సి.ఏ.సి.యం – జనవరి ౨౦౧౨ సంచిక

(అవునండీ, పత్రికల్ని కూడా ఇలా వివరంగా రాయవచ్చు.)

“కమ్యూనికేషన్స్ ఆఫ్ ఏసీయం” అన్నది అసోసియేషన్ ఫర్ కంప్యూటింగ్ మెషినరీ అన్న సంస్థ వారు ౧౯౫౮ నుంచీ వెలువరిస్తున్న మాసపత్రిక. కంప్యూటింగ్, సంబంధిత రంగాల లోని సాంకేతిక-సైద్ధాంతిక అభివృద్ధి, సమకాలీన పరిశోధనల గురించే కాక, కళాశాలల్లో కంప్యూటర్ సైన్స్ బోధనా విధానాల గురించి, టెక్నాలజీ వినియోగం గురించి, సాంకేతికతకు గల సామజిక కోణాల గురించి – ఇలా విభిన్న రకాలైన వ్యాసాలూ, వార్తలూ, చర్చలు అన్నీ కనిపిస్తాయి ఇందులో. మొదట పరిచయమైనప్పుడు ఇది మాములు మనుషులకి కాదు, నిండా మునిగిన పరిశోధకులకి – అని భయపడుతూనే తెరిచినా, ఇందులో అన్ని రకాల వ్యాసాలు ఉండడంతో అప్పట్నుంచి తరుచుగా సందర్శించడం మొదలుపెట్టాను. మొన్నా మధ్య ఒక వర్క్షాప్ ప్రొసీడింగ్స్ పుస్తకం గురించి రాసినప్పుడు అలా సి.ఏ.సి.యం గురించి కూడా ఎవరన్నా రాయొచ్చు కదా అన్న అభిప్రాయం వెలిబుచ్చారు ఒకరు. ఎవరొ ఒకరు మొదలుపెట్టాలి కదా … :)విషయానికొస్తే, ఎప్పట్లాగే జనవరి ౨౦౧౨ సంచిక కూడా వివిధ రకాలైన వ్యాసాలతో వెలువడింది. ఇందులో, నేను చదివి, నాకు అర్థమయ్యాయి అన్న వ్యాసాలను పరిచయం చేస్తాను.
(పత్రిక విషయసూచికను ఇక్కడ చూడవచ్చు. అయితే, అన్నీ మెంబర్స్ కాని వారు చదవలేరు అనుకుంటాను. ఏదన్నా ఆసక్తికరంగా అనిపిస్తే మీకు తెల్సిన మెంబర్స్ ని అడిగి పీ.డీ.ఎఫ్ సంపాదించుకోవడమే తరుణోపాయం అనుకుంటాను.)

మోషే వార్ది గారు ఈ పత్రిక సంపాదకులు. “Artificial Intelligence: Past and Future” అన్న సంపాదకీయ వ్యాసంలో కృత్రిమ మేధ (artificial intelligence) పరిణామ క్రమాన్ని చూస్తూనే, సాధారణంగా సంబంధిత సాంకేతికత గురించి శాస్త్రజ్ఞుల ఆలోచనలు, ఊహలు, ఇతరుల స్పందనలు – ఇలాంటివి టూకీగా ప్రస్తావించారు. అయితే, ఇక్కడ ప్రధాన విషయం ఏమిటి అంటే, ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కున్నా కూడా, కృత్రిమ మేధ మూలాన ఎన్నో పనుల యంత్రీకరణ జరగడం ఆగడం లేదు. కార్లు, ట్రక్కులు కూడా యంత్రాలు నడిపే రోజులు ఎంతో దూరంలో లేకపోవచ్చు. అప్పుడు ఉద్యోగాలు పోగొట్టుకునే వాళ్ళ పరిస్థితి ఏమిటి? నిజంగా మన భవిష్యత్తుకి మన అవసరం ఉందా? అన్న ప్రశ్నతో ముగుస్తుంది ఈ సంపాదకీయం. ఇదే “థీం” ఈ సంచికలో కొన్ని ఇతర వ్యాసాలు చదువుతున్నప్పుడు నేరుగానో, పాక్షికంగానో మళ్ళీ కనబడడం యాదృచ్చికం మాత్రం కాదనుకుంటాను.

