బాపు బొమ్మల కోసం – మన్యంరాణి

కొన్నాళ్ళ క్రితం బాపుగారి దగ్గరనుంచి ఒక ఈమెయిల్ వచ్చింది. వంశీ కొత్త నవల మన్యంరాణి అని స్వాతిలో రాబోతుంది. దానికి బొమ్మలు గీశాను. బాగా వచ్చాయి. మీరు సంతోషిస్తారని పంపిస్తున్నాను అంటూ. ఈమెయిల్‌తో పాటు 25 బొమ్మలు. శైలి బాపుగారిదే కాని బొమ్మల వస్తువు, రంగుల స్కీమూ కొత్తగా ఉన్నాయి. చాలా బొమ్మలు వివిధ భంగిమల్లో ఉన్న అందమైన పెద్ద కళ్ళ నల్లటి కోయపిల్లవి. మిగతా బొమ్మల్లో కొన్ని అడవిలో ఒక వృద్ధుడి బొమ్మలు; మరికొన్ని గిరిజనుల బొమ్మలు ఉన్నాయి. నవలలో ఉన్న వస్తువుకు సంబంధించిన బొమ్మలని తెలుస్తూనే ఉన్నాయి.

ఆ తర్వాత కొన్నాళ్ళకు మన్యంరాణి నవల స్వాతి వారపత్రికలో సీరియల్‌గా వచ్చింది. మొత్తం ఒక్కసారి చదువుదాములే అని పక్కకి పెట్టాను. ఎందుచేతో ఇప్పటివరకూ కుదరలేదు. ఇప్పుడు ఆ నవల పుస్తకంగా వచ్చింది.

వంశీకి (కాకపోతే ఇలియాస్ ఇండియా బుక్స్ వారికి) అందంగా పుస్తకాలు తయారు చేసే అభిరుచి ఉంది. అందంగా పుస్తకాలు ముద్రించితే, ఎక్కువ ఖరీదు పెట్టినా పుస్తకాలు అమ్ముడైపోతాయన్న వ్యాపారసూత్రం కూడా తెలుసుకున్నట్టున్నారు. బాపు బొమ్మలు, అందమైన ఫాంట్లు, పెద్ద మార్జిన్లు, ప్రతి పేజీలో రంగుల బొమ్మల సైడ్‌బార్లతో ఆకర్షణీయంగా డిజైన్ చేసి (అక్షర క్రియేషన్స్ – పొన్నపల్లి సీత), ఆర్టుపేపర్‌ మీద అందంగా ముద్రించిన (కళాజ్యోతి, హైదరాబాదు – బాపన్న) పుస్తకాలు ఆకుపచ్చని జ్ఙాపకంతో మొదలుబెట్టి నిరాఘాటంగా ప్రచురిస్తున్నారు. ఈ పుస్తకాలు హాట్‌కేకుల్లా అమ్ముడైపోతున్నాయని వింటున్నాను. ఇప్పుడు తెలుగు పుస్తకప్రపంచంలో వంశీ ఒక విజయవంతమైన బ్రాండ్‌ ఐనట్లుగా ఉంది.

