నా జీవితం లో టాగోర్

టాగోర్ – నా జీవితంలో ప్రతి దశలోనూ ఎలాగో ఒకలా నన్ను వెంటాడుతూనే వచ్చాడు. చిన్నప్పుడు అంత తెలిసేది కాదు కానీ, ఊహతెలిసి, ప్రపంచం చూస్తూ ఉండే కొద్దీ, ఇతనొచ్చి నాపై ఏదో ముద్ర వేసేసి, ఇట్టే మాయమై, మళ్ళీ ఉన్నట్లుండి ప్రత్యక్షమై, కొంతకాలం మనసులో తిష్టవేసి – ఈ చక్రం కాలచక్రంలాగా తిరుగుతూ మళ్ళీ మళ్ళీ జరుగుతూ ఉండటం తెలుస్తూనే ఉంది. ఓసారి ఈ దశల్ని తలుచుకోడం ఇప్పుడీ వ్యాసం ఉద్దేశం.

మొదటి దశ: చిన్నప్పుడు స్కూల్లో మాకో పేద్ద లైబ్రరీ ఉండేది. నేను చాలాసార్లు అక్కడ మకాం వేస్తూ ఉండేదాన్ని – నాన్సీ డ్రూ కోసం. అయితే, అప్పుడప్పుడూ “Rabindranath Tagore’s Our universe” పుస్తకం తరుచుగా కనిపిస్తూ ఉండేది. టాగోరంటే “జనగణమణ” రాసినాయన, గీతాంజలి కి నోబెల్ ప్రైజ్ తెచ్చుకున్నాయన అని పుస్తకాల్లో చెప్పడం ఒక ఎత్తు. అప్పట్లో మొదటిసారి మా అమ్మ ద్వారా విన్న “Where the mind is without fear” కవిత ఒక ఎత్తు. తరువాత టెక్స్ట్ బుక్ లో “Leave this chanting and singing and telling of beads” అంటూ ఓ కవిత ఉండేది. ఈ టాగోరూ, ఆ “Our universe” టాగోరూ ఒకరే అని అర్థం కావడానికి కాస్త టైమ్ పట్టింది. అప్పటికి మా లైబ్రరీలో ఆ పుస్తకం పై నాకు ఆసక్తి పోయింది. పదమూడేళ్ళ వయసులో టాగోర్ పిల్లలకోసం రాసిన కథల పుస్తకం ఒకటి చదివాను (NAME! పేరు గుర్తురావట్లేదూ!). తరువాత “పోస్టాఫీస్” చదివాను. ఈ రెండూ 1996-1997 ప్రాంతంలో చదివాను అని నా పుస్తకాల లాగ్బుక్ చెబుతోంది. తరువాత “కాబూలీవాలా” కథ – మొదట మా అమ్మ చెబితే విన్నాను, తరువాత పాఠ్యాంశంగా చదివాను. అక్కడికి ఆ దశ ముగిసిపోయింది. కాకుంటే, టాగోర్ ఏ పుస్తకాలు రాసాడు? ఎంత versatile మనిషి అన్న అవగాహన మాత్రం కలిగింది. tagore15nu

రెండో దశ: మొదటిదానంత సీన్ దీనికి లేదు లెండి. ఈ దశలో నేను చదివిందే పరమ తక్కువ. దానిలో టాగోర్ ని చదివింది ఇంకా తక్కువ. అప్పుడోటీ ఇప్పుడోటీ ఓ కవిత చదవడం – “వావ్! సింపుల్గా భలే ఉందే!” అనో, “ఏంటో..ఏం రాసాడో, ఏం చదివానో” అనో అనుకోడం, వదిలేయడం. అప్పుడప్పుడూ ఓ కథో, వ్యాసమో, ఓ కొటేషనో చదివి – ఈయన భలే ఇంటరెస్టింగ్ మనిషే అనుకోడం. ఈయనకి తెలీని విషయం ఉందా? అని ఆశ్చర్య పడి వదిలేయడం. నాకు మంచో చెడో..అసలే లైబ్రరీకి ఆక్సెస్ లేకపోవడం, అన్ని పుస్తకాలున్న మా ఇంట్లో టాగోర్ కి స్థానం లేకపోవడం : ఈ రెండూ దీనికి ప్రధాన కారణాలు.