సూచిక వరుసలో లేకున్నా, ఇదే థీం లో సాగిన మరో వ్యాసం: అలెక్స్ రైట్ రాసిన “Analyzing Apple Products“. ఒక సంస్థగా యాపిల్ తన పనితీరును గురించి ఎంత గోప్యత వహిస్తుందో, ఐటీ రంగంతో పరిచయం ఉన్న వారికి తెలిసే ఉంటుంది. అలాంటి ఆపిల్ నుండి వెలువడ్డ పరికరాలను తీసుకుని, వాటి నుండి వచ్చే ఆదాయంలో ఆపిల్ లాభం ఎంత? ఎంత వరకు వీళ్ళ పరికరాలు అసెంబుల్ చేసే చైనా కంపెనీలకి వెళ్తాయి? ఏది లాభదాయకం? అని పరిశోధన చేసిన బృందం గురించి, వారి సలహాల గురించి ఈ వ్యాసం. ఈ బృందం ఇంత గోప్యమైన ఆపిల్ నెట్వర్క్లో కూడా వివిధ వ్యక్తులతో మాట్లాడి, ఎన్నో పరిశీలనలు చేసి కనిపెట్టినవి ఏమిటంటే: తన మానుఫాక్చరింగ్ యూనిట్లకి ఆపిల్ రాల్చే రొక్కం చాలా తక్కువని, బాగా హిట్ అయిన ఆపిల్ ప్రొడక్ట్స్ లో దాదాపు అరవై శాతం ఖరీదు యాపిల్ జేబులోకే చేరుతోందనీ. ఒక పక్క రిసెషన్ అనీ, అమెరికాలో ఉద్యోగాలు చైనా వాళ్ళు, ఇండియా వాళ్ళూ తన్నుకు పోతున్నారనీ అక్కడ గోలపెట్టేవారికి.. ఆ ఉద్యోగాలు ఇక్కడే ఉంచేసినా వాటి వల్ల పెద్ద లాభం ఏమీ ఉండదనీ, దానికంటే, ఇలాగే కొనసాగుతూ, ఆపిల్ తరహాలో చక్కటి పరికరాలో, అలాంటి హై-ఎండ్ పనులో చేసి, వాటి ద్వారా బోలెడు డబ్బు గడించమని తేల్చారు అన్నమాట. నిజానికి ఈ భాగం లో ఉన్న లాజిక్ తేటతెల్లమే అయినా కూడా, ఇప్పటి వరకూ చైనా లో మానుఫాక్చరింగ్ ఉన్నందువల్ల వాళ్ళు చాలా లాభ పడుతున్నారు అన్న అపోహలో ఉన్న నాకు జ్ఞానోదయం కలిగింది 🙂

రాన్డల్ సి.పికర్ రాసిన మరో వ్యాసం – “The Yin and Yang of Copyright and Technology” కూడా పై రెండు వ్యాసాల లాగానే, సాంకేతికతకు సాంకేతికేతర అంశాలకు మధ్య ఉండే సంబంధం గురించే. అయితే, ఇక్కడ ఆ రెండో విషయం – చట్టం,న్యాయం. సాంకేతికత అభివృద్ధి చెందిన కొద్దీ కాపీరైట్ అన్న పదానికి అర్థం లేకుండా పోవడాన్ని గురించి వ్యాఖ్యానిస్తూనే, ఏ సాంకేతికత మూలానైతే కాపీరైట్ ఉల్లంఘనలు, పైరసీ పెరిగిపోయయో, అదే సాంకేతికత తో వాటిని ఎదుర్కునే ప్రయత్నాలు చేయాలంటూ, ఆ దిశగా పడుతున్న తొలి అడుగులను ప్రస్తావించడంతో ముగిసిందీ వ్యాసం. నిజానికి, ఇది ఒక అభిప్రాయం మాత్రమే – పరిశీలన కాదు అని నాకు అనిపించింది (నిజమే…అది “వ్యూ పాయింట్” కాలం లో వచ్చింది మరి!!) మరో వ్యాసం “Law and order” కూడా సైబర్ లా, దానికి సంబంధించిన అంశాల చుట్టూనే మరికాస్త వివరంగా సాగుతుంది.

ఫిలిప్ జి. ఆర్మర్ రాసిన “The Difference Engine”  కూడా ఒక్క చిన్న “వ్యూ పాయింట్” వ్యాసం. భిన్న నేపథ్యాల నుండి, వచ్చిన వాళ్ళతో ఏర్పడ్డ జట్టు చర్చల్లో ఉత్పన్నమయ్యే ఆలోచనలు భిన్న కోణాలు తీసుకోస్తాయనీ, చాలా సార్లు వీటి వల్ల పనితీరు మెరుగవుతుందనీ చెప్పిన పరిశోధనను సమర్థిస్తూ సాగిన వ్యాసం ఇది.