ఈ పుస్తకం కూడా చాలా అందంగా ఉంది. కాకపోతే, ఇడ్లీ కన్నా పచ్చడి చాలా బాగుంది. చాలా శ్రద్ధగా పేజీలు కంపోజ్ చేయడం వల్ల, ముద్రణలో నాణ్యత వల్ల బాపుగారి బొమ్మలకు న్యాయం జరిగి, ఆయన ప్రతిభ ప్రస్ఫుటంగా కనిపించింది. అందులోనూ కథతో పాటే బొమ్మలు ఉండటంలో ఇలస్ట్రేటర్‌గా బాపు గారి జీనియస్ స్పష్టంగా అవగతం అవుతుంది. మహాప్రభో అని ఈ కళాకారుడి ప్రతిభకు సాష్టాంగ నమస్కారం చేయాలనిపిస్తుంది. బాపు బొమ్మాయిలు ఎప్పటికప్పుడు కొత్తగా అందంగా ఉండటంలో వింతేమీ లేదనుకోండి. కానీ ఈ బొమ్మల్లో చాలావాటిలో రెండు మూడు వస్తువులు కలిపి ఉంటాయి. కథానాయిక బొమ్మకు తోడు, ఒకటో రెండో కథాసంఘటనల వస్తువులు ఉంటాయి. ఈ వస్తువుల్నన్నిటినీ ఒకే ఫ్రేమ్‌లో కంపోజ్ చేసిన విధానం అబ్బురంగా ఉంటుంది. కథ చదవకపోయినా బొమ్మల్ని ఆనందించవచ్చు కానీ, కథ చదివాక బొమ్మల్ని చూస్తే, తరతరాలుగా పాఠకులు, రచయితలు, సంపాదకులు ఈయన బొమ్మలకోసం ఎందుకు ఆరాటపడుతున్నారో కొద్దిగా అవగతం అవుతుంది. 58వ పేజీలో ఉన్న లచ్చన్నమావ బొమ్మ చూడండి. ఒకేరకపు ఐదు బొమ్మల కంపోజిషన్ – యానిమేషన్ చేసినట్టో, సినిమాలో వరుస షాట్లు గుదిగుచ్చినట్లో (జంప్ కట్స్ అంటారనుకుంటా) ఉంటుంది. ఇది కంప్యూటర్ మాయాజాలం కాదు అంటే ఆశ్చర్యపరుస్తుంది. పత్రికలో ఒకవారం ఇన్‌స్టాల్‌మెంట్ ఇల్లస్ట్రేషన్ కోసం ఇంత కష్టం ఎవరు పడతారు స్వామీ? 62వ పేజీలో బొమ్మలో రాజమ్మను అన్వేషిస్తున్న ముగ్గురు నాయకుల్నీ, వారితో ఉన్న రాజమ్మ ముమ్మూర్తుల్నీ ఒకటే ఫ్రేమ్‌లో బంధించిన విధానం చూడండి. ఇది ఆషామాషీగా డెడ్‌లైన్‌కి బొమ్మలు గీసిచ్చేసి చేతులు దులుపుకునే ఇలస్ట్రేటర్ పని కాదు. కథని ఆకళింపు చేసుకుని, సరదాపడి, మనసుపెట్టి, తనకు (మనక్కూడా) సంతృప్తిగా ఉండేలా బొమ్మలు గీసుకున్న ఒక కళాకారుడి భావనా పటిమ. 116వ పేజీలో ఉన్న అడవితల్లి బొమ్మ కంటతడి పెట్టిస్తుంది. 188వ పేజీలో కథాసంఘటను ఆవిష్కృతం చేస్తున్న ఒక్కబొమ్మలోనే లచ్చన్నమావను ధ్వంసమౌతున్న అడవికి ప్రతీకగానూ, లోకంకోసం సిలువెక్కిన క్రీస్తుగానూ చూపగలగడం ఇంకెవరికి సాధ్యం? నమో నమో బాపూ అని పదే పదే అనుకోవాల్సిందే.

బాపుగారి బొమ్మల్ని కంపోజ్ చేయడమే కాక, ప్రతి ప్రకరణం కోసం,ఆ బొమ్మల్లో ఒక అంశాన్ని తీసుకుని ఎడమవైపు పేజీల్లో సైడ్‌బార్‌లోఇమిడ్చిన విధానం పేజీలకి, బొమ్మలకు కొత్త అందాల్ని తెచ్చింది.

రంపచోడవరం ప్రాంతాల్లో ఉన్న గిరిజన పల్లెలు, అక్కడి గిరిజనుల జీవన విధానం, ఆచారవ్యవహారాలు, అటవీసంపద, వివిధ వన్యజీవుల వివరాలు చాలా ఇచ్చారు రచయిత వంశీ. ఈ వివరాలు, వివరణలు చాలా ఆసక్తికరంగా ఉండి ఇంతకుముందు నాకు తెలియని విషయాలు నేర్చుకొన్నాను. వాతావరణాన్ని కళ్ళకు కట్టేట్లా చేసే వంశీ మార్కు వర్ణన పుస్తకమంతటా కనిపిస్తుంది (మగధీర చిత్రం చివర వచ్చే అనగనగా… అనే పాటలో వంశీ మార్కు వర్ణనలపైన అద్బుతమైన పేరడీ ఉంటుంది గమనించారా?). నవలలో అంతర్లీనంగా వనసంపద రక్షణగురించి ఆవేదన ఉంటుంది.

వస్తుపరంగా చూస్తే మన్యంరాణి చాలా పేలవమైన నవల. నాటకీయత ఎక్కువ, విషయం తక్కువ. ఒక అసాధారణమైన ఆదర్శనీయమైన గిరిజన వృద్ధుడు కొమరం లచ్చన్న (లచ్చన్న మావ), ఎప్పుడూ నీళ్ళలో తన అందం చూసుకొని మురుసుకుపోతుండే అద్భుత సుందరి – అతని కూతురు రాజమ్మ, ఆమెను ఒకసారే చూసి మనసు పారేసుకుని మతి పోగొట్టుకొని ఆమె కోసం వెతుకుతున్న ముగ్గురు యువకులు ముఖ్యపాత్రలు. పాత్రలన్నీ (ముఖ్యమైనవీ, ముఖ్యం కానివి కూడా) అట్టముక్కలు, కేరికేచర్లు; ఏమాత్రమూ లోతు లేదు. సంఘటనల్లో అసహజత, అసంబద్ధత ఎక్కువ. చాలా సన్నివేశాలు చవకబారు సినిమాలో సస్పెన్స్ సీన్లలా ఉంటాయి; సంగీతం ఒక్కటే తక్కువ. ఒకే రకం సన్నివేశాలు మళ్ళీ మళ్ళీ వస్తుంటాయి. మన్యంరాణి టైటిల్ బాగుంది అనుకొన్నట్టున్నారు రచయిత; తెలుగు సినిమాల్లో లాగానే పుస్తకం మొదట్లో (మూడో పేరాలో) ఆ మాట ఒకసారి వాడేసి ఇక సరిపోయిందిలే అనేసుకున్నారనుకొంటా. కొన్నిచోట్ల వాక్యనిర్మాణంలో వ్యాకరణం తప్పి చదవటానికి ఇబ్బందిగా అనిపించింది. వంశీ కథలకు వచ్చిన పేరు నవలలకు ఎందుకు రాలేదో ఈ పుస్తకం చదివితే కొంత తెలియవచ్చు.

