సరసి కార్టూన్లు -౩

రాసిన వారు: బి.మైత్రేయి
****************

“మీరిట్టా వేరే వాళ్ళ ఇళ్ళలోకి ఊగటం ఏమన్నా బాగుందా మాష్టారూ” అంటూ పక్కింట్లో నుండి తనింట్లో కి ఉయ్యాల http://pustakam.net/wp-admin/post.php?post=10670&action=edit&message=1ఊగుతున్న పొరిగింటాయనతో వాపోతున్న అమాయకవు మద్యతరగతి జీవి, ఇరుకు అపార్ట్మెంట్ బతుకుల్లో గడుసు పొరుగు వారితో సగటు మనిషి పడే అగచాట్లను మన ముందు ఆవిష్కరిస్తాడు. “ఇదంతా మన మీదేనర్రోయ్” అనిపించేట్లు సాగుతుంది సరసి గారి కొత్త కార్టూన్ల పుస్తకం.

నవ్వు నాలుగు విధాల చేటని కొందరు నవ్వని వాడు రోగని కొందరూ అంటుంటే మనం కవ్ఫూజ్ అవుతుంటాం ఎవరు రైటా అని. ఎవడి మీదనా జోకు వేస్తే చేటు మనపై మనం జోకు వేసుకొంటే అది సేఫ్. అసలు మన లోపాల్ని మనం సరదాగా ఒప్పుకోవటం మన హృదయ వైశాల్యాన్ని పెంచుతుంది. అచ్చ తెలుగు బతుకుల్లోని బాధల్ని ఈ కార్టూన్లలో చూసుకొని హాయిగా నవ్వేసుకుంటూ పెద్ద పద్ద వేదాంతాల్ని ఒంట బట్టించుకొంటాం. కష్టసుఖాల్ని సమానంగా తీసుకోవాలోయ్ అని గీతాచార్యుడు సీరియస్ గా చెప్పిన విషయాన్ని తియ్యటి హోమియో పిల్స్ లో కలిపి చెప్పటమే సరిసి గారి ప్రత్యేకత.

ఖర్మకాలి లేడీస్ బస్సు వెనకాల స్కూటర్ నడిపినా అనుమానించే ఫెమినిస్ట్ లు, ఎవర్ని టివీ లో చూసినా నా మొగుడు టీవీలో కన్పిస్తున్నాడేమో అని భయపడే లంచావతారుల భార్యలు, ఏసీబీ వాళ్ళకు దొరక్కపోయినా పెళ్ళాం మాటలతో రోజూ చచ్చే లంచాల రాయిళ్ళూ, “తల్లి దీవెన” అంటూ ఆటో పై రాసుకొని తల్లిని వృద్ధాశ్రమంలోకి తోస్తున్న ఆటో ఓనర్లు, వాళ్ళూ వీళ్ళూ అని తేడా లేకుండా తొమ్మిది కోట్ల తెలుగువారూ ఈ పుస్తకంలో కలైడో స్కోపులో చూసినట్లు కన్పిస్తారు. ఇక భార్యా భర్తల సరసాలు, పెళ్ళి తంతులో జరిగే వింతలూ చెప్పటంలో సరసిగారు మొదటి నుండీ సిద్ధ హస్తులు. అపార్ట్మెంట్ల జీవితాల్లో పేరంటాలు, వనభోజనాలు కొత్తరకంగా ఎలా చెయ్యచ్చో చెప్తూ పొట్ట చెక్కలయ్యేట్లు నవ్విస్తారు.

కార్టూన్లు అరువుతెచ్చుకొన్న భావాలవి కాక అచ్చతెలుగు రచయితలు మన జీవితాల్లోనుంచి తోసుకొన్న విషయాల మీదవి అయితే కార్టూన్లు, జోకులు కూడా ఎంత చక్కగా మారుతున్న మన జీవన శైలిని, విలువల్ని చూపిస్తాయో. ఈ పుస్తకంలో ని అత్తా కోడళ్ళను చూస్తుంటే ఖచ్చితంగా అదే భావన కలుగుతుంది. సూర్యకాతం టైపు గడసరి అత్తల స్థానంలో బక్కచిక్కి రోషాల్ని ఒదులుకోలేక, అధికారం చెలాయించలేక వృధ్ధాశ్రమాలకు పంపుతారేమో అని భయపడుతూ ఉండే ఈ తరం అత్తలూ, కోడు భాషలో అత్తగారు మామగారూ ఇన్ కమింగే గానీ అవుట్ గోయింగ్ లేదు, మూడు రోజుల పాటు తిష్టవేసారని ఫోన్ లో బాధ పడుతున్న గడసరి కోడళ్ళూ ఈ పుస్తకం లో కన్పిస్తారు.