మూడోదశ: 2006-2007. “The last poems of Rabindranath Tagore” అన్న పుస్తకం చూశాను మా కాలేజీ లైబ్రరీలో. మొదటిది చదువుతూ ఉంటేనే దిమ్మతిరిగి మైండు బ్లాకైంది. అదే ఎన్నిసార్లు చదువుతూ ఉండిపోయానో. ఈ పుస్తకం తరువాత మళ్ళీ టాగోర్ నా జీవితంలోకి దాడి చేసాడు. ఈసారి పర్మనెంటు దాడి అనమాట. “Selected short stories of Tagore” లో కొన్ని ఇలాగే లైబ్రరీలో తిష్టేసి చదివాను. తరుచుగా ఆ మైండు బ్లాక్ చేసిన కవిత భజన చేసుకుంటూ అప్పుడప్పుడూ “Crescent moon”, “Stray Birds” వంటి సంకలనాలను తిరగేస్తూ ఉండగా చదివిన “Home and the world” – నన్ను టాగోర్ కి ఓ మోస్తరు భక్తురాలిని చేసిందని చెప్పవచ్చు. నాలో ఆ తరహా ఆలోచనలున్నప్పుడు నేను టాగోర్ “యూనివర్సలిజం” గురించి తెలిపే ఇలాంటి నవల చదవడం దానికి కారణం కావొచ్చు. మధ్య మధ్య టాగోర్ వ్యాసాలు చదవుతూ కూడా ఆయనంటే అభిమానం పెరిగింది.

నాలుగోదశ: 2008. ఇదీ ప్రధాన దశ. పుట్టినరోజు కానుకగా వచ్చిన “గోరా” నన్ను మింగేసింది. వెంటాడింది. టాగోర్ కు మనసులో ఇల్లు కట్టుకునే లా చేసింది. అప్పుడెప్పుడో చూసిన “ఛోకర్ బాలీ” సినిమాను పుస్తకంగా చదివేలా చేసింది. తరువాత “My live in my words” – టాగోర్ ఆత్మకథ (ఆత్మకథలా తయారుచేయబడ్డ జీవితచిత్రణ) ను చదివి టాగోర్ కు ఓ భజన సంఘం పెట్టేసుకున్నా నాలోనేనే. “Boyhood Days” చదివాను తరువాత. అడపాదడపా కవితలు, వ్యాసాలు చదివేదాన్ని. “Selected works of Rabindranath Tagore” – అన్న ఓ మాలావు పుస్తకాన్ని ఎప్పుడు వీలు చిక్కితే అప్పుడు తిరగేస్తూ, స్నేహితులకందరికీ ఈ దశలో చదివిన ప్రతిదాని గురించీ ఊదరగొడుతూ ఉండేదాన్ని.

నాలుగైదు నెల్లుగా టాగోర్ కి విశ్రాంతినిచ్చాను. ఎందుకంటే చెప్పలేను. ఎందుకో! మళ్ళీ ఎప్పుడో నా ఐదో దశ త్వరలోనే మొదలౌతుందని మాత్రం అనిపిస్తోంది. రోజూ మనసులో ఉన్న తనింటి కిటికీలోంచి ఆ గడ్డం దువ్వుకుంటూ నా వైపు చూసి నవ్వుతున్నాడు మరి – నన్నొదిలి పోలేవని. నాకూ తెలుసు అతన్ని నేను వదలడం అసంభవమని. నా ఆలోచనల్లో ఆయనో భాగమైపోయాడనిపిస్తోంది.

You Might Also Like

7 Comments

  1. ysaisantosh

    I don’t have words to say about your passion.If you dont mind ,I want be a friend to you.replay please.

  2. అరుణ పప్పు

    మీ శైలి బాగుంది సౌమ్యా…

  3. bendalam krishna rao

    ee vyaasam chalaabaagundi.sowmya gariki abhinandanalu ——–krishna…srikakulam

  4. Purnima

    బాగుంది! 🙂

  5. రవి

    ఈ నెల ఫోకస్ ఠాగూర్ అయినందువల్లనో, మరెందువల్లో తెలియదు, ఫోకస్ వ్యాసాలు చాలా బావుంటున్నాయి. అందమైన వ్యాసాల పరంపరలో బాబా గారు, పూర్ణిమ, ఇప్పుడు మీరు. అభినందనలు.

  6. మాలతి

    🙂 Beautiful!

Leave a Reply