బొమ్మలూ, పెద్ద ఫాంట్లూ, అలంకరణలూ లేకుండా ముద్రించి ఉంటే ఈ 199 పేజీల పుస్తకం, బహుశా 90-100 పేజీల పుస్తకం అయి ఉండేది. 250 రూపాయల ధర అవసరం ఉండేది కాదు. ఐతే అప్పుడు ఈ పుస్తకం గురించి ఇంతగా చెప్పుకోవలసిన అవసరమూ కూడా ఉండేది కాదు. పుస్తకం తయారీ ఖర్చుల గురించి నాకు పూర్తి అవగాహన లేని కారణం చేత ఈ పుస్తకానికి ఈ ధర ఎంత సబబో నేను చెప్పలేను. ఇంత అందమైన పుస్తకంలోనూ అచ్చుతప్పులు బాగానే తగలటం శోచనీయం.

ఎంత బాగున్నా పచ్చడి ఒక్కటే తింటే పూర్తి ఆనందం కలగదు. అలాగే బాపుగారి బొమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకొని ఆనందించాలంటే ఈ నవల చదివాలి. ఆయనకు ఈ బొమ్మలు గీసే (మనకు చూసి ఆనందించే) అవకాశం ఇచ్చినందుకు నవల రచయిత వంశీకి, స్వాతి సంపాదకుడు శ్రీ బలరాంకు కృతజ్ఞతలు.

బాపుగారి బొమ్మలకోసం కొని దాచుకోదగ్గ పుస్తకం.

మన్యంరాణి
వంశీ
జనవరి 2012
ఇలియాస్ ఇండియా బుక్స్
4వ అంతస్తు, ఫ్లాట్ నెంబర్ 13
ఫేజ్. 3, జుబ్లి హిల్స్
హైదరాబాద్ 500033
పంపిణీ: విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్
199 పేజీలు; 250 రూ.

You Might Also Like

4 Comments

  1. bnim

    హాయిగా ఉంది

  2. Jampala Chowdary

    మన్యంరాణి పుస్తకం ఇంకా పుస్తకాలషాపుల్లో దొరుకుతుందనుకొంటాను. ప్రయత్నించండి. బొమ్మలు ఈమెయిల్లో పంపించే హక్కు నాకు లేదు.

  3. surya వెంకట సుబ్రహ్మణ్యం నూకిరెడ్డి

    surya వెంకట సుబ్రహ్మణ్యం నూకిరెడ్డి
    జంపాల చౌదరి గారూ..

    నాకు బాపు బొమ్మలంటే ప్రాణం.. చిన్నపాటి ఆర్టిస్టును కూడా.. అంటే కేవలం చిన్నప్పుడే లేండి. ఇప్పుడు క్లో త్ ఫై వేస్తుంటాను సేకరణ నాహాబి

    మీరు ఏమీ అనుకోకపోతే.. మన్యంరాణి బొమ్మలు నా మెయిల్ కు పంపితే.. చూసుకుని తరిస్తాను.. మీ మెయిల్ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తుంటాను..

    నా మెయిల్ nukireddy@జిమెయిల్.com

  4. satyanarayana garidepally

    జంపాల చౌదరి గారూ..

    నాకు బాపు బొమ్మలంటే ప్రాణం.. చిన్నపాటి ఆర్టిస్టును కూడా.. అంటే కేవలం చిన్నప్పుడే లేండి. ఇప్పుడు కేవలం చిత్ర కళాప్రేమికుడిని మాత్రమే. ఓ సారి స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో బాపు బొమ్మల కొలువు పెడితే.. రెండు రోజులు వెళ్లి.. చిన్నపాటి కెమేరాలో ఆ బొమ్మలన్నీ నింపుకొని వచ్చాను.

    మీరు ఏమీ అనుకోకపోతే.. మన్యంరాణి బొమ్మలు నా మెయిల్ కు పంపితే.. చూసుకుని తరిస్తాను.. మీ మెయిల్ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తుంటాను..

    నా మెయిల్ garide78@gmail.com

    ధన్యవాదాలతో.. సత్యనారాయణ గరిడేపల్లి

Leave a Reply