ఇక చీరల స్థానంలో ఆడవారికి జీన్స్, నైటీలూ వేసి సరసిగారు తను లేటెస్ట్ ట్రెండ్ ఫాలో అవుతున్నానని, ఇది ౨౦౧౨ పుస్తకమని చూపిస్తారు. అమెరికా అబ్బాయితో ఆష్ట్రేలియా అమ్మాయి పెళ్ళీ ఆన్లైన్లో ఇండియా పురోహితుడితో జరిపిస్తూ ఇప్పుడు జరుగుతున్నవే కాక జరగ బోయే చిత్రాలను కూడా చిత్రవిచిత్రంగా చూపుస్తారు. గ్లవుజు చేతుల్తో పెళ్ళి చేసుకొనే నెన్నారైలే కాదు ఇంకా పల్లెటూర్లలో మిగిలిఉన్న పొలాలు పంటలూ పెంపుడు జంతువులూ కూడా ఈ యన మనకు చూపిస్తారు. ఆయనకు పరిచయమైన సంగీత విభావర్లూ, సాహిత్య సభలూ, జీన్స్ పాంట్ల తరం గుళ్ళల్లో చేసే విన్యాసాలూ, తాతా మనవళ్ళ సంవాదాలూ, హోమియో మందులు అక్షతలుగా చల్లే డెడికేటెడ్ డాక్టర్లు ఎందరో మనల్ని గిలిగింతలు పెట్టి నవ్విస్తారు.

చిన్న బొమ్మతో చూపించలేని కొన్ని చలోక్తుల్ని వైశాంపాయన కధల రూపంలో మధ్య మధ్యలో కూర్చారు. ఈ వైశంపాయనడు మనకు రోజూ ఎవరో ఒకరి రూపంలో బస్సులోనో, పక్కింట్లోనో, ఆఫీసులోనో తగుల్తునే ఉంటాడు. పుస్తకం పూర్తి చేసే సరికి చిలకమర్తి వారి గణపతి లాగా మనకు మర్చిపోలేని పేరు అవుతుంది ఈ వైశంపాయన నామం.

ఇది రైలు ప్రయాణంలో కొనుక్కొని దిగుతూ వదిలివెళ్ళే జోకుల పుస్తకంకాదు. నింపాదిగా చదివి నవ్వుకొని గుర్తుంచుకొని స్నేహితుల్తో పంచుకొని ఆనందించే పుస్తకం. మనసు చికాకుగా ఉన్నప్పుడు మళ్ళీ అల్మారాలోంచి తీసి చదవదగ్గ పుస్తకం. ఒక పచ్చనోటు తో ఆంధ్ర దేశంలోనూ, ఎర్ర నోటు( పది డాలర్లు) తో అమెరికా వారికీ దొరుకుతుంది ఈ నిలవుండే స్వీట్. sarasicartoonist@gmail.com లో వారిని సంప్రదించవచ్చు.

********
ఈ పుస్తకం ఆన్లైన్ కొనుగోలు లంకె ఇక్కడ.

You Might Also Like

6 Comments

  1. syam prasad gundavarapu

    can u pl. give me the mail id or contact no. of Sri Sarasi garu

    thank u

    Syam Prasad g

  2. sarasi

    thank you all. Sarasi

  3. chelluru.sambamurty

    మైత్రేయి గారూ
    సరసి గారి గురించి ఎంత వ్రాసినా తక్కువే
    అయినా నాకిష్టమైన కార్టూనిస్ట్ గురించి
    మీరు చాలా బాగా వ్రాసారు. ధన్యవాదాలు

    1. మైత్రేయి

      అవునండి. జంఝాల గారి సినిమాల్లా, ధర్మవరపు ఆనందోబ్రహ్మ లా క్లీన్ గా ఉండే హాస్యం కావాలంటే వీరి పుస్తకాలు చదవాల్సిందే. హాస్యం అంటే వెకిలి కాదు, అది అరవైనాల్గు కళల్లో ఒకటి కదా అనే సృహ ఇలాంటివి చదివినప్పుడు కలుగుతుంది.
      చిన్న చిన్న అప్పుతచ్చుల్ని క్షమించండి.
      అన్నట్టు వారి మైల్ ఐడి తప్పుగా పడింది. sarasicartoonist@gmail.com

    2. sarasi

      thank you Maitreyi garu and sambamurthy garu

    3. Pustakam.net

      Corrected the email id. Thanks.

Leave a Reply to sarasi Cancel