Interfaces for the Ordinary user: Can we hide too much?” అన్నది మరో వ్యూ పాయింట్ వ్యాసం. మామూలుగా కొత్త కొత్త ఫోన్లు, టాబ్లెట్లు వగైరాలు అన్నీ వచ్చే కొద్దీ, వీటిని ఉపయోగించడానికి కావలసిన సాంకేతికత తగ్గిపోతూ వస్తోంది. మొదట్లో కంప్యూటర్లు వాడడం ఎవరో “గీక్” ఇంజినీర్లు మాత్రమే చేసేవాళ్ళు. మరి ఇప్పుడో? వయసు, చదువు తేడా లేకుండా అందరూ రకరకాల ఎలెక్ట్రానిక్ పరికరాలు వాడుతున్నారు. ఎందుకూ? అంటే, ఈ కొత్త తరం పరికరాల నిర్మాణం ఎలా ఉంటుంది అంటే మనకి అసలా పరికరం గురించీ ఏమీ తెలీకుండానే దాన్ని మారాజులా వాడుకోవచ్చు కనుక. ఈ వ్యాసంలో దీనికి వ్యతిరేకంగా, ఇలా ఉండడం కంటే ఆయా పరికరాలను ఉపయోగించే వారికీ వాటి పనితీరు గురించి ఎంతో కొంత అవగాహన కలిగేలా తయారుచేయడమే నయం అని. ఎందుకూ? అంటే : రకరకాల కారణాలు. ప్రధానంగా  – ఏదన్నా అవాంతరం వచ్చి పడితే, దాన్ని ఎలా ఎదుర్కోవాలో అర్థం అవుతుంది కనక. యూ.ఐ. రూపొందిస్తున్నప్పుడు ఇలాంటి కోణం గురించి ఇదివరలో నేనెప్పుడూ చదవలేదు కనక, ఆసక్తికరంగానే చదివాను.
Better Medicine Through Machine Learning” అన్న వ్యాసం లో “యాంత్రిక శిక్షణ” (Machine Learning – యంత్రానికి ఒక సమస్యని పరిష్కరించే నేర్పు వచ్చేలా తర్ఫీదు ఇవ్వడం) పద్ధతులను విద్యారంగంలో ఎలా ఉపయోగించుకోవచ్చో టూకీగా వివరించారు. వైద్య రంగంలో ఉదాహరణకి – ఈసీజీం ఎమ్మారై వంటి స్కానులను చూసి, రోగం గురించి ఎలాంటి అంచనాకు రావొచ్చు? – అన్న విషయంలో యాంత్రిక శిక్షణ పద్ధతుల ద్వారా ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి? వంటి విషయాలపై ఆసక్తి ఉంటే, తప్పకుండా చదవండి ఈ వ్యాసాన్ని. కింద రిఫరెన్సులు కూడా ఇచ్చారు ఆసక్తి గలవారి కోసం.  “The state of Phishing attacks” అన్న వ్యాసం ఈ సంచికలో నేను చదివిన వ్యాసాలు అన్నింటిలో నాకు బాగా పరిశోధనాత్మకంగా అనిపించిన వ్యాసం. చాలా వివరంగా అసపు ఫిషింగ్ అంటే ఏమిటి? ఎలా చేస్తారు? ఎలా అరికట్టవచ్చు? అరికట్టడానికి వాడె సాంకేతికత ఎలాంటిది? – అన్నింటి గురించి కొంచెం వివరంగా (బోలెడు రిఫరెంసులతో సహా) రాసిన చక్కటి వ్యాసం ఇది.
ఆధునిక “కృత్రిమ మేధ” రంగపు పితామహుడిగా  పేర్కొనే జాన్ మేకార్తీ ఇటీవలే మరణించారు. అయన గురించి ఒక చిన్న ఎలిజీ “John McCarthy” అన్న వ్యాసం. అలాన్ ట్యూరింగ్ శతజయంతి సంవత్సరం అయినందువల్ల  ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో జరగబోయే ఉత్సవాల గురించి “Celebration Time“, ముప్పై సంవత్సరాల పర్సనల్ కంప్యూటర్ల చరిత్రకి ఒక సింహవలోకనాన్ని”The IBM PC: From beige box to industry standard“,  ఒకప్పటి ట్యూరింగ్ అవార్డు గ్రహీత స్టీఫెన్ కుక్ తో ఒక మాటామంతీ – “Interview with Stephen A. Cook” – కొంచెం చారిత్రక అవగాహనకు ఉపయోగపడే వ్యాసాలు.
ఈ పత్రికలో తమ వెబ్సైటుకు అనుసంధానమై ఉన్న బ్లాగులలోని వ్యాసాలు కూడా అప్పుడప్పుడు ప్రచురిస్తూ ఉంటారు. అలాంటి రెండు వ్యాసాలు: “We are too late for ‘First’ in CS1″, “Again, one sure way to advance Software Engineering”.  మొదటి వ్యాసం – కంప్యూటర్ సైన్స్ విద్యాభ్యాసం లో తొలి అడుగులు ఎలా నేర్పించాలి? అని. ఏది మొదట నేర్పాలి? ఏది మొదట నేర్చుకుంటే సరైన కంప్యూటింగ్ ఆలోచన దృక్పథం అలవడుతుంది? -అన్న విషయాలపై విరివిగా వాదాలు, పరిశోధనలూ జరుగుతూనే ఉన్నా, వ్యాస రచయిత ప్రస్తుత యుగంలో అసలు మొదలు అన్నది లేదు అని అంటారు. ప్రస్తుతం ఉన్న జీవన విధానంలో కాలేజీలో అభ్యాసానికి వచ్చేసరికే వివిధ కంప్యూటింగ్ పరికరాలతో ఉన్న సంబంధం వల్ల విద్యార్థుల మనస్సులో తప్పో,ఒప్పో – కంప్యూటింగ్ గురించి, కంప్యూటర్ల పని తీరు గురించి ఏవో ఒక అభిప్రాయాలు ఎలాగో ఏర్పడి పోయి ఉంటాయి కనుక, వీరి ఆలోచన విధానాన్ని ప్రభావితం చేసేవి ఈ అభిప్రాయాలే కానీ, ఫార్మల్ ఎడ్యుకేషన్ తొలి అడుగులు కాదు అని రచయిత అభిప్రాయం. దీని గురించి బోధనా రంగంలో చేసే పరిశోధనల ప్రస్తావన కూడా ఉంది. కంప్యూటర్ సైన్స్ అధ్యాపకులు గా ఉన్న వారికీ ఆసక్తి కరంగా అనిపించవచ్చు.రెండో వ్యాసంలో – సాఫ్వేర్ తప్పిదాల వల్ల కలిగే ఇబ్బందులను ప్రస్తావిస్తూ, ఇతర సాంకేతిక రంగాల్లో లాగా, ఈ దెబ్బతిన్న సందర్భాలను బాగా లోతుగా అధ్యయనం చేసి, తద్వారా పరిమాణాలు మెరుగుపరుచుకుంటూ ఎలా ముందుకు సాగాలో – ఒక రిమైండర్ లాంటి వ్యాసం.

