాకు కనిపించాయి కానీ అమలు పరచడంలో రచయితి్ర ప్రయత్నలోపమే ఆ ‘తృటి’.

      బాగున్నవి, బాగా లేనివీ రచయితి్ర వింటునా్నరని చెప్పడానికి ఎవరూ జంకలేదు. కాబటి్ట రచయితి్రని దృషి్టలో పెటు్టకుని వా్రసినట్లనిపిసే్త అది కేవలం ఎక్కడ లోపం జరిగిందో వివరించే ప్రయత్నం మాత్రమే.

      ఇంతకు మించి ఏం వా్రసినా చెపి్పందే చెపి్పనట్లవుతుందేమో!

      కృషా్ణరావు

  7. బొల్లోజు బాబా

    ఈ చర్చా వేదిక అనే ప్రక్రియ పట్ల నాకు అవగాహన లేదు.
    ఈ నవలగురించి వచ్చిన చాలా వ్యాసాలు నేను చదివాను.
    కానీ ఈ వ్యాసం లోని టోన్ ఎందుకో అంత బాగునట్టు అనిపించలేదు
    పనిగట్టుకొని నవలను క్రిందకు లాగటానికి ప్రిజుడైజ్డ్ గా రాసినట్లనిపిస్తోంది

    తెలుగులో వచ్చిన గొప్ప నవలల జాబితాలో చేరే అవకాశం తృటిలో చేజారి పోయిందనే మా బాధంతా!

    అంతటి స్వీపింగ్ స్టేట్మెంట్ ఇవ్వటానికి ఈ నవల ఆయుషు ఎంత, సమీక్షించేవారి అర్హత ఏమిటి అని ఆలోచించక తప్పటం లేదు.
    పై వాక్యం వద్దే నా ఆలోచన ఆగిపోయి మొత్తం వ్యాసాన్ని మరో కోణంలో అర్ధంచేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది
    భవదీయుడు
    బొల్లోజు బాబా

    1. Krishna Rao Maddipati

      ఈ చరా్చ వేదికను గురించి చెప్పడం చాలా తేలిక.
      ఏ ఒక్కరైనా ఒక పుస్తకం చదివినపు్పడు, చదువరి అనుభవాని్న బటి్ట, అవగాహనను బటి్ట ఒక అనుభూతి కలుగుతుంది. నలుగురు చదివి తమ అనుభూతులను ఇతరులతో పంచుకోవడం వల్ల ఆ పుస్తకంపై మొదట కలిగిన అనభూతి విస్తృతమౌతుంది. మనకు నచి్చన విషయాలు ఇంకా ధృఢ పడవచు్చ లేదా చర్చలో వీగి పోవచు్చ. పటు్టదలలతో కాకుండా విశాల దృక్పధంతో చర్చలో పాలొ్గంటే మనకు అవగాహనలోకి రాని విషయాలు తెలుకుని పుస్తకాని్న అర్ధం చేసుకునే అవకాశం కూడా ఉంది. ఆప్రయత్నమే ఈ చరా్చ వేదిక.
      ఇహ చర్చలో పాలొ్గన్న వారి అర్హతలు, వారికున్న prejudicies గురించిన వా్యఖ్యలు అప్రసు్తతం. పుస్తకం పై వివరించిన అభిపా్రయాలు ఆధారపూరితమైనవా? కాదా? అన్నది ఒక్కటే చర్చనీయం!

      కృషా్ణరావు

Leave a Reply