సంచిక లో చివరి వ్యాసంగా “లాస్ట్ బైట్” కాలంలో డేనియల్ హెచ్.విల్సన్ రాసిన “Future Tense: The Near Cloud” మంచి వ్యంగ్య వ్యాసం – గూగుల్ ఇతర సంస్థలు మన వ్యక్తిగత వివరాలు సేకరించడంలో చూపించే అత్యుత్సాహం గురించి. అలాగే, ఈ దిశలో ఆలోచిస్తే, కాస్త గగుర్పాటు కూడా కలిగిస్తుందీ వ్యాసం, మన గురించి వివిధ వెబ్సైట్ల వాళ్లకి ఎంత స్థాయిలో వివరాలు తెలుస్తాయి అన్న విషయం గురించి ప్రాథమిక అవగాహన ఉన్న ఎవరికైనా.

చివరగా:సంపాదకుడికి రాసిన ఉత్తరాల్లో లో సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్ కూడా ఇంజినీరింగే అంటూ వచ్చిన ఉన్న మొదటి ఉత్తరం ఐటీ కంపెనీల్లో ఉద్యోగులు, వాటిల్లో కాకపోయినా ఏదో ఒకవిధంగా సాఫ్ట్వేర్ తో సంబంధం ఉన్న పనులు చేసేవారూ : ఇద్దరూ తప్పకుండా చదవాల్సిన “డిఫెన్స్” అని నా అభిప్రాయం. ఇవి కాక, గత ఏడాది లో సంస్థ పనితీరు గురించి, అలాగే ఇతర సంస్థలతో కలిసి పనిచేయడం గురించీ, సంస్థ గ్రంథాలయంలో లభ్యం అయ్యే ఈబుక్స్ గురించీ – ఇలాంటి వ్యాసాలు ఉన్నాయి కానీ నేనవి అంత నిశితంగా చదవలేదు.

ఈ విధంగా, నా మట్టుకు నాకు చక్కటి చర్చలతో, అన్నింటికీ మించి మాములు భాషలోనే సాంకేతికతకు సంబంధించిన ఉపయోగాలే కాక, సంఘం పై దాని ప్రభావం గురించి కూడా వివరంగా రాసినందుకు ఈ సంచిక నచ్చింది. అయితే, తరుచుగా ఏదో ఒక వ్యాసం నాకు తెగ నచ్చి, దానికి తాలూకా ఇతర పరిశోధాలు కూడా కనీసం ఒకట్రెండన్నా చదివే “కిక్” ఇస్తుంది. ఈసారి అలాంటి “కిక్” దొరకలేదు. ఫిషింగ్ వ్యాసం ఒక్కటే ఇచ్చీ ఇచ్చినట్లే ఇచ్చి వెనక్కి లాగేసుకుంది. 🙁

You Might Also Like

Leave